చంద్రబాబుతో స్నేహం చేయాల్సిన అవసరం మాకు లేదు: జీవీఎల్

చంద్రబాబుతో స్నేహం చేయాల్సిన అవసరం మాకు లేదు: జీవీఎల్
విజయవాడ : దేశంలో మోదీ, షా ద్వయం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని.. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యమని ఆ పార్టీ నేత జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. ఏపీపై దృష్టి పెట్టి అనేక‌ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గతంలో ఎప్పుడూ లేని‌ విధంగా ఏపీకి అనేక సంస్థలు తెచ్చామన్నారు. జల్ జీవన్ మిషన్ అనే అతి పెద్ద ప్రాజెక్టు కేంద్రం ప్రారంభించబోతోందని జీవీఎల్ వెల్లడించారు. ఈ మిషన్ ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. భారత ఆర్థిక‌ వ్యవస్థను 1.7 నుంచి 2.7 ట్రిలియన్ డాలర్లకు పెంచామన్నారు. ఇప్పుడు ఐదు ట్రిలియన్ డాలర్లు లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. తాము తప్పు చేశామని‌ చంద్రబాబు ఇప్పుడు అంటున్నారని.. ఆ రోజు ఎన్ని సార్లు చెప్పినా ఆయన చెవికెక్కలేదన్నారు. చంద్రబాబుకు సిద్ధాంతం, విధానం లేదని.. చంద్రబాబుతో స్నేహం చేయాల్సిన అవసరం తమకు లేదని జీవీఎల్ స్పష్టం చేశారు. టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వచ్చారని... లోక్‌సభ ఎంపీలతో తమకు అసలు అవసరమే లేదన్నారు. ఏపీలో తమంతట తామే ఒక‌ శక్తిగా ఎదగాలని చూస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికలలో తమ శక్తి ఏమిటో అందరికీ తెలుస్తుందని జీవీఎల్ పేర్కొన్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఒంటరిగా సీఎం కాలేదని.. బీజేపీతో పొత్తు వల్ల చంద్రబాబు రెండుసార్లు సీఎం అయ్యారన్నారు. ఆంధ్రజ్యోతి విలేకరి సత్యనారాయణ హత్యను ఖండిస్తున్నామన్నారు. పాత్రికేయులకే భద్రత లేదంటే.. అది ప్రజాస్వామ్యానికి మచ్చ అవుతుందని జీవీఎల్‌ వ్యాఖ్యానించారు.