విజయవాడలో;
స్నేహ పూర్వక వాతావరణంలో రాజ్ భవన్ లో నూతన సంవత్సర వేడుకలు
గవర్నర్ ఆశీస్సులు తీసుకున్న చిన్నారులు
బిశ్వ భూషణ్ హరిచందన్ కు శుభాకాంక్షలు తెలిపిన అమాత్యులు, అధికారులు, సాధారణ ప్రజలు
నూతన సంవత్సర ఆగమన శుభవేళ రాష్ట్రం అభివృద్ధి పధంలో ముందడుగు వేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్ ఆకాంక్షించారు. అభివృద్ధిలో అగ్రగామి రాష్ట్రంగా వెలుగొందాలని, ప్రతి ఇంటా శుఖశాంతులు వెల్లి విరయాలని అభిలషించారు. విజయవాడ రాజ్ భవన్‌లో నూతన సంవత్సర వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. స్నేహపూర్వక వాతావరణంలో ఉన్నతాధికారులు, ప్రముఖులు, పెద్దలు, చిన్నారులు రాష్ట్ర ప్రధమ పౌరునికి తమ శుభాకాంక్షలను అందించారు. గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఈ కార్యక్రమాన్ని సమన్వయపరస్తూ రాగా, రోజంతా విభిన్న కార్యక్రమాల సమాహారంగా నడిచింది. తొలుత శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్ధానం పండితులు వేద మంత్రోచ్చారణ నడుమ గవర్నర్ దంపతులను ఆశీర్వదించారు. ఆలయ పురోహితులతో పాటు దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఆలయ కార్యనిర్వహణ అధికారి కార్యక్రమంలో పాల్గొని గవర్నర్ వారికి అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందచేసారు. అనంతరం గవర్నర్ దంపతులను రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది కలిసి, శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర ఆగమన శుభవేళ గవర్నర్ దంపతులు ప్రత్యేకంగా రాజ్ భవన్ అధికారులు, కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు.
తరువాత జరిగిన 'ఓపెన్ హౌస్' కార్యక్రమంలో గవర్నర్ హరిచందన్ ను అమాత్యులు, సామాన్య ప్రజలు, పౌర సమాజ ప్రతినిధులు, సీనియర్ అధికారులు కలుసుకుని వారితో ఆహ్లాదకరమైన సమయాన్ని పంచుకున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లల కేంద్రం నుండి చిన్నారులు, అనాధ గృహాల పిల్లలు గవర్నర్‌ను కలుసుకుని ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్ధానం నుండి వచ్చిన వేద పండితులు గవర్నర్ దంపతులను ఆశీర్వదించగా, టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి స్వామి వారి ప్రసాదంను అందించారు. సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని గవర్నర్ ను కలిసి శుభాకాంక్షలు అందించి, ఆశీర్వచనం తీసుకున్నారు. గవర్నర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించే వారితో రాజ్ భవన్ రోజంతా సందడిని సంతరించుకోగా, సాయంత్రం రెడ్ క్రాస్ సొసైటీ నేతృత్వంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టు కున్నాయి.
విభిన్న సమయాలలో జరిగిన కార్యక్రమాలలో స్ధానిక శాసన సభ్యుడు మల్లాది విష్ణు, డిజిపి గౌతమ్ సావాంగ్, పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమల రావు, నీరబ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ కారికల్ వలవన్, స్టాంపులు, రిజిస్ట్రేషన్స్ శాఖ కమీషనర్ సిద్ధార్థ్ జైన్, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, జిఎడి కార్యదర్శి శశి భూషణ్ కుమార్, ప్రోటోకాల్ డైరెక్టర్ కిషోర్ కుమార్, చేనేత జౌళి శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా, సమాచార కమీషనర్లు బివి రమణ కుమార్, ఐలాపురం రాజా, రవి కుమార్ గవర్నర్‌ను కలిశారు. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, సంయిక్త కలెక్టర్ మాధవి లత, విజయవాడ నగర పాలక సంస్ధ కమీషనర్ ప్రసన్న వెంకటేష్ , రాష్ట్ర రెడ్ క్రాస్ ఛైర్మన్ శ్రీధర్ రెడ్డి, కృష్ణా జిల్లా ఛైర్మన్ డాక్టర్ సమరం, గవర్నర్ వారి సంయిక్త కార్యదర్శులు అర్జున రావు, నాగమణి తదితరులు గవర్నర్ కలిసి శుభాకాంక్షలు అందించారు.