కేఎల్యులో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్య
* అడ్మిషన్ నోటీఫికేషన్ విడుదల కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్‌భాషా
* రెండు దఫాలుగా ఆన్లైన్ పరీక్షలు
* ఆన్లైన్లో అందుబాటులో దరఖాస్తులు
* కేఎల్యు ప్రొ. వైస్‌ఛాన్సలర్ డాక్టర్ ఏ.రామకుమార్
విజయవాడ: విజయవాడ: 2020 విద్యా సంవత్సరానికి సంబంధించి కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్, పోస్టుగ్రాడ్యూయేషన్ కోర్సుల్లో ప్రవేశానికి అడ్మిషన్ల నోటీఫికేషన్‌ను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనార్టీ శాఖ మంత్రి ఎస్.బి.అంజాద్ భాషా విడుదల చేశారు. గవర్నరుపేటలోని మ్యూజియం రోడ్డులో ఉన్న కేఎల్ యూనివర్శిటీ అడ్మినిస్ట్రేటీవ్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో అడ్మిషన్లకు సంబంధించి బ్రోచర్‌ను, గోడప్రతులను ఆవిష్కరించారు. అనంతరం ఉపముఖ్యమంత్రి అంజాద్ భాషా మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అత్యున్నత స్థాయి విద్యను అందించడంలో కేఎల్ యూనివర్శిటీ ప్రధమ స్థానంలో ఉందని తెలిపారు. ఇంజనీరింగ్ విద్య పూర్తయ్యేలోగానే ప్రతి విద్యార్థికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కేఎల్ యూనివర్శిటీ కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. గడచిన నాలుగు దశాబ్ధాలుగా ఎంతోమంది విద్యార్థులకు సాంకేతిక విద్య,ను అందించి అగ్ర స్థానంలో నిలబెట్టిందని తెలిపారు. కేఎల్ యూనివర్శిటీ ప్రొ. వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఏ.రామకుమార్ వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి గాను నోటీఫికేషన్‌ను విడుదల చేసినట్లు తెలిపారు. బీటెక్, ఇంజనీరింగ్ కోర్సులలో రెండు దఫాలుగా ఆన్ లైన్ పరీక్షను నిర్వహించినట్లు చెప్పారు. డిసెంబరు 16 నుండి 22 వరకు మొదటి దఫా ఆన్ లైన్ పరీక్ష, 2020 ఏప్రియల్ 13 నుండి 20వ తేదీ వరకు రెండో దఫా ఆన్ లైన్ పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా లేదా యూనివర్శిటీ స్టటీ సెంటర్ల ద్వారా గాని పొందవచ్చని తెలిపారు. బీటెక్ నాలుగు సంవత్సరాల కాలవ్యవధి గల కోర్సులలో బయోటెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయని తెలిపారు. మెరిట్ విద్యార్థులకు 25 లక్షలకు పైగా నగదు అవార్డులను అందజేస్తున్నామని చెప్పారు. కేఎల్ఈఈఈ-2020 ప్రవేశ పరీక్షలో మెరిట్ ర్యాంకు సాధించినవారికి నగదు అవార్డులు ఉన్నట్లు తెలిపారు. కేఎల్ఈఈఈ 2020లో 1 నుంచి వెయ్యి ర్యాంకులు పొందినవారికి, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ 2020 ఒకటి నుంచి 5 వేల ర్యాంకు పొందినవారికి, జేఈఈ మెయిన్స్‌లో వంద మార్కులు పైన సాధించినవారికి, ఇంటర్మీడియట్లో 96 శాతం గ్రేడ్ యావరేజ్ సాధించివారికి, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈలో 9.0 సీజీపీఏ పైన సాధించినవారికి మెరిట్ స్కాలర్షిప్లు ఉంటాయని తెలిపారు. కేఎల్ విశ్వవిద్యాలయంలో దేశంలో ప్రముఖ కార్పొరేట్ కంపెనీలచే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహించి నూరుశాతం ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న ఏకైక విశ్వవిద్యాలయం కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం అని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలతో సైతం కేఎల్ విశ్వవిద్యాలయం భాగస్వామిగా ఉండి ఇంటర్నేషనల్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఒక సెమిస్టర్ విదేశీ విద్యాలయంలో చదువుకునే అవకాశం ఉందని తెలిపారు. కేఎల్ విద్యార్థులకు ఫ్రెంచ్, చైనీస్, జపనీస్, జర్మన్ భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించే విధంగా శిక్షణ అందిస్తున్నామని వెల్లడించారు. విలేకరుల సమావేశంలో కేఎల్ డీమ్డ్ యూనివర్శిటీ చీఫ్ కోఆర్డినేటింగ్ అధికారి డాక్టర్ జగదీష్, అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జే.శ్రీనివాసరావు, అసిస్టెంట్ డైరెక్టర్ లు బి ఎస్ ఎన్ మూర్తి, బాలాజీ శ్రీనివాస్, హెచ్.ఎస్.ఆర్.మూర్తి తదితరులు పాల్గొన్నారు.
కేఎల్యులో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్య