ప్రధానితో కీలక సమావేశం: ఈ భేటీలో ఆ ఇష్యూకు ముగింపు..!

ఢిల్లీకి ముఖ్యమంత్రి జగన్: ప్రధానితో కీలక సమావేశం: ఈ భేటీలో ఆ ఇష్యూకు ముగింపు..!


ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి జగన్..ప్రధాని మోదీతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ పూర్తయిన తరువాత ఏపీ ముఖ్యమంత్రి ప్రధానితో భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలో ఏపీలో ప్రభుత్వ అమలు చేస్తున్న చర్యలు..రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరం ప్రాజెక్టులో తగ్గిన వ్యయం గురించి ప్రధానికి వివరించనున్నారు. పోలవరం నిర్మాణ ఖర్చును కేంద్రం రీయంబర్స్ చేస్తున్న సమయంలో ఈ మొత్తం ఒక విధంగా కేంద్రానికి మేలు జరిగే అంశం.


అదే విధంగా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం సమీక్ష నిర్ణయం తో గతంలో ప్రధానితో జరిగిన చర్చకు కొనసాగింపుగా తాను తీసుకున్న చర్యలు.. కేంద్ర మంత్రి..బీజేపీ నేతల వ్యాఖ్యలను ప్రధానికి వివరించనున్నారు. ఇక.. ఈ నెల 15న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వైయస్సార్ రైతు భరోసా కార్యక్రమం ప్రారంభిస్తోంది. దీనికి ప్రధానిని ఏపీ ముఖ్యమంత్రి ఆహ్వానించనున్నారు. ఏపీలో ఆర్దిక పరిస్థితి దారుణంగా ఉండటంతో కేంద్ర సాయం గురించి ముఖ్యమంత్రి నివేదించనున్నారు. ఏపీకి అండగా నిలుస్తామనే ప్రధాని హామీతో పాటుగా రాజకీయంగా కీలక అంశాల పైన ప్రధానితో చర్చించే అవకాశం ఉంది.


ప్రధానితో సీఎం జగన్ భేటీ ఖరారు..


ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీతో భేటీ ఖరారైంది. ఈ నెల 5న ఢిల్లీలో సమావేశం జరగనుంది. ఇందులో ప్రధానంగా ఏపీలో నెలకొన్ని తాజా పరిస్థితుల గురించి వివరించనున్నారు. ఏపీలో ప్రస్తుతం ఆర్దిక పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. అదే సమయంలో కేంద్రం నుండి సాయం అందించాలని జగన్ కోరనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి తో ప్రధాని భేటీ పూర్తయిన తరువాత జగన్ భేటీ అవుతున్నారు. కేసీఆర్ తో భేటీకి సంబంధించిన చర్చల సారాంశాన్ని సైతం జగన్ వివరించనున్నారు.


విద్యుత్ కోతలకు కారణాలను


ఇక.. ఏపీలో ప్రస్తుతం విద్యుత్ కోతలకు కారణాలను వివరిస్తూ..తెలంగాణ నుండి బొగ్గు తీసుకుంటున్న విషయం అదే విధంగా కేంద్రం నుండి అందించాల్సిన సాయం పైన నివేదిక ఇవ్వనున్నారు. రాజధాని వ్యవహారం పైన ప్రధానితో చర్చించనున్నారు. అమరావతి మాత్రమే కాకుండా.. అధికార వికేంద్రకరణ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించనున్నారు.


రివర్స్ టెండరింగ్ పైన నివేదిక..


జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరం ప్రాజెక్టు విషయంలో తమ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటి వరకు దాదాపు రూ.900 కోట్లు తక్కువకే కాంట్రాక్టర్లు ముందుకు వచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి ప్రధానికి నివేదిస్తారు. దీని ద్వారా కేంద్ర రీయంబర్స్ చేస్తున్న ఈ ప్రాజెక్టు మొత్తానికి ఖర్చు తగ్గించేందుకు..అదే సమయంలో గత ప్రభుత్వం చేసిన అవినీతి బయట పడిందని ముఖ్యమంత్రి నివేదించే అవకాశం ఉంది. ఇక, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల సమీక్షలో భాగంగా జగన్ గతంలోనే ప్రధానికి తన ఉద్దేశాన్ని వివరించారు.


ప్రధాని సైతం


తప్పు జరిగితే చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రధాని సైతం వ్యాఖ్యానించారు. అయితే.. కొద్ది రోజులుగా కేంద్ర మంత్రి సింగ్ అసలు పీపీఏల్లో అవినీతి జరగలేదని చెప్పటం పైన ప్రధాని వద్ద జగన్ ప్రస్తావించే అవకాశం ఉంది. డిస్కం లు ఇప్పటికే 20 వేల కోట్ల నష్టాల్లో ఉన్న విషయాన్ని వివరించి.. పీపీఏల్లో సమీక్ష ద్వారా ధరలు తగ్గించుకొనే అవకాశం ఇవ్వాలని జగన్ కోరనున్నారు.


ప్రధానికి..జలశక్తి మంత్రికి ఆహ్వానం..


ఇక, రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15న రైతుల కోసం వైయస్సార్ రైతు భరోసా పధకాన్ని ప్రారంభించనుంది. దీని ద్వారా ప్రతీ రైతుకు ఏడాదికి 12,500 రూపాయాలు సాయంగా అందించనుంది. అయితే, ఇందులో ఏపీ ప్రభుత్వం ఆరు వేల కోట్లు..కేంద్ర సాయం ఆరు వేల కోట్లు ఉంది. దీంతో..ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ప్రధానిని ఇప్పటికే జగన్ ఆహ్వానించారు. అయితే..ఈ పర్యటన ద్వారా ఈ పధకం రాష్ట్ర.. కేంద్ర ప్రభుత్వాల సంయుక్తంగా అమలు చేస్తున్న పధకం కావటంతో ప్రధానిని కార్యక్రమ ప్రారంభోత్సవానికి రావాలని జగన్ మరోసారి ఆహ్వానించనున్నారు. అదే విధంగా తెలంగాణతో ప్రాజెక్టుల విషయంలో కలిసి వెళ్లాలని భావిస్తున్న సమయం..దీంతో పాటుగా పోలవరం భవిష్యత్ ప్రణాళిక ఖరారు కోసం అపెక్స్ సమావేశంతో పాటుగా పీపీఏ సమావేశం ఏర్పాటుకు కేంద్ర మంత్రి షెకావత్ ను ముఖ్యమంత్రి కలవనున్నారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కలిసి రాజకీయ అంశాలు చర్చించనున్నారు.