టిసిఎల్ పరిశ్రమకు పెండింగ్ అనుమతులు త్వరగా పూర్తిచేయండి – జిల్లా కలెక్టర్
తిరుపతి, జనవరి 17: వికృతమాల వద్ద నిర్మిస్తున్న టిసిఎల్ కంపెనీ పెండింగ్ అనుమతులు, మౌలిక సదుపాయాలు త్వరగా కల్పించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్తా ఆదేశించారు. శుక్రవారం ఉదయం స్థానిక తుడ కార్యాలయ సమావేశమందిరంలో టిసిఎల్ ప్రతినిధులతో సమావేశమై వారి అవసరాల పై జిల్లా కలెక్టర్ చర్చించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టిసిఎల్ మరో మూడుమాసాల్లో తన ఉత్పత్తులు ప్రారంభానికి సిద్దమవుతున్నదని ప్రభుత్వ అనుమతులు పెండింగ్ లేకుండా చూడాలని , తుడా అప్రూవల్ , లాండ్ కన్వరేషన్ వంటివి త్వరగా పూర్తిచేయాలని తెలిపారు. అలాగే టిసిఎల్ ప్రతినిధులకు సూచిస్తూ నీటి సరఫరాకు నగరపాలక సంస్థకు చెల్లించవలసిన మొత్తం త్వరగా చెల్లిస్తే సరఫరా చర్యలు తీసుకుంటారని తెలిపారు. మీకు ఎపిఐఐసి నుండి పొందిన భూమి కి ప్రహరీ నిర్మాణం పూర్తిచేయాలని సూచించారు. ప్రధానంగా ఇఎంసి 1 , రేణిగుంట బైపాస్ రోడ్డుకు కనెక్టేవిటీ కోసం 7 కిమీ గానూ భూసేకరణ చేపట్టి త్వరగా పూర్తిచేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నిర్మాణం వేగవంతంగా జరుగుతున్నదని, పరిశ్రమ ప్రారంబమయితే 75 శాతం స్థానికులకు ఉపాధి లభిస్తుందని, ఇప్పటికే టిసిఎల్ దశల వారీగా యువతకు చైనాలో శిక్షణ ఇస్తున్నవిషయం తెలిసిందేనని అన్నారు. ఈ సమావేశంలో నగరపాలక కమిషనర్ గిరిశా పి.ఎస్., ఆర్డీఓ కనకనరసా రెడ్డి, ఎం.ఇ. చంద్రశేఖర్, ఏర్పేడు తహశీల్దార్ రంగస్వామి , డిటి భాస్కర్ , రెవెన్యూ అధికారులు, టిసిఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు. – డివిజనల్ పి.ఆర్.ఓ.,తిరుపతి ---