ఇసుక ధరల పట్టిక విడుదల

ఇసుక ధరల పట్టిక విడుదల
వేర్వేరు స్టాక్‌యారుల్లో రూ.375 నుంచి రూ.900 వరకు నిర్ణయం
గుంటూరు : వినియోగదారులకు అందుబాటులో ఇసుక అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ఇసుక వారోత్సవాలకు పిలుపునివ్వడంతో జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టింది. రీచ్‌ల్లో నుంచి తీస్తోన్న ఇసుకని జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలకు తరలించి అక్కడ స్టాక్‌ డిపోలు ఏర్పాటు చేసి వాటిల్లో ప్రజలకు అందుబాటులో ఉంచుతోన్నారు. జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరుగా స్టాక్‌ డిపోలను కేటాయించారు. వాటి వద్దనే కాకుండా ప్రజలు ఎక్కడి నుంచి అయినా ఇసుక బుకింగ్‌ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించారు. కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ మైనింగ్‌ అధికారులతో చర్చించి స్టాక్‌యార్డుల వారీగా ఇసుక ధరల పట్టికని తాజాగా విడుదల చేశారు. పట్టికలో సూచించిన ధరకు మించి అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని కలెక్టర్‌, జేసీ స్పష్టం చేస్తోన్నారు. ఇసుక రీచ్‌ల వద్ద ఏర్పాటు చేసిన స్టాక్‌యార్డుల వద్ద లారీలు వందల సంఖ్యలో చేరుతోండటంతో అక్కడి రద్దీ ఏర్పడుతోన్నది.   దీనిని పరిగణనలోకి తీసుకొన్న కలెక్టర్‌ సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో స్టాక్‌యార్డులు ఏర్పాటు చేయాలని మైనింగ్‌, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు మంగళగిరి నియోజకవర్గంలో నవులూరు వద్ద ఒక స్టాక్‌యార్డు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇసుక ధర మెట్రిక్‌ టన్నుకు రూ.560గా నిర్ణయించారు. పొన్నూరు నియోజకవ ర్గంలోని పెదకాకానిలో రూ.570, ప్రత్తిపాడు, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, చిలకలూరిపేట ప్రజల కోసం చౌడవరంలో ఏర్పాటు చేసిన స్టాక్‌యార్డు వద్ద ధర రూ.655 పెట్టారు. బాపట్లలో రూ.750, నరసరావుపేటలో రూ.670, వినుకొండలో రూ.900, గురజాలకు సంబంధించి పిడుగురాళ్లలో రూ.660, మాచర్ల నియోజకవర్గంలోని దుర్గిలో రూ. 850, పెదకూరపాడు నియోజకవర్గం లోని కోగంటివారిపాలెంలో రూ.375, సత్తెనపల్లి, తాడికొండ నియోజకవర్గాలకు కలిపి దిడుగులో రూ.375, తెనాలిలోని అన్నవరం, మున్నంగి, బొమ్మువానిపాలెం లో రూ.375, వేమూరు, రేపల్లెకు గాజుల్లంకలో రూ.375 ధర నిర్ణయించారు. ఈ స్టాక్‌యార్డుల వద్ద ఇసుక బుకింగ్‌ చేసుకొని వాహనం తీసుకెళ్లి ప్రజలు సొంత అవసరాలకు ఇసుక తెచ్చుకోవచ్చని కలెక్టర్‌ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను అతిక్రమించి ఇసుక కొనుగోలు, అమ్మకం జరిపితే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. అవసరానికి మించి అధిక పరిమా నంలో నిల్వ ఉంచినా, ఇసుకని తిరిగి అమ్మినా రూ.2 లక్షల పెనాల్టీ, రెండేళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఇసుక లావాదేవీలను పర్యవేక్షించేందుకు కలెక్టరేట్‌లో ఒక కంట్రోల్‌ రూం కూడా ఏర్పాటు చేశామన్నారు.