శ్రీసిటీలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ధ్యాన కేంద్రం ప్రారంభం

 

శ్రీసిటీలో "ఆర్ట్ ఆఫ్ లివింగ్" ధ్యాన కేంద్రం ప్రారంభం 

 

 

  శ్రీసిటీ అక్టోబర్ 11,(అంతిమ తీర్పు):         ధ్యాన గురువు శ్రీ శ్రీ రవిశంకర్ నేతృత్వంలోని "ఆర్ట్ ఆఫ్ లివింగ్" ధ్యాన కేంద్రం శాఖను శుక్రవారం శ్రీసిటీలో ప్రారంభించారు. శ్రీరామ్ లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ తమిళనాడు స్టేట్ మాజీ ప్రెసిడెంట్ అఖిలా శ్రీనివాసన్ లాంఛనంగా దీనిని ప్రారంభించారు. 

 

ఈ సందర్భంగా అఖిలా శ్రీనివాసన్ మాట్లాడుతూ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ధ్యాన సూత్రాల ద్వారా ప్రతి ఒక్కరు మానసిక, శారీరక, భావోద్యేగ పటుత్వం, లబ్ది పొందవచ్చన్నారు. ఒత్తిడితో కూడిన ప్రస్తుత జీవన విధానంలో ధ్యానం, యోగా ఆవశ్యకత గురించి ఆమె వివరించారు. రోజు గంట సేపు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా నేర్చుకునే ప్రాణాయామా, క్రియా, బ్రీతింగ్ టెక్నిక్స్ అమలు చేయడం ద్వారా ఒత్తిడికి దూరం కావచ్చన్నారు. కోపం, విసుగు, ప్రతికూల ఆలోచనలను విడనాడి ప్రశాంతతను పొందవచ్చన్నారు. శ్రీసిటీ పరిసర ప్రజలు, పరిశ్రమ వర్గాలు, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కేంద్రం ఏర్పాటుకు సహకరించిన శ్రీసిటీ యాజమాన్యానికి కృతఙ్ఞతలు తెలిపారు. 


 

శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ధ్యాన కేంద్రం ఇక్కడ ఏర్పాటు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రం ఏర్పాటుకు శ్రీసిటీని ఎంపిక చేసుకున్నందుకు కృతఙ్ఞతలు తెలిపారు. శ్రీసిటీ ఇప్పటి వరకు గ్రీన్ సిటీ, స్త్రీ సిటీ గా పిలువబడుతోందని, ధ్యాన కేంద్రం ద్వారా హ్యాపీ సిటీగా మారుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.  

 

ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ నిపుణులు స్మిత, యోగా, ధ్యానం యొక్క ప్రాముఖ్యతను వివరించడంతో పాటు కొన్ని శ్వాస పద్ధతులను (బ్రీతింగ్ టెక్నిక్స్) నేర్పించారు. 

 

ఈ ధ్యాన కేంద్రం శ్రీసిటీ క్రీక్ సైడ్ అపార్ట్మెంట్స్ బ్లాక్ "ఏ" లో ఏర్పాటు కాగా, బోధకుడుగా నరేంద్ర వ్యవహరించనున్నారు. 

 

కాగా, 1981 లో స్థాపించబడిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్, శ్రీ శ్రీ రవిశంకర్  మార్గదర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా 156 దేశాలలో పనిచేస్తోంది. ఇది లాభాపేక్షలేని, తత్వశాస్త్రం మార్గనిర్దేశంలోని విద్యా మరియు మానవతా సంస్థ. ఒత్తిడి లేని మనస్సు, హింస లేని సమాజం ప్రపంచ శాంతిని సాధించగలవు అనే సూత్రంపై పనిచేసే ఆర్ట్ ఆఫ్ లివింగ్ కమ్యూనిటీ  అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తుంది. ఇది ఒత్తిడిని తొలగించడానికి అనేక  అత్యంత ప్రభావవంతమైన విద్యా, స్వీయ-అభివృద్ధి కార్యక్రమాలు మరియు సాధనాలను అందిస్తుంది. దీని శ్వాస పద్ధతులు, ధ్యానం, యోగా వంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది జీవితాలను మార్చడానికి సహాయపడ్డాయి.