వింజమూరు: వింజమూరులో పంచాయితీ అధికారులు తమకు జీతాలు చెల్లించడం లేదంటూ పంచాయితీ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు దిగారు. సి.ఐ.టి.యు కార్మిక సంఘం, యం.ఆర్.పి.ఎస్ ఉద్యమ సంఘాల నేతృత్వంలో స్థానిక గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద వారు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు మండల కన్వీనర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రెక్కాడితే గానీ డొక్కాడని పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు పంచాయితీ అధికారులు జీతాలు చెల్లించకపోవడం హేయనీయమన్నారు. మేజర్ పంచాయితీ అయిన వింజమూరులో ఇబ్బడి ముబ్బడిగా పేరుకుపోతున్న చెత్తా చెదారమును నిత్యం తొలగిస్తూ ప్రజల ఆరోగ్యమును కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికుల పట్ల అధికారులు వ్యవహరిస్తున్న మొండి వైఖరిని విడనాడాలన్నారు. 132, 142 జీ.ఓ లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. యం.ఆర్.పి.ఎస్ జిల్లా అధికార ప్రతినిధి పందిట.అంబేద్కర్ మాదిగ మాట్లాడుతూ గత 5 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు అధికారులు జీతాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రభుత్వాలు చిన్నచూపు చూడటం తగదన్నారు. వెంటనే స్పందించి పాత బకాయిలను చెల్లించి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో యం.ఆర్.పి.ఎస్ మండల ఇంచార్జ్ గొల్లపల్లి. నాగరాజు, గంగపట్ల. అజయ్, గంగపట్ల.శివ, నల్లిపోగు.పెంచల కుమార్, జి.బాబు, ఆవులూరి.హజరత్, ఎద్దల.కొండమ్మ, కర్రా.వెంగమ్మ, గంగపట్ల.దొరసానమ్మ, జి.ఆదిలక్ష్మి లతో పాటు కాంట్రాక్టు పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.
వింజమూరులో సమ్మెబాట పట్టిన పారిశుద్ధ్య కార్మికులు