--
తేది-05.10.2019
జగన్ రాష్ట్రంలో చెప్పేదొకటి, ఢిల్లీలో చేసేది మరోకటి
ప్రధాని దగ్గర ప్రత్యేక హోదా పదం ఎత్తడానికే జగన్ భయపడుతున్నారు
*కిమిడి కళా వెంకట్రావు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు*
5 కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా జగన్ అజెండాలోనే లేదు అనే విషయం మరోసారి స్పష్టమైంది. డిల్లీలో ప్రధానితో భేటీ అయిన ముఖ్యమంత్రి జగన్ హోదా గురించి ఎందుకు మాట్లాడలేదు? హోదా కన్నా జగన్‌కి వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమా? పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట హోదా అనే పదం ఎత్తాలంటే నే వైసీపీ బయపడుతోంది. ఒక్క తెలుగుదేశం పార్టీనే హోదా కోసం పార్లమెంట్లో పోరాటం చేసింది. రాష్ట్రంలో 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన వైఎస్ జగన్.. 22 మంది ఎంపీలు ఉన్నా.. నేడు కనీసం నోరు మెదపడం లేదు. విభజన హామీలను గాలికొదిలేసి, తన కేసుల మాఫీ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రధాని మోడీని కలిసి సాష్టాంగపడ్డారు. రైతు భరోసా కార్యక్రమానికి మోడీని ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్తున్నానని రాష్ట్రంలో చెప్పి.. ఢిల్లీలో మాత్రం మరొకటి చేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో తన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలంటూ జగన్ వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన వెంటనే ఆఘమేఘాల మీద ఢిల్లీ వెళ్ళి ప్రధానితో భేటీ అయ్యారు. సీబీఐ వ్యాఖ్యలపై జగన్ ఎందుకు నోరు మెదపడం లేదు? సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు ప్రతి శుక్రవారం వ్యక్తిగతంగా హాజరుకావలసిందేననే సీబీఐ వ్యాఖ్యలు జగన్‌కు చెంపపెట్టు లాంటిది.
రాష్ట్ర ప్రయోజనాలను జగన్ ఢిల్లీలో తాకట్టుపెడుతున్నారు. ప్రత్యేక హోదాపై అడుగుతూనే ఉంటా.. సార్ ప్లీజ్.. సార్ ప్లీజ్ అని అభ్యర్థించాల్సిందేననే జగన్ వైఖరి రాష్ట్రానికి శాపంగా మారింది. ప్రత్యేక హోదాతో సహా విభజన చట్టంలో అంశాల అమలుపై, అప్పటి ప్రధాని ఇచ్చిన హామీల అమలుపై, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంపై జగన్మోహన్ రెడ్డి పోరాటం మాటలకే పరిమితం అయింది. మరోవైపు ఏపీ పట్ల ధృతరాష్ట్ర కౌగిలి ప్రదర్శిస్తున్న కేసీఆర్‌ను నమ్మి ఏపీని నట్టేట ముంచేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లోని ఏపీకి చెందిన సచివాలయ భవనాలు, హెచ్‌వోడీ భవనాలను ఏకపక్షంగా, ఎవరినీ సంప్రదించకుండా ఆఘమేఘాల మీద తెలంగాణకు అప్పగించారు. ఇప్పుడు కేసీఆర్‌తో క్విడ్ ప్రో కోలో భాగంగా తెలంగాణ భూభాగంలో ఏపీ ప్రాజెక్టులు నిర్మించేందుకు కుట్రలు పన్నుతున్నారు. జగన్, కేసీఆర్ కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇసుక మాఫియా, మద్యం మాఫియా, కరెంట్ కోతలు, బోటు మునక, యురేనియం తవ్వకాలు, పేపర్ లీకేజీలతో నేడు రాష్ట్రంలో రివర్స్, రిజర్వ్ పాలన సాగుతోంది. రాష్ట్ర సమస్యలను గాలికోదిలేసి స్వప్రయోజనాల కోసం పాకులాడుతున్న జగన్మోహన్రెడ్డికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.