జాతీయ పోటీలకు వందమందిని పంపిస్తాం- పీసీసీఎఫ్

అట్టహాసంగా రాష్ట్ర అటవీ క్రీడోత్సవాలు ప్రారంభం 
జాతీయ పోటీలకు వందమందిని పంపిస్తాం- పీసీసీఎఫ్ (HoFF) ఎన్ ప్రతీప్ కుమార్ 
------------------------------------------------------------------------------------------------------------ 
ఈ సంవత్సరం మార్చి మూడవ తేదీ నుంచి భువనేశ్వర్ లో జరిగే జాతీయ స్థాయి అటవీ  క్రీడాపోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి 100 మంది క్రీడాకారులను పంపుతామని రాష్ట్ర అటవీ  శాఖ ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి (అటవీ దళాధిపతి) ఎన్ ప్రతీప్ కుమార్  చెప్పారు. రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల క్రీడామైదానంలో బుధవారం ఉదయం ఆయన రాష్ట్రస్థాయి అటవీ క్రీడోత్సవం (ఫారెస్ట్ స్పోర్ట్స్ మీట్ 2020)ను ప్రారంభించారు. వందేమాతరం గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. తొలుత జ్యోతి ప్రజ్వలనం చేసిన అటవీ దళాధిపతి జాతీయ, అటవీశాఖ, క్రీడా పతకాలను ఆవిష్కరించారు. క్రీడా జ్యోతిని వెలిగించారు. క్రీడోత్సవాల సందర్భంగా అటవీ శాఖ ఏర్పాటు చేసిన భారీ బెలూన్ ను ఎగురవేసిన అనంతరం ఆయన స్పోర్ట్స్ మీట్ 2020  మస్కట్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రాజమండ్రి, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి (వైల్డ్ లైఫ్ విభాగం), శ్రీశైలం (ప్రాజెక్ట్ టైగర్), ఎపి స్టేట్ ఫారెస్ట్ అకాడమీ లకు చెందిన వందలాదిమంది క్రీడాకారులు మార్చ్ పాస్ట్ నిర్వహించారు. క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం అటవీ దళాధిపతి ప్రతీప్ కుమార్ ప్రసంగించారు. జాతీయ క్రీడోత్సవాల స్థాయిలో ఈ స్పోర్ట్స్ మీట్ ఏర్పాట్లు ఉన్నాయని పేర్కొంటూ అతిథేయ సర్కిల్ రాజమండ్రి అధికారులను ఆయన ప్రశంసించారు. ఈ అద్భుతమైన ఏర్పాట్ల వెనుక సిబ్బంది పడిన ఎంతో కష్టం ఉందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత సర్కిల్ లెవెల్, స్టేట్ లెవెల్ క్రీడోత్సవాలను ప్రమాణాల మేరకు నిర్వహించుకోలేకపోయామని చెప్పారు. అయితే తిరిగి వాటిని పూర్తిస్థాయిలో నిర్వహించుకునేందుకు ఈ స్పోర్ట్స్ మీట్ తిరుగులేని స్ఫూర్తిని ఇచ్చిందన్నారు. రెండు రోజుల పాటు ఇలా ఆటపాటల మధ్య గడిపి ఒత్తిడిని నివారించుకుంటే మిగిలిన 360 రోజులూ చక్కగా విధులు విర్వహించడం సాధ్యపడుతుందన్నారు. ఈ దఫా సర్కిల్, స్టేట్ లెవెల్ క్రీడోత్సవాల్లో పాల్గొనకపోయినా కూడా గత ట్రాక్ రికార్డును దృష్టిలో ఉంచుకొని ప్రతిభావంతులైన క్రీడాకారుల్ని కొందరిని జాతీయ పోటీలకు పంపుతామన్నారు. యాభైకి పైగా ఈవెంట్లలో సుమారు 11 క్యాడర్లకి చెందిన నాలుగు వందలమందికి పైగా సిబ్బంది ఈ క్రీడోత్సవాల్లో పాల్గొంటున్నారని పీసీసీఎఫ్ తెలిపారు. తోలి ఈవెంట్ గా 800 మీటర్ల పరుగు పందేన్ని ప్రతీప్ కుమార్ ప్రారంభించారు.


రాష్ట్రంలో పెరిగిన అటవీ విస్తీర్ణం 
రాష్ట్ర వ్యాప్తంగా అటవీశాఖలో 60 శాతం వరకు వివిధ కాడర్లల లో పోస్టులు ఖాళీ గా ఉన్నాయని ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి (అటవీ దళాధిపతి) ఎన్ ప్రతీప్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఈ పోస్టులను భర్తీ చేయుటకు ప్రభుత్వ అనుమతి కోరామన్నారు. అనుమతి వచ్చిన వెంటనే పోస్టులు భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. మన రాష్ట్రంలో ఎర్రచందనం కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో సాగులో ఉందన్నారు. గతంలో గ్లోబల్ టెండర్ల ద్వారా 8,500 మెట్రిక్ టన్నుల సీజ్డ్ ఎర్ర చందనాన్ని అమ్మడం వలన రూ. 1700 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఆరువేల మెట్రిక్ టన్నులకు పైగా ఎర్ర చందనం అమ్మకానికి సిద్ధంగా ఉందని చెప్పారు. దీనిని అమ్మాలంటే సైటిస్ నుంచి అనుమతి రావలసి ఉందన్నారు. ఐ ఎస్ ఎఫ్ ఆర్ సర్వే ప్రకారం 2017 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం సుమారు 3 లక్షల 24 వేల హెక్టార్ల మేర పెరిగిందని ప్రతీప్ కుమార్ చెప్పారు. అటవీ ప్రాంత పరిరక్షణకు, అడవుల విస్తరణకు ఎపి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోందని చెప్పారు. 
ఈ కార్యక్రమంలో అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (అడ్మిన్) బి.కె.సింగ్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ డాక్టర్ నళినీమోహన్,  ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ భాస్కర రమణమూర్తి  రాజమహేంద్రవరం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎన్.నాగేశ్వరరావు, కాకినాడ డీఎఫ్ ఓ  నందిని సలారియా, అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ ఎం వి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు