టీడీపీ నుంచి వల్లభనేని వంశీ సస్పెన్షన్

టీడీపీ నుంచి వల్లభనేని వంశీ సస్పెన్షన్ 
విజయవాడ : టీడీపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. వంశీపై సస్పెన్షన్ వేటు పడింది. టీడీపీ నుంచి వల్లభనేని వంశీని సస్పెండ్ చేస్తున్నట్లు అధిష్టానం ప్రకటించింది. శుక్రవారం ఉదయం పార్టీ సీనియర్ నేతలతో అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వంశీ వ్యవహారం చర్చకొచ్చినట్లు తెలిసింది. వంశీ ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేశాడని.. వైసీపీలోకి వెళ్లేందుకే పార్టీపై దుమ్మెత్తిపోశాడని మెజార్టీ నేతలు చంద్రబాబుకు వివరించారు. దీంతో... పార్టీపై ఉద్దేశపూర్వకంగా ఎవరు ఈ తరహా వ్యాఖ్యలు చేసినా ఉపేక్షించేది లేదని చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం. వంశీ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన చంద్రబాబు వంశీని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ నేతలకు తేల్చి చెప్పినట్లు తెలిసింది. వల్లభనేని వంశీ వైసీపీలో చేరికకు ఈ పరిణామంతో మార్గం సుగమమైందని చెప్పవచ్చు. రాజీనామా చేసిన సందర్భంలో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన వంశీ కొన్ని రోజులకే మాట మార్చారు. జగన్‌‌తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు గురువారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ కుండబద్ధలు కొట్టారు. అంతేకాదు, టీడీపీపై.. పార్టీ అధినేత చంద్రబాబుపై, లోకేష్‌పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడి పాత్రను కూడా సమర్థంగా పోషించలేకపోతున్నారని అన్నారు.
  45 సంవత్సరాల రాజకీయ అనుభవమున్న చంద్రబాబు... అధికారం లేకపోతే ఐదారునెలలు కూడా ఆగలేకపోతున్నారని విమర్శించారు. ఇసుక కోసం దీక్షలు చేయటం సరికాదన్నారు. అకాల వర్షాలు, అతివృష్టి, వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించినపుడు కూడా నదుల, కాలువల నుంచి ఇసుకను తీసే టెక్నాలజీని చంద్రబాబు ఏమైనా కనిపెట్టారా అని వంశీ ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం వచ్చినా మంచి పనిచేస్తే సమర్థించాలని, అలాకాకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు మీరు వ్యతిరేకించగానే, మీ వెనుక దూడల్లాగా అనుసరిస్తే అభాసుపాల అవుతామన్నారు. ఇంగ్లీషు మీడియంను సమర్థించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంగ్లీషు వద్దని చెప్పటం లేదు కదా అన్నారు.
 
''2004 ఎన్నికల ముందు కోటి వరాలు ప్రకటిస్తే ప్రజలు 47 సీట్లకు పరిమితం చేశారు. 2009లో రాష్ట్రమంతా ఏటీఎం కార్డులు ఇస్తే 90 సీట్లు ఇచ్చి మళ్లీ ప్రతిపక్షంలోనే కూర్చోబెట్టారు. 2019లో కోటి మందికి పసుపు కుంకుమ ఇచ్చారు. కానీ... ప్రజలు టీడీపీకి 23 సీట్లు మాత్రమే విశ్రాంతి తీసుకోమన్నారు. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన మాట నిజమా, కాదా?'' అని వంశీ ప్రశ్నించారు. చంద్రబాబు వైఖరి ఇలాగే ఉంటే ప్రతిపక్ష హోదా కూడా పోయి... పార్టీకి తెలంగాణలో వచ్చిన పరిస్థితే ఇక్కడా వస్తుందని అన్నారు. బీజేపీతో ఘర్షణ వద్దని సుజనా చౌదరి వంటి ప్రముఖులు చెప్పినా వినకుండా ధర్మ పోరాట దీక్షలు చేయటమే టీడీపీ దుస్థితికి కారణమని విమర్శించారు. ''మీరు, మీ పుత్రరత్నం, సలహాదారులు ముంచేసే టీడీపీ పడవను ధర్మాడి సత్యం కూడా వెలికి తీయలేరు'' అని ఎద్దేవా చేశారు.