ఆరోజు ముద్దులు పెట్టారు... నేడు గుద్దులు గుద్దుతున్నారు: బాబు
అమరావతి : రాజధాని కోసం ఆందోళనలు చేస్తున్న అమరాతి రైతులకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు సంఘీభావం ప్రకటించారు. మందడంలో రైతులను పరామర్శించిన బాబు అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. జై అమరావతి.. జైజై అమరావతి అంటూ ప్రసంగం ప్రారంభించారు. ''కొత్త సంవత్సరం రోజున ఆడపడుచులందరూ రోడ్డు మీద కూర్చున్నారు. మీరేమి తప్పు చేశారని 17రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. అమరావతిని తరలించే శక్తి ఎవరికీ లేదు. అందరం ఐక్యంగా పోరాటం చేద్దాం''అని పిలుపు ఇచ్చారు. హైదరాబాదును ఆదర్శ రాజధానిగా అభివృద్ధి చేశానన్నారు. ప్రజా సేవకుడిగా భావి తరాల కోసం పని చేశానని, కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కూడా మంచి రాజధాని నిర్మించాలనుకున్నానని చెప్పారు. రూ. 16వేల కోట్ల లోటు బడ్జెట్‌తో.. కట్టుబట్టలతో రాష్ట్రానికి వచ్చామన్నారు. అన్ని విధాలా అనుకూలం.. రాష్ట్రం మధ్యలో ఉన్న అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి నిర్ణయం తీసుకున్నామన్నారు. శివరామకృష్ణ కమిటీ కూడా అమరావతిని సిఫార్సు చేసిందని చెప్పారు.
ఆనాడు అసెంబ్లీలో జగన్ కూడా రాజధానిగా అమరావతిని అంగీకరించి 30వేల ఎకరాలు అవసరం అన్నమాటను ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. మాట తప్పను.. మడమ తిప్పను అన్న సీఎం.. ఇప్పుడు యూటర్న్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని, కేంద్రం రూ. 1500 కోట్లు ఇస్తే అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. అన్నిచోట్ల నుంచి పవిత్ర జలాలు, రైతుల కోరిక మేరకు ఆనాడు రిజిస్ట్రేషన్ చేయలేదని చంద్రబాబు చెప్పారు. జగన్ ఆరోజు ముద్దులు పెట్టారని... ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నారని చంద్రబాబు అన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తే అడ్డుకుంటారా అంటూ చంద్రబాబు మండిపడ్డారు. జగన్ కాన్వాయ్‌కు మరో దారిలేదా? అని ప్రశ్నించారు. ముందు డమ్మీ కన్వాయ్ పంపి.. తర్వాత వస్తున్నారని, ఇంత పరికివాడుగా.. భయంతో తిరుగుతున్నారని విమర్శించారు. జగన్ ఆకాశం నుంచి ఏమైనా ఊడి పడ్డారా? పోలీసులకు ఎవరేంటో తెలియదా? అని చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీసులు చట్టాన్ని అతిక్రమించొద్దని హితవు పలికారు. ఆడబిడ్డలను పెయిడ్ ఆర్టిస్ట్‌లని మాట్లాడుతూ.. అవమానించిన వారిపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అమరావతి కోసం ఉద్యమం చేయడానికి ఐదు కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు.
ఆరోజు ముద్దులు పెట్టారు... నేడు గుద్దులు గుద్దుతున్నారు: బాబు