04.10.2019,
ఏలూరు.
వైఎస్ఆర్ వాహనమిత్ర పధకం ప్రారంభోత్సవ కార్యక్రమం...
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన
కార్యక్రమం...
పాదయాత్రలో ఇచ్చిన మాట నాలుగు నెలల్లోనే నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి
ఏలూరులో ఇచ్చిన హమీని ఇక్కడే నిలబెట్టుకోవడం మా అదృష్టం
మ్యానిఫెస్టోలో ఇచ్చిన హమీలు ఇప్పటికే తొంభై శాతం పూర్తిచేసిన ఘనత శ్రీ వైఎస్ జగన్‌ది మాత్రమే
అడిగిన వెంటనే ఏలూరుకు ప్రభుత్వ మెడికల్ కాలేజి, నిధులు విడుదల
ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్ట్ కూడా ఈ జిల్లా నుంచే ప్రారంభించడం శుభపరిణామం
తమ్మిలేరు రివిట్మెంట్ వాల్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజి సమస్యకు సత్వర పరిష్కారానికి విజ్ఙప్తి...ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ళ నాని), డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి
ఆళ్ల నాని గారి ప్రసంగం...
ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా పదవీ భాద్యతలు స్వీకరించిన తర్వాత ప్రప్రధమంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారికి పశ్చిమగోదావరి జిల్లా ప్రజల తరపున, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల తరపున నా హృదయపూర్వకమైనటువంటి స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధులుగా హజరైన ఇంచార్జ్ మంత్రివర్యులు పిల్లి çసుభాష్‌చంద్రబోస్ గారు, గౌరవ రవాణాశాఖామాత్యులు పేర్ని వెంకట్రామయ్య గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ప్రభుత్వాధికారులు, ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి హజరైనటువంటి ఆటో మోటర్ వాహన కార్మికులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నానన్నారు.
ఈ రోజు మీకందరికీ కూడా తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గారు గత ఏడాది మే నెలలో ఆయన చేసినటువంటి ఆ పాదయాత్ర 2000 కిలోమీటర్లు దాటుకుని మన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే పూర్తిచేశారు. ఆనాడు జరిగిన బహిరంగసభలో వేలాదిమంది ప్రజల మధ్య మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన విధంగా ఈ రాష్ట్రంలో ఆటో కార్మికులుగా ఉంటూ ఏ రోజుకారోజు సంపాదించుకుంటూ వచ్చినటువంటి ఆదాయం ఏ రోజుకారోజు ఆ కుటుంబ పోషణకు సరిపోతుంటే సంవత్సరం తిరిగేసరికి ఆ కుటుంబం పోషణ, ఇన్సూరెన్స్ కట్టాల్సిన భాద్యత, ఏదైనా సంవత్సరాంతంలో రిపేర్లు చేసుకోవాలంటే వారు మళ్ళీ అప్పులపాలు అయ్యే పరిస్ధితి ఉండేది. ఇవన్నీ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉండే ఆటో సోదరులంతా ఏలూరు బహిరంగసభలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ విషయం తీసుకెళ్ళారు. అప్పుడు ఆయన ఆ బహిరంగసభలో వారందరికీ కూడా ఒక మాట ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రాగానే తప్పకుండా మీకు సంబంధించి ప్రతీ సంవత్సరం ప్రతీ ఆటో కార్మికుడికీ, వాహన యజమానులందరికీ కూడా సంవత్సరానికి పది వేల రూపాయలు ఆర్ధిక సహకారం ఇస్తాను అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట నాలుగు నెలలు తిరగకముందే నిలబెట్టుకున్నారు. మీ అందరికీ ఆయన ఇచ్చిన మాట నెరవేరుస్తూ అది కూడా ఏలూరు నగరంలో ఆయన ఇచ్చినటువంటి హమీని నెరవేర్చడమనేది మా అందరి అదృష్టంగా భావిస్తున్నాను. ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా చేస్తున్నారు. చాలామంది ముఖ్యమంత్రులను ఇటీవలి కాలం వరకూ చూశాం. ఇచ్చినటువంటి హమీలన్నింటినీ కూడా చివరివరకూ నాన్చుతూ చివరకు ఆ హమీలు తుంగలో తొక్కే ముఖ్యమంత్రులను చూశాం. కానీ ఈనాడు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హమీలు దాదాపు 90 శాతం పూర్తిచేసిన ప్రజానాయకుడు దేశంలోనే ఎవరైనా ఉన్నారంటే కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈరోజు ఈ కార్యక్రమమే కాకుండా పశ్చిమగోదావరి జిల్లా వాసులకు ఏలూరు ప్రజలకు కూడా చిరకాల వాంఛగా ఉన్నటువంటి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజి కావాలని సుమారు 50 సంవత్సరాలుగా జిల్లా ప్రజలందరూ ముక్తకంఠంతో కోరినా గతంలో ఎవ్వరూ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. జిల్లాలోని ప్రభుత్వాసుపత్రి ప్రతీ రోజు వేల మందికి వైద్యసహాయం అందిస్తూనే మెరుగైన సౌకర్యాలు ఉంటే మరింత మెరుగైన సేవలు అందించాలన్నా గత ప్రభుత్వ సహకారం లేక ఎటువంటి అభివృద్దికి నోచుకోలేదు. ఈ దుస్దితిని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ప్రభుత్వ మెడికల్ కాలేజీ అవసరం అని వెంటనే 15 రోజుల్లోనే జీవో ఇష్యూ చేస్తూ దానికి సంబంధించి సుమారు 266 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం, పశ్చిమగోదావరి జిల్లా వాసుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు మంత్రి ఆళ్ళ నాని తెలిపారు.
అదే విధంగా ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 1000 రూపాయలు దాటితే చాలు ఆ జబ్బుకు సంబంధించి పూర్తిగా నయమయ్యే వరకూ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. సమాజంలో ధనవంతులు కార్పొరేట్ అసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకుని తిరిగొచ్చి సంతోషంగా ఉంటున్నారో అదే విధమైన జీవితం పేదవారికి కూడా ఇవ్వాలి...వైద్యం పేదవాడికి కూడా అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ఆ రోజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని దివంగత నేత, మహానాయకుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు ఆ కార్యక్రమానికి మరింతగా మెరుగులు దిద్దుతూ కిందిస్ధాయిలోకి కూడా మరింతగా విస్తృతపరిచి మరింత మంది పేదలకు ఈ పధకం లబ్ది చేకూరేలా పరిధులన్నీ పెంచుతూ...ఇంతకుముందు 1078 జబ్బులు మాత్రమే ఉంటే దానికి అదనంగా మరొక వెయ్యి జబ్బులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి మరింత విస్తృతంగా పేద ప్రజలందరికీ కూడా ఆరోగ్యం ఇవ్వడం ప్రభుత్వ భాద్యతగా స్వీకరిస్తూ ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి పెలెట్ ప్రాజెక్ట్‌గా పశ్చిమగోదావరి జిల్లాను ఎంపిక చేసినందుకు జిల్లా ప్రజల తరపున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఙతలు, ధన్యవాదాలు తెలియజేశారు.
ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని సమస్యలు గతంలో విన్నవించాను. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు ఉన్నప్పుడు ఏలూరు వరదముంపుకు శాశ్వత పరిష్కారం చూపారు. ఏలూరు నగరంలో ఉన్నటువంటి సుమారు 7 కిలోమీటర్ల తమ్మిలేరు పరీవాహకప్రాంతంలో ఒక నిలువెత్తు గోడను నిర్మించారు. దానికి సంబంధించి అప్పట్లో 50 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన 50 శాతం పనులు అలాగే మిగిలిపోయాయి. ఈ విషయంలో గతంలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఏలూరు ప్రజలందరూ ముక్తకంఠంతో కోరారు. తమ్మిలేరు వాల్ పూర్తిచేస్తే ఎప్పుడు ఏ పెద్ద వర్షం వచ్చినా ఇబ్బంది ఉండదు. ఈ రివిట్మెంట్ వాల్‌ను పూర్తిచేయాలని కోరుకుంటున్నా. అదే విధంగా వన్‌టౌన్ ప్రాంతంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉంది. ఇటీవల కాలంలో పూర్తిగా పాడైపోవడం వల్ల చిన్న వర్షం పడినా ఆ ప్రాంతంలో పైపుల నుంచి మ్యాన్హోల్ల నుంచి మురుగునీరంతా ఇళ్ళలోకి వస్తుంది. దీంతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా హెడ్‌క్వార్టర్‌గా ఉన్నప్పటికీ ఏలూరు నగరంలో గత పాలకుల నిర్లక్ష్య వైఖరితో సమస్య పరిష్కారం కాలేదు. దీంతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశముంది. దయచేసి అండర్‌గ్రౌండ్ డ్రైనేజికి సంబంధించి తగినటువంటి నిధులు కేటాయిస్తారని మిమ్మల్ని కోరుతూ ఇటువంటి సువర్ణావకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మంత్రి ఆళ్ల నాని తన ప్రసంగాన్ని ముగించారు.