పవన్ గబ్బర్ సింగ్ కాదు రబ్బర్ సింగ్...

పవన్ గబ్బర్ సింగ్ కాదు రబ్బర్ సింగ్...
* మాకూ టన్నుల కొద్దీ ధైర్యం ఉంది
* పవన్ ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించేదిలేదు
* జనసేనానికే కుల జాడ్యం
* పవన్ బుర్రంతా చంద్రబాబే
* ఆంగ్లంతో విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుదల
* మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) 
అమ‌రావ‌తి: పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ కాదని.. రబ్బర్ సింగ్ అని, ఆయనకు స్పృహ లేదని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య(నాని) నిప్పులు చెరిగారు. చంద్రబాబు స్క్రిప్ట్ చదవడం  తప్ప సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మంచి కనిపించడంలేదన్నారు. కాపులకు గత ప్రభుత్వం అన్యాయం చేసినా ఆనాడు పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. పవన్‌కు కాపులు ఓటు బ్యాంకుగా మాత్రమే కనిపిస్తున్నారన్నారు. సచివాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి నాని మాట్లాడారు. పవన్ నాయుడు బుర్రలో చంద్రబాబు తప్ప మరేమీ లేదని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మంచి పనులు ఒక్కటీ ఆయనకు కనిపించడంలేదన్నారు. రైతు భరోసా, వైఎస్ వాహన మిత్ర, ఏడాదికి చేనేత కార్మికులకు రూ.24 వేలు, మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున ఇస్తున్న ఆర్థిక సాయం కనిపించలేదా అని పవన్‌ను మంత్రి ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ లో పేద విద్యార్థుల తల్లులకు అమ్మఒడి పేరుతో ఆర్థిక సాయం ఇస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన ఐదారు నెలల కాలంలోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలనే ఉద్దేశంతో సీఎం జగన్ కృషి చేస్తున్నారని, ఈ మంచి పనులేవీ కానరావడం లేదా అని నిలదీశారు. 


పవన్ బుర్రంతా చంద్రబాబే...
పవన్ బుర్రలో చంద్రబాబు తప్ప మరేమీ లేదని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. భవన నిర్మాణ కార్మికుల కష్టార్జితం రూ.1200 కోట్ల రూపాయలను జల్సాల కోసం గత ప్రభుత్వంలో దోచుకున్న టీడీపీ నేత అచ్చెన్నాయుడును పక్కనే కూర్చుండబెట్టుకుని ఎలా మాట్లాడాతారని పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారు. ప్రజలు చెబితేనే రోడ్డెక్కామంటున్న పవన్ కల్యాణ్...కార్మికుల కష్టాన్ని దోచుకున్న చంద్రబాబును, అచ్చెన్నాయుడును ఏనాడయినా ప్రశ్నించారా అని మంత్రి నిలదీశారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టానంటున్న పవన్ కల్యాణ్...రాజధాని కోసం రైతులు నుంచి చంద్రబాబునాయుడు వేలాది ఎకరాలు లాక్కున్నా ఎందుకు ప్రశ్నించలేదన్నారు.  


వరదల వల్లే ఇసుక కొరత...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 8న బాధ్యతలు స్వీకరించిందని, అదే నెల 25వ తేదీ నుంచి వచ్చిన వరదల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చిందని మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు. ఆనాటి నుంచి నేటి వరకూ రోజుకు 55 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తోందన్నారు. కృష్ణా నదికి వచ్చిన వరదల కారణంగా ఆగస్టు 13న ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లు ఎత్తారన్నారు. ఆరోజు నుంచి 14,500 క్యూసెక్కుల నీరు కిందికి వదులుతూ నేటి వరకూ ఎత్తిన గేట్లు దించలేదన్నారు. వరదల వల్లే ఇసుక తవ్వకాలకు తీవ్ర ఆటంకం కలుతోందన్నారు. ఇవేవీ పవన్ నాయుడుకు కనిపించలేదా? అని మంత్రి నిలదీశారు. 


మాకు టన్నుల కొద్దీ ధైర్యం ఉంది...
పవన్ కల్యాణ్ కు ధైర్యం ఉంటే ఉండొచ్చునని, సీఎం జగన్ కు, వైసీపీ జెండా మోస్తున్న తమకూ టన్నుల కొద్దీ ధైర్యం ఉందని మంత్రి లేదని పేర్ని నాని అన్నారు. పవన్ కల్యాణ్ ఒకసారి తాట తీస్తాం. అంటే తాము వందల సార్లు తాటతీస్తామన్నారు. తమ నేత, సీఎం జగన్ కు ప్రజాసేవ, రాజకీయాలు, వ్యాపారాల మీద మక్కువ ఉందని, పవన్ కు పెళ్లిళ్ల మీద మక్కువ ఉంటే ఉండొచ్చునని అన్నారు.  జగన్ కు వాళ్ల తల్లిదండ్రులు సంస్కారం నేర్పారు కనుకే ఏనాడూ ఇతరుల గురించి తప్పుగా మాట్లాడలేదన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై పవన్ అంత ఘోరంగా ఎవరూ మాట్లాడలేదన్నారు. ఇప్పుడు అవన్నీ మరిచి సూక్తిముక్తావళి మాట్లాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. తమ నేత, ఎంపీ విజయసాయిరెడ్డికి మ్యాన్ ఫ్రైడే అంటే, తాము పవన్‌ను మ్యాన్ విత్ త్రి ఉమెన్ అంటామని అన్నారు. సిన్మా డైలాగ్ లు ప్రజా జీవితంలో సరిపోదనే విషయం పవన్ తెలుసుకోవాలన్నారు. నవంబర్ ఒకటో తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించని గత ప్రభుత్వ పెద్దలను పవన్ ఏనాడయినా గడ్డి పెట్టారా..? అని మంత్రి ప్రశ్నించారు. సీఎం జగన్‌ను కించపరుస్తూ, ఎక్కడికి వస్తావో రా అంటూ మైకంలో, మత్తులో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ కాదని రబ్బర్ సింగ్ అని అన్నారు. అటువంటి వ్యక్తితో ఘర్షణ పడే మనస్థత్వం తమది కాదన్నారు.  


ప‌వ‌న్‌కే కుల జాడ్యం...
2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఆరు నెలలోనే రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన గత ప్రభుత్వం మాట తప్పినా పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నింలేదని  మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. కాపులకు రిజర్వేషన్ల అక్కర్లేదని, కష్టపడి అభివృద్ధి చెందుదామని చెప్పిన పవన్ కల్యాణ్...2019 ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. పవన్ కే కుల జాడ్యం ఉందని, కాపులను ఓటు బ్యాంకు చూస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం కాపుల అభ్యున్నతి విశేష కృషి చేస్తోందన్నారు. కాపు కార్పొరేషన్ కు ఏడాదికి రూ.2 వేల కోట్లు చొప్పున్న అయిదేళ్లకు రూ.10 వేల కోట్లు వెచ్చించనుందన్నారు. ఇవేవీ చెప్పినా పవన్ కు అర్థం కాదన్నారు. 


ఆంగ్లంతో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుదల...
ఆంగ్ల భాష పరిజ్ఞానంతోనే విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుతాయని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇంగ్లీష్ పరిజ్ఞానం లేకపోవడం వల్లే ఉద్యోగాల సాధనలో నష్టపోతున్నామని పాదయాత్రలో సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువత విన్నవించుకున్నారన్నారు. రాష్ట్ర యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ముందుగా ఒకటి నుంచి అయిదో తరగతి వరకు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. ఆంగ్లంలో బోధన చేసే విధంగా ఉపాధ్యాయులకు జనవరి నుంచి మే వరకూ ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నామన్నారు. రాష్ట్ర ఉపాధ్యాయులంతా ప్రతిభ కలిగిన వారేనన్నారు. పవన్ కల్యాణ్ కుమారుడు చదువుతున్నపాఠశాలలో తెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తారన్నారు. అటువంటి వ్యక్తి ఈరోజు తమ ప్రభుత్వంపై బురద జల్లడం దారుణమన్నారు. ఒకటి నుంచి ఇంటర్ వరకూ తెలుగు సబ్జెక్టు తప్పనిసరి అని, ఈ విషయం పవన్ కల్యాణ్ గుర్తించుకోవాలని మంత్రి సూచించారు.