*అమరావతి కదిలిస్తే అదే మీ పతనానికి నాంది..!*
సీఎం మారితే రాజధాని మారిపోతుందా?, అన్ని రాష్ట్రాల్లో ఇలాగే రాజధానులు మారిస్తే పరిస్థితి ఎలా ఉండేది? అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. బెంజ్ సర్కిల్‌లో అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయాన్ని ఆయన ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. కేసులు పెడతారని ప్రజలు భయపడుతున్నారు.. లేకుంటే ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడో బంగాళాఖాతంలో కలిపేవారని చంద్రబాబు నాయుడు అన్నారు.
రాష్ట్రం కోసం తమ వంతు బాధ్యతగా జేఏసీ ముందుకొచ్చింది అన్నారు. ఒక్క పిలుపుతో రైతులు 33వేల ఎకరాల భూములు ఇచ్చారన్న ఆయన రాజధానికి ఈ ప్రాంతం అనువైందని శివరామకృష్ణ కమిటీ చెప్పిందని గుర్తు చేసారు. మొదట ల్యాండ్ పూలింగ్ అంటే ఎవరికీ అర్థం కాలేదు అన్నారు. రాజధానికి విజయవాడ సరైన ప్రాంతమని గతంలో జగన్ అన్నాడు. ఇప్పుడు జగన్ ఎందుకు యూటర్న్ తీసుకున్నారు అని చంద్రబాబు నిలదీశారు. అసలు మూడు రాజధానులు చేయాలని ఎవరడిగారు? అని చంద్రబాబు ప్రశ్నించారు.
రాజధానిలో ఒకే కులం వారు ఉన్నారని అసత్య ప్రచారం చేస్తున్నారన్న చంద్రబాబు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగితే సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించండని చంద్రబాబు సవాల్ చేసారు. 5 కోట్ల మంది ఒప్పుకుంటే రాజధానిని ఎక్కడైనా పెట్టుకోండని చంద్రబాబు సూచించారు. అమరావతి..రైతుల సమస్య మాత్రమే కాదు..రాష్ట్ర ప్రజలందరిదీ. రాజధాని మారిస్తే మీ పతనం ప్రారంభమైనట్లేనని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.