సమాజ గతిని మార్చగలిగింది ఒక్క విద్యారంగమే

సమాజ గతిని మార్చగలిగింది ఒక్క విద్యారంగమే


ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వ భూషణ్ హరించందన్


విద్యర్ధులు గ్రామ సీమలతో మమేకం కావాలి


బోధనా సిబ్బంది కొరతను తక్షణమే పరిష్కరించాలి



విజయవాడ, డిసెంబర్ 20: విద్యా రంగం ఉన్నత ప్రమాణాలతో ముందడుగు వేసినప్పుడే సమాజం మంచి అభివృద్ధిని సాధించగలుగుతుందని,  విద్య అనేది అభివృద్ధికి సమర్థవంతమైన సాధనంగా ఉపకరిస్తుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. పరిమాణాత్మక, గుణాత్మక మెరుగుదల కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలు ప్రదర్శించిన నిబద్ధత ప్రశంసనీయమని, అయితే పరిశోధనలు, ప్రయోగాలు, ఆవిష్కరణల ద్వారా మాత్రమే విశ్వ విద్యాలయాలు పూర్తి స్ధాయి సమగ్రతను సంతరించుకుంటాయని గౌరవ గవర్నర్ స్పష్టం చేసారు.


విజయవాడలోని రాజ్ భవన్‌ దర్బార్ హాల్‌లో ఆంధ్రప్రదేశ్‌ విశ్వవిద్యాలయాల ఉపకులపతుల ఒక రోజు సమావేశం శుక్రవారం జరిగింది. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన ఈ సమీక్షలో రాష్ట్ర గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు సమాజ గతిశీలతను అర్థం చేసుకుని ముందడుగు వేయాలన్నారు. తన పరిశీలనలో విశ్వవిద్యాలయాలు బోధనా సిబ్బంది పరంగా ప్రధాన సవాలును ఎదుర్కొంటున్నాయని, కొన్ని సంస్థలలో అరవైశాతం మేర అధ్యాపకుల కొరత ఉండటం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. అత్యవసర ప్రాతిపదికన కాలపరిమితి గల ప్రణాళిక మేరకు ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, తద్వారా గుణాత్మక విద్యకు మార్గం సుగమం చేయాలని గవర్నర్ ఉన్నత విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం 21 గ్రామాలను దత్తత తీసుకోవటం,  వారానికి ఒకసారైనా దత్తత తీసుకున్న గ్రామాలను విద్యార్థులు సందర్శించటం స్వాగతించదగిన పరిణామమన్నారు.


రాష్టంలోని అన్ని విశ్వవిద్యాలయాలు ఈ తరహా కార్యక్రమాలు చేపట్టడం అత్యావశ్యకమన్న గవర్నర్, ఇది విద్యార్థులకు గ్రామసీమల స్ధితిగతులను అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుందన్నారు. ఫలితంగా విశ్వవిద్యాలయాలకు, సమాజానికి మధ్య  మంచి సంబంధాన్ని ఏర్పరచుకునే అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. వైస్ ఛాన్సలర్లతో జరిగిన సమావేశం పట్ల గవర్నర్ ఆనందం వ్యక్తం చేసారు. భవిష్యత్తులో కూడా ఈ తరహా సమావేశాలు నిర్వహించటం ద్వారా ఆంధ్రప్రదేశ్ ను విద్యా వికాస కేంద్రంగా తీర్చిదిద్దుదామన్నారు. కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిములాపు సురేష్, ఉన్నత విద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, వ్యవసాయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనమ్ మలకొండయ్య, గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి అర్జున రావు, కళాశాల విద్య స్పెషల్ కమీషనర్ ఎంఎం నాయక్ (ఇన్ చార్జి విసి, రాయలసీమ విశ్వవిద్యాలయం),  రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. హేమచంద్రరెడ్డి, వైస్ ఛైర్మన్లు రామ మోహన రావు, లక్మమ్మ తదితరులు పాల్గొన్నారు.


అయా విశ్వ విద్యాలయాల ఉపకులపతులు ప్రసాద రెడ్డి - ఆంధ్ర విశ్వవిద్యాలయం, రాజశేఖర్ - ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, డాక్టర్ బి రాజశేఖర్ - శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, సుందర కృష్ణ - కృష్ణ విశ్వవిద్యాలయం, సురేష్ వర్మ - ఆదికావి నన్నయ విశ్వవిద్యాలయం, డాక్టర్ రాంజీ - డా.బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం, లోకానంత రెడ్డి - ద్రావిడ విశ్వవిద్యాలయం, రామ కృష్ణా రెడ్డి - యోగి వేమన విశ్వవిద్యాలయం, అచార్య ఉమ - శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, అచార్య సుదర్శన రావు - వికర్మ సింహాపురి విశ్వవిద్యాలయం, ముజఫర్ అలీ - డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం, రామలింగ రాజు - జెఎన్‌టియు కాకినాడ, డాక్టర్ కె. వెంకటేష్ - డాక్టర్ ఎన్ టి ఆర్ ఆరోగ్య శాస్త్రాల విశ్వవిద్యాలయం, శ్రీనివాస కుమార్ - జెఎన్‌టియు అనంతపూర్, హరిబాబు - శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం, సుదర్శన శర్మ - శ్రీ వెంకటేశ్వర వేద విద్యాలయం, దామోదర నాయిడు - అచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, చిరంజీవి చౌదరి - వైయస్ఆర్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం రెక్టార్ సుందర వలి తదితరులు ఈ సమావేశానికి హాజరై ఆయా విశ్వవిద్యాలయాల పనితీరు గురించి గవర్నర్ కు వివరించారు.