అందరూ ఓటు వేశారు కాబట్టే గెల్చాను : సీఎం వైయస్‌.జగన్‌

*20.01.2020*
*శాసనసభ*


*పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై సభలో ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి*
 
*అందరూ ఓటు వేశారు కాబట్టే గెల్చాను : సీఎం వైయస్‌.జగన్‌*
*అందుకే ప్రతి ప్రాంతం, ప్రతి ఒక్కరి సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తాను: సీఎం*
*అమరావతి ప్రాంతాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయబోము*
*ఇక్కడే లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌. ఇక్కడే చట్టాలు చేస్తాము*
*అమరావతితో పాటు, మిగిలిన ప్రాంతాలూ అభివృద్ధి చెందాలి*
*అదే ప్రభుత్వ లక్ష్యం. అందుకే పరిపాలన వికేంద్రీకరణ*
*తద్వారా సమగ్ర అభివృద్ధి*
*సభలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి*
*కేవలం 8 కి.మీ పరిధిలో పనులకు లక్ష కోట్లు కావాలి*
*ఆ మొత్తంలో 10వ వంతు ఖర్చుతో విశాఖలో సౌకర్యాలు*
*ఆ నగరంలో అన్ని సదుపాయాలు ఉన్నాయి*
*వచ్చే 10 ఏళ్లలో హైదరాబాద్‌తో పోటీ పడే వీలుంది*
*అన్ని కమిటీలు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నాయి*
*శివరామకృష్ణన్‌ కమిటీ కూడా అదే చెప్పింది*
*కానీ చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు*
*సభలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడి*
*పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ముఖ్యమంత్రి సమాధానం*


 అమరావతి ప్రాంతాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయబోమని, ఇక్కడే  లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ ఉంటుందని, ఇక్కడే చట్టాలు చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. అమరావతితో పాటు, మిగిలిన ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే పరిపాలన వికేంద్రీకరణ చేస్తున్నామని, తద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమని ఆయన ప్రకటించారు. అందరు ఓటు వేస్తేనే గెల్చానన్న సీఎం, అమరావతి ప్రాంతంలో కేవలం 8 కి.మీ పరిధిలో పనులకు లక్ష కోట్లు కావాలని, ఆ మొత్తంలో 10వ వంతు ఖర్చుతో విశాఖలో అన్ని సౌకర్యాలు కల్పించవచ్చని చెప్పారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటు వల్ల వచ్చే 10 ఏళ్లలో ఆ నగరం హైదరాబాద్‌తో పోటీ పడే వీలుందని తెలిపారు. అన్ని కమిటీలు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని సూచించాయని, చివరకు శివరామకృష్ణన్‌ కమిటీ కూడా అదే చెప్పిందని, కానీ చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని సీఎం పేర్కొన్నారు. 
 పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై సభలో సుదీర్ఘ చర్చ అనంతరం సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సోమవారం రాత్రి పొద్దు పోయిన తర్వాత సమాధానం ఇచ్చారు. సుదీర్ఘంగా ప్రసంగించిన సీఎం, రాజధాని మార్పు అంటూ జరుగుతున్న ప్రచారానికి స్పష్టంగా సమాధానం చెప్పారు.
 కాగా, సీఎం ప్రసంగం ప్రారంభించగానే టీడీపీ సభ్యులు స్పీకర్‌ పోడియమ్‌ వద్దకు వచ్చి నినాదాలు చేస్తుండడంతో, ఒకరోజు పాటు వారిని సస్పెండ్‌ చేశారు. ఆ తర్వాత సీఎం ప్రసంగం కొనసాగింది.


*రాష్ట్ర ప్రయోజనాల కోసం*..
 రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను వివరణ ఇస్తున్నానని, ఏపీ చరిత్రలో ఇవాళ ఒక ముఖ్యమైన రోజు అని, అనేక అనుమానాలను, ఆవేశాలను మంచి ఆలోచనలు డామినేట్‌ చేయాల్సిన రోజు ఇది అని సీఎం పేర్కొన్నారు. వెలగపూడిలో తాత్కాలిక అసెంబ్లీ, సెక్రటేరియట్‌ను ప్రస్తావించిన ఆయన, వాటిపై 2016. ఫిబ్రవరి 11న జీఓ ఎంఎస్‌.32 ఇచ్చారని గుర్తు చేశారు. ఇదే వెలగపూడిలో తాత్కాలిక అసెంబ్లీ నుంచి నిర్ణయాల కోసం ప్రజలు చూస్తున్నారన్న ముఖ్యమంత్రి, గత 5 ఏళ్లలో చోటు చేసుకున్న పరిణామాలపై అన్ని వాస్తవాలు ప్రజలకు చూపే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. ఇక్కడ ఇవాళ సమావేశం కావడానికి వచ్చిన పరిస్థితులను ఒక్కసారి ఆలోచించాలన్న ఆయన, నాడు ఏపీ రాష్ట్రం 1953, అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా అవతరించిన నాటి నుంచి 2014, జూన్‌లో 13 జిల్లాల ఏపీగా అవతరించినంత వరకు, ఆ తర్వాత 2019 వరకు చాలా పరిణామాలు జరిగాయని చెప్పారు. అనేక చారిత్రక తప్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. ఇంకా ఇటీవల ఉద్దేశపూర్వకంగా అన్యాయాలు కూడా జరిగాయని వివరించారు. 


*ఎన్నో పొగొట్టుకున్నాం*..
 ‘1953లో రాష్ట్రంగా అవతరిస్తూ మద్రాస్‌ను పొగొట్టుకున్నాం. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా అవతరిస్తూ, కర్నూలును త్యాగం చేశాం. 58 ఏళ్ల తర్వాత మరోసారి 2014లో రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను పోగొట్టుకున్నాం. 
ఉద్యోగాలకు కేంద్రంగా ఉన్న నగరాలను వరసగా పోగొట్టుకున్నాం. చివరకు 10 ఏళ్లు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉండే అవకాశం ఉన్నా, ఓటుకు కోట్లు ఇస్తూ, ఇక్కడ ఒక మనిషి చేసిన తప్పిదం వల్ల చివరకు ఆ అవకాశం కూడా పోగొట్టుకున్నాం. ఏ జాతికి అయినా చరిత్ర అనేక పాఠాలు చెబుతుంది. వాటి నుంచి ఎవరైనా నేర్చుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది’.
 ‘1937లో శ్రీబాగ్‌ ఒప్పందం జరిగింది. అప్పట్లో మద్రాస్‌ రాష్ట్రంతో కలిసి ఉండగా, రాష్ట్రంలోని తెలుగు వారంతా బలంగా ఒక్కటి కావాలని చెప్పి. అప్పుడు శ్రీబాగ్‌ ఒప్పందం చేసుకున్నారు. రాయలసీమ నుంచి నాయకత్వం వహిస్తున్న కోటిరెడ్డి గారు, కల్లూరి సుబ్బారావు, ఆంధ్ర నుంచి కాశీనాధుని నాగేశ్వరరావు, సీతారామయ్య గారు, కొండా వెంకటప్పయ్య వంటి పెద్దలంతా ఆ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆరోజుల్లోనే తెలుగు ప్రజలంతా ఒక్కటిగా ఉండాలని, అన్నదమ్ముల్లా బతకాలని, ప్రాంతాల మధ్య తగాదాలు రాకూడదని తాపత్రయ పడ్డారు. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం యూనివర్సిటీలు, హైకోర్టు, రాజధానిపై నిర్ణయాలు జరిగాయి. వాటిపై చర్చిస్తూ, ఒక ఒప్పందానికి వచ్చారు. హైకోర్టు, రాజధాని ఒకేచోట ఉండడం సరి కాదు. ప్రతి ప్రాంతానికి ఒకటి చొప్పున పంపిణీ చేయాలని ఒడంబడికలో రాసుకున్నారు. దానిలో భాగంగానే 1953లో రాజధానిగా చేశారు. 1956 వరకు కర్నూలు రాజధానిగా ఉంది’ అని ముఖ్యమంత్రి చరిత్రను వివరించారు.


*శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది?*
 ‘2014లో రాష్ట్ర విభజనకు ముందు జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ 23 జిల్లాల ఏపీకి సంబంధించి అనేక అంశాలు అధ్యయనం చేసింది. మానవ అభివృద్ధి సూచిక అంటే మనిషికి కావాల్సిన కనీస అవసరాలు, చదువులు, ఉద్యోగాలు ఆదాయం ఏయే జిల్లాలో ఎలా ఉన్నాయి? అని పరిశీలించింది. ఆ డేటా మనందరికి గుణపాఠం కావాలి. ప్రాంతీయ అసమానతలు, నీటి పరంగా, నిధుల పరంగా అసమానతలు, ఉద్యోగాల పరంగా అసమానతలు ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తాయో ఈ నివేదిక వెల్లడించింది. మొదటి తెలంగాణ ఉద్యమం అభివృద్ధి రాహిత్యం వల్ల వస్తే, రెండోసారి తెలంగాణ విడిపోవాలన్న వాదన అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్ల వచ్చిందని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. ఇది మనం నేర్చుకోవాల్సిన మొదటి గుణపాఠం’ అని సీఎం తెలిపారు.
 2014కు ముందు వేసిన శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పిందన్న దానిపై డిస్‌ప్లే చూద్దాం.. అంటూ.. ఆ స్లైడ్‌ వేసి చదివి వినిపించారు.
 ‘ఎక్కడైనా కూడా అభివృద్ధి అనేది ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కావడం వల్ల ఏ రకంగా నష్టం జరుగుతుందన్నది శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. దాని నుంచి మనం పాఠం నేర్చుకోవాల్సి ఉంది’ అంటూ, ఆ తర్వాత శివరామకృష్ణన్‌ కమిటీ కూడా ఏం చెప్పింది అని గమనిస్తే, వారూ ఇదే చెప్పారని అన్నారు. 
 ‘విడిపోయిన తర్వాత ఏపీ అభివృద్ధి అంతా ఒక్క ప్రాంతానికే పరిమితం చేయకూడదని ఆ కమిటీ చెప్పింది. ఆ కమిటీ చెప్పిన దాన్ని చంద్రబాబు విపరీతంగా వక్రీకరించారు. తన గంటన్నర ప్రసంగంలో అన్నీ అబద్ధాలే చెప్పారు.
చంద్రబాబు పాంప్లెంట్‌ ఛానల్‌ అయిన ఈటీవీ ఆనాడు శివరామకృష్ణన్‌ కమిటీ ఏం చెప్పిందన్నది ప్రదర్శించి చూపారు’.
 ‘అభివృద్ధి వికేంద్రీకరణకే ప్రాధాన్యం ఇవ్వాలని, విద్యా సంస్థలను కూడా 13 జిల్లాలకు పంపిణీ చేయాలని కమిటీ సూచించింది. రాజధాని రాష్ట్ర మధ్యలోనే ఉండాలన్న నియమం లేదని చెప్పింది. శివరామకృష్ణన్‌ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది. సూపర్‌ క్యాపిటల్‌ వద్దని, అన్నపూర్ణ వంటి ఈ ప్రదేశంలో రాజధాని వద్దని కూడా ప్రస్తావించింది. అభివృద్ధి అన్ని ప్రాంతాలకు సమానంగా విస్తరించాలని, లేకపోతే ప్రాంతాల మధ్య సమస్యలు వస్తాయని పేర్కొంది. ఇంకా వేరే చోట భూముల వివరాలు అడిగినా ప్రభుత్వం ఇవ్వలేదని ఆ కమిటీ తెలిపింది’ అని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.
 ఇదే శివరామకృష్ణన్‌ నాడు మీడియాతో ఏం మాట్లాడాడన్నది కూడా చూద్దామంటూ ఆ వీడియో చూపారు.


*శివరామకృష్ణన్‌ కమిటీ ఏం చెప్పింది?*
 ‘ఆ కమిటీ రిపోర్టులోని పేజీ 12, 13లో చాలా స్పష్టంగా రాశారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చాలా సారవంతమైన భూములు ఉన్నాయని, కాబట్టి వాటిని వ్యవసాయేతర భూములుగా మార్చడం సరి కాదని పేర్కొన్నారు. అదే నివేదికలోని పేజీ నెం.26లో మరిన్ని అంశాలు ప్రస్తావించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో పరిపాలన వికేంద్రీకరణ జరగాలని సూచించారు. అయినా చంద్రబాబుకు అవేవీ కనిపించలేదు. శివరామకృష్ణన్‌ హిందూలో ఒక వ్యాసం కూడా రాశారు. ‘ఐ ఆన్‌ క్యాపిటల్‌–లాస్‌ ఆఫ్‌ విజన్‌’. రాజధాని మీద కన్ను పడింది. దూరదృషి లోపించింది. అని దానర్థం. ఏపీ రాష్ట్ర నాయకత్వ శక్తులను, ఆర్థిక వనరులను మొత్తం మీద ఈ ప్రాజెక్టు మీద పెట్టడం ఆత్మహత్య సదృష్యం అంటూ ఆయన ఆ వ్యాసం ముగించారు. కానీ చంద్రబాబు అబద్ధాలు అవలీలగా ఆడి, శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పిందే చేశామని చెప్పారు’ అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.


*గడ్డిపరక విలువ కూడా ఇవ్వలేదు*
 ‘ఇదే శ్రీకృష్ణ కమిటీ కానీ, శివరామకృష్ణన్‌ కమిటీ కానీ మేము వేసినవి కాదు కదా? అది ఒకప్పుడు చంద్రబాబు కాపాడిన తెలుగు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు వేశాయి. పెద్దలు ఇంత స్పష్టంగా చెప్పినా 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు, వాటికి కనీసం గడ్డిపరక స్థాయి విలువ కూడా ఇవ్వలేదు. వన్‌ సైడెడ్‌గా చేసుకుంటూ పోయారు. బీసీజీ కానీ, కేటీ రవీంద్రన్‌ ఆధ్వర్యంలో వేసిన జీఎన్‌ రావు కమిటీ కానీ, గతంలో శివరామకృష్ణన్‌ కమిటీ మాదిరిగా వికేంద్రీకరణకు ఓటు వేశాయి. ఈ నివేదికల సారాంశాన్ని హైపవర్‌ కమిటీ సమీక్షించి నివేదిక ఇచ్చింది. గతంలో చేసిన తప్పులు సరిదిద్దుతూ హైపవర్‌ కమిటీ కొన్ని సూచనలు కూడా చేసింది’ అని సీఎం ప్రస్తావించారు.


*ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌*
 ‘గత ఒప్పందాలతో కానీ, గత చరిత్రతో కానీ, కమిటీల నివేదికలతో కానీ, జిల్లాల వెనకబాటుకు సంబంధించి నేటి వాస్తవాలతో కానీ, ప్రాంతీయ ఆకాంక్షలతో కానీ సంబంధం లేకుండా, 2015లో చంద్రబాబు నాయుడు గారు ఏకపక్షంగా ఓటుకు కోట్లు ఇస్తూ దొరికిపోయి హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చాడు. వస్తూ వస్తూ ఏం చేశాడు? ఎవరికీ ఏ అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా తన వారితో, తన బినామీల పేరుతో, చివరకు తన పేరుతో వేల ఎకరాల భూములు కొనిపించాడు. అందరికీ ఒకవైపు నూజివీడులో రాజధాని వస్తుందని భ్రమ కల్పించాడు. కాసేపటి క్రితం వక్తలు పేపర్లు చూపారు. నూజివీడులో, నాగార్జున యూనివర్సిటీ వైపు రాజధాని వస్తుందని అదే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాశారు. అలా ఎందుకు రాశారు? వీళ్లు లీక్‌లు ఇచ్చారు కాబట్టి, రాయమన్నారు కాబట్టి రాశారు. మరి అలా రాతలు రాసినప్పుడు ఇదే టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో నూజివీడు, నాగార్జున యూనివర్సిటీ ప్రాంతంలో భూములు కొనలేదు. ఎందుకు నష్టపోలేదు. వాళ్లకు మాత్రమే నోటిఫికేషన్‌ కన్నా ముందు 30.12.2014న జీఓ.254 ఇచ్చారు. అప్పుడు ఈ ఊళ్ల పేర్లు పబ్లిక్‌ డొమెయిన్‌లోకి రాలేదు. అంత కంటే ముందే వీళ్లు చక్కగా భూములు కొన్నారు. ఇవాళ వాటి విలువలు పోతాయని బాధ పడుతున్నారు. ఈ విధంగా రాబోయే రాజధాని ఇక్కడే అని నిర్ణయించి స్టేట్‌ను తన రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌గా మార్చడానికి చేయకూడని అన్ని పనులు చేశాడు చంద్రబాబు. రాజధాని కోసం భూములా? లేక తాను, తన మనుషులు, తన బినామీలు కొన్న భూముల కోసం రాజధానినా? అని చంద్రబాబును గట్టిగా ప్రశ్నిస్తున్నాను’ అని సీఎం నిలదీశారు.
 ఇంకా చంద్రబాబు తన స్వార్ధం కోసం రైతులు కొందరిని ఇమోషనలైజ్‌ చేశారని, మరి కొందరిని ప్రలోభ పెట్టారని, ఇంకొందరిని బెదిరించారని, ల్యాండ్‌ పూలింగ్‌కు ఒప్పుకోకపోతే వారు గ్రామాల్లో ఉండలేని పరిస్థితి కల్పించారని చెప్పారు.


*144వ సెక్షన్‌*
 ‘ఇవాళ 144 సెక్షన్‌ గురించి ఇంతగా యాగీ చేస్తున్నారు. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. 144 సెక్షన్‌ అనేది ఇదే రాజధాని గ్రామం, ఇదే జిల్లాలోని మచిలీపట్నంలో గత నాలుగేళ్లుగా కంటిన్యూగా ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో 2016 నుంచి మా ప్రభుత్వం వచ్చే దాక 144వ సెక్షన్‌ ఉంది. ఇది వాస్తవం కాదా? ఇవాళ వీళ్లందరికీ గుర్తుకు వచ్చింది. రెండు రోజులు 144 సెక్షన్‌ పెట్టేసరికి నానా యాగీ చేస్తున్నారు. కోర్టుకు పోవడం, వాళ్లకున్న పలుకుబడితో ఆర్డర్లు తీసుకురావడం జరిగింది’ అని సీఎం గుర్తు చేశారు.


*రియల్‌ ఎస్టేట్‌ దందా*
 ‘ఇలా 29 గ్రామాల పరిధిలో దాదాపు 33 వేల ఎకరాలు తీసుకున్నారు. ఎవరైనా కూడా రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే మనం ఎక్కడ పెడతాం?.
*ఉదాహరణకు*..
 ‘నా దగ్గర డబ్బుంది. రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాలంటే విజయవాడ శివారు లేదా గుంటూరుకు రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో పెట్టుబడి పెడతాం. కానీ ఇక్కడ పచ్చగా మూడు పంటలు పండే భూములు, నిర్మాణాలకు అనువుగా లేని గ్రామాలు, కనీసం రోడ్లు కూడా సరిగ్లా లేని గ్రామాలు, విజయవాడ, గుంటూరుకు ఎంతో దూరంలో ఉన్న గ్రామాల్లో పెట్టుబడి పెట్టారు. 
గుంటూరు నుంచి 38.36 కిమీ. అబ్బరాజుపాలెం విజయవాడ నుంచి 30 కిమీ, గుంటూరు నుంచి 38 కిమీ, శాకమూరు విజయవాడ నుంచి 29 కిమీ, గుంటూరు నుంచి 30 కిమీ., అయినవోలు విజయవాడ నుంచి 27 కి.మీ గుంటూరు నుంచి దాదాపుగా 34 కిమీ దూరం, నేలపాడు విజయవాడ నుంచి 26.3 కిమీ, గుంటూరు నుంచి 34.41 కిమీ దూరంలో ఉంది. ఇక వెలగపూడి గుంటూరు నుంచి 40 కి.మీ దూరం, విజయవాడ నుంచి దాదాపు 20 కిమీ’.
 ‘ఇంతింత దూరం అటు గుంటూరు, విజయవాడ నుంచి. అయినా ఇక్కడ భూములు కొనాలని ఎవరికైనా ఆలోచన ఎందుకు వస్తుంది. ఎలా వస్తుంది? ఇది చాలదా ఇక్కడ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగింది అని చెప్పడానికి. ఈ భూములన్నీ ఎప్పుడు కొన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక, నోటిఫికేషన్‌ రాకముందు. రాజధాని నోటిఫికేషన్‌ 30 డిసెంబరు 2014. చంద్రబాబు సీఎం అయింది 2014 జూన్‌లో. ప్రజలు ఎవరికీ ఇక్కడ రాజధాని వస్తుందని. కానీ టీడీపీ నాయకులు మాత్రం ఎడాపెడా భూములు కొన్నారు. ఆ విధంగా 4070 ఎకరాలు కొన్నారు. ఇప్పటి వరకు తేలిన మా లెక్కల ప్రకారం. అలా భూములు కొన్న వారిలో చంద్రబాబు సొంత కంపెనీ హెరిటేజ్‌ కూడా ఉంది’ అని ముఖ్యమంత్రి వివరించారు.
 ‘ఇక తాత్కాలిక అసెంబ్లీ, సెక్రటేరియట్‌ను తీసుకుంటే, విజయవాడ ప్రకాశం బ్యారేజీ దాటిన తర్వాత చాలా ఇరుకైన రహదారి మీదుగా రావాలి. రెండు వాహనాలు కూడా సరిగ్గా పట్టవు. కరకట్ట మీదుగా ప్రయాణించాలి. పైగా ముంపు ప్రాంతం. ఇది రాజధానికి పోయే రాజమార్గం. చంద్రబాబునాయుడు గారికి ఎప్పుడైనా ఈ గ్రామాల గురించి తెలుసా? ఆయన వీటి గురించి ఎప్పుడు తెలుసుకున్నాడంటే, ఇక్కడ భూములు కొన్నాక రాజధాని ఇక్కడ పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నాడు’ అని సీఎం తెలిపారు.


*నారాయణ కమిటీ*
  ‘ఎకనామిక్‌ సూపర్‌ పవర్‌గా రాజధాని ఉండరాదన్న శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను నీరు గార్చేందుకు, ఈ పెద్దమనిషి చంద్రబాబునాయుడు తన సొంత కమిటీ నారాయణ కమిటీ వేసుకున్నారు. అందులో ఎవరెవరు ఉన్నారు. సుజనా చౌదరి, గల్లా జయదేవ్‌. వీరంతా ఏ రంగంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. ఇలాంటి వారితో కమిటీ వేశాడు. శివరామకృష్ణన్‌ కమిటీ తన నివేదిక ఇవ్వక ముందే, రాజధాని ఇక్కడ పెట్టాలని నిర్ణయించుకుని తన సొంత మనుషులతో కమిటీ వేసుకున్నాడు. ఆ తర్వాత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ఇవి మాత్రమే కాకుండా నైన్‌ అండ్‌ వన్‌ అని చెప్పి ఇంకొక సినిమా చూపించాడు. మెడికల్, లీగల్, ఎడ్యుకేషన్, ఐటీ, టూరిజమ్, మ్యానుఫ్యాక్చరింగ్‌ ఇలా అన్నీ ఇక్కడే పెడతామంటూ.. ఒక్క దానిపై ఇప్పటి వరకు అంగుళం కూడా పని జరగలేదు. అయినా సినిమా చూపించాడు’.
 ‘రాష్ట్రంలోని అనేక జిల్లాలు చాలా వెనకబడి ఉన్నాయని కమిటీలు చెప్పినా, ఏపీ విభజన చట్టం చెప్పినా పట్టించుకోలేదు. రైతన్న కోసం అందించాల్సిన నీటి కోసం తాపత్రయ పడలేదు కానీ, తన బినామీల భూముల రేట్ల కోసం తాపత్రయ పడుతున్నాడు. రాష్ట్రమంతా నీటి కోసం, కూటి కోసం పరితపిస్తుంటే, నారా వారు మాత్రం కోట్ల కోసం, తన భూముల రేట్ల కోసం పరితపిస్తు పరిస్థితి చూస్తున్నాం’ అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.


*రాజధాని నిర్మాణం–వ్యయం*
 ‘ఇక అమరావతి నిర్మాణానికి సంబంధించి, ఇక్కడ కనీస సదుపాయాల కల్పన కోసం.. అమరావతి అనే ప్రాంతం అటు విజయవాడకు, ఇటు గుంటూరుకు ఎటూ దగ్గర లేదు. కానీ చంద్రబాబు భ్రమరావతిని చేశారు. ఇది వ్యవసాయ భూమి కాబట్టి, ఇక్కడ రోడ్లు, నీరు, కరెంటు, డ్రైనేజీ వంటి కనీస సదుపాయాల కోసం చంద్రబాబు ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఎకరానికి రెండు కోట్ల చొప్పున 53 వేల ఎకరాలకు అక్షరాలా రూ.1.09 లక్షల కోట్లు కావాలని, చంద్రబాబు మానస పుత్రిక అయిన ఈనాడులో డిసెంబరు 26, 2018న వేశారు. 
53 వేల ఎకరాలు అంటే కేవలం 8 కి.మీ రేడియస్‌. ఇక్కడ కనీస సదుపాయాల కోసం రూ.1.09 లక్షల కోట్లు కావాలని చంద్రబాబు నివేదిక ఇచ్చారు. మరి అమరావతిలో నిజంగా ఎంత ఖర్చవుతుందన్న దానిపై చంద్రబాబు ఏమన్నాడన్నది చూద్దాం’ అంటూ..
ఆ వీడియో చూపారు
 ‘కొత్త రాజధాని అంటే ఊర్కే అయిపోదు. కనీసం నాలుగు లక్షల నుంచి 5 లక్షల కోట్లు అవుతాయని ఆరోజే చెప్పాను’ అని చంద్రబాబు పేర్కొన్నారంటూ, 
కానీ ఇవాళ ప్లేటు ఎలా మార్చాడన్నది చూశాం. తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం అని చెప్పి, కొత్త వాటి కోసం రూ.14 వేల కోట్లతో టెండర్లు పిలిచాడు. మాట మార్చడం చంద్రబాబుకు కొత్త కాదు. ఆయన నైజం అలాంటిది. ఇది ఇంత భారీ ప్రాజెక్టును మేమేదో అడ్డుకుంటున్నామని ఆరోపిస్తున్నాడు. ఇక్కడ కనీసం సదుపాయాల కోసం రూ.1.09 లక్షల కోట్లు అవుతాయని చెప్పిన చంద్రబాబు, గత 5 ఏళ్లలో కేవలం రూ.5674 కోట్లు మాత్రమే ఖర్చు చేశాడు. బకాయిలుగా కట్టకుండా వదిలేసిన మొత్తం రూ.2297 కోట్లు. ఆ మొత్తం కట్టలేక చేతులెత్తేశాడు’ అని సీఎం వివరించారు.


*ఎన్నేళ్లలో ఎంత ఖర్చు?*
 ‘ఏ ప్రభుత్వం అయినా కూడా గరిష్టంగా 5 ఏళ్ల కాలంలో చేయగలిగే మొత్తం రూ.5 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్లు మాత్రమే. అంతే ఈ లెక్కన ఏటా రూ.1000 కోట్ల నుంచి రూ.2 వేల కోట్లు ఖర్చు చేయాలంటే ఇంకా లక్ష కోట్లు కావాలి. మరి ఈ లెక్కన అమరావతిని పూర్తి చేయడానికి ఎన్నేళ్లు పడుతుందో ఆలోచించండి. కనీసం 100 ఏళ్లు పడుతుంది. అది కూడా ఖర్చు లక్ష కోట్లు మించకపోతే. పోనీ అన్ని సంక్షేమ పథకాలు ఆపి, 5 రెట్ల వేగంతో పూర్తి చేయడానికి కనీసం 20 ఏళ్లు పడుతుంది. అయితే ఆ 20 ఏళ్లలో తెచ్చిన రుణంపై అసలు, వడ్డీ కలిపితే అక్షరాలా రూ.3,12,148 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే 30 ఏళ్లు అయితే, ఏడాదికి రూ.3633 కోట్లు ఖర్చు చేసుకుంటూ పోతే, ఈ ప్రాజెక్టు పూర్తయ్యే 30 ఏళ్లకు అసలు, వడ్డీ కలిపి ఏకంగా రూ.5.97 లక్షల కోట్లు అవుతాయి’.
 ‘మరి వాస్తవంగా పరిస్థితి ఎలా ఉందంటే.. అంత ఇరుకైన కరకట్ట గురించి ఏనాడూ ఈనాడు కానీ, చంద్రజ్యోతి కానీ రాయలేదు. కనీసం ఫోటో కూడా వేయలేదు. చంద్రబాబు ఇవాళ ఇది సెల్ఫ్‌ ఫైనాన్స్‌ రాజధాని అంటున్నాడు. ఏ డబ్బు పెట్టాల్సిన పని లేదంటున్నాడు. ఆ విధంగా మాట మార్చాడు. ప్లేటు మార్చాడు. నిజాలు దాచిన చంద్రబాబు అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అంటున్నాడు. ఆయనతో పాటు, ఆయనకు బాకా ఊదుతున్న ఎల్లో మీడియా ఇప్పటికిప్పుడు అమరావతి భూములు అమ్మితే లక్ష కోట్లు వస్తాయని, సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ మోడల్‌ అని చెప్పుకొస్తున్నారు. ఇందులో వాస్తవం ఏమిటని చూస్తే.. అందులో తేలిన నిజాలు ఏమిటంటే.. గ్రీన్‌ ట్రిబ్యునల్, రిజర్వ్‌ కన్సర్వేషన్‌ ప్రాంతాలు. అంటే ఇవన్నీ కూడా కృష్ణా నది పరివాహక ప్రాంతాలు. సింగపూర్‌ కంపెనీ కూడా బ్యాక్‌ కావడానికి కారణం.. ఇక్కడ కట్టాలనుకున్నా కట్టలేని పరిస్థితి. అవన్నీ తీసేస్తే ప్రభుత్వానికి నికరంగా మిగిలే భూమి కేవలం 5020 ఎకరాలు మాత్రమే. ఎకరం భూమి ఇవాళ రూ.20 కోట్లకు అమ్మితే లక్ష కోట్లు వస్తాయి. మరి నిజంగా ఇవాళ అక్కడ అంత ధర ఉందా? 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే, అప్పటికి వ్యయం మూడు లక్షల కోట్లు దాటుతుంది కాబట్టి, అప్పటికి ఎకరం భూమి రూ.90 కోట్లకు అమ్మాల్సి ఉంటుంది. మరి అంత భారీ పెట్టుబడి పెట్టే పరిస్థితి ఇవాళ ఉందా? అన్నది ఒక్కసారి అందరం ఆలోచించాల్సి ఉంది’ అని సీఎం వివరించారు.


*ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది?*
 ‘ఈ రాజధాని నగరం 8 కి.మీ రేడియస్‌. 53 వేల ఎకరాలు 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఇక్కడ కనీస సదుపాయాలకు రూ.1.09 లక్షల కోట్లు పెట్టగలిగే పరిస్థితి ఉందా అంటే.. రాష్ట్రం ఏర్పడిన నాటికి రాష్ట్ర అప్పు రూ.96 వేల కోట్లు ఉంటే, 2014 నుంచి 2019 మధ్య బాబు దోపిడి పుణ్యమా అని చెప్పి, మరో రూ.1.50 లక్షల కోట్ల అప్పు పెరిగింది. అంటే మొత్తం రూ.2.57 లక్షల కోట్ల అప్పుతో మా పరిపాలన ప్రారంభమైంది. ఇవి కాకుండా కార్పొరేషన్ల పేరుతో మరో రూ.57 వేల కోట్లు ఉన్నాయి. ఇంకా ఆయన వదిలిపెట్టిన బకాయిల మొత్తం అక్షరాలా రూ.39,423 కోట్లు. ఇదీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి’.
 ‘ఒక్క విద్యుత్‌ పంపిణీ సంస్థలను చూస్తే, 2014 నాటికి, చంద్రబాబు సీఎం అయ్యే నాటికి, అవి విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన మొత్తం రూ.2893 కోట్లు కాగా, ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆ మొత్తం రూ.21,540 కోట్లకు చేరాయి. ఆ స్థాయిలో బకాయిలు పెట్టి పోయాడు’ అని ముఖ్యమంత్రి వివరించారు.


*అయినా నెట్టుకొస్తున్నాం*
 ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా ఉందని చెప్పి, ఏనాడూ మాట తప్పలేదు. ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉన్నాం. ప్రజలను ఇబ్బంది పెట్టలేదు.
ఒకవైపు ఈ పరిస్థితి ఇలా ఉండగా.. 8 కి.మీ రేడియస్‌లో అంత ఖర్చు చేయగలమా? ఒకవేళ పనులు చేయాలంటే దేన్ని ఫణంగా పెట్టగలమని ఆలోచించండి’ అని కోరారు.


*కృష్ణా నీరు–పరిస్థితి*
 ‘కృష్ణా నదిలో పరిస్థితి నానాటికీ దారుణంగా మారుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి ∙సీడబ్ల్యూసీ 47 ఏళ్ల లెక్కలు చూస్తే, 1200 టీఎంసీలు అయితే, గత 10 ఏళ్ల రికార్డు చూస్తే 600 టీఎంసీలకు పడిపోగా, అదే సీడబ్ల్యూసీ లెక్కలు గత 5 ఏళ్లకు చూస్తే 400 టీఎంసీలకు పడిపోయాయి. ఈ కృష్ణా నదిపై 8 జిల్లాలు తాగు, సాగు నీటి కోసం ఆధారపడి ఉన్నాయి. ఇలాంటి 8 జిల్లాలలో వ్యవసాయానికి డోకా లేకుండా నీరివ్వాల్సి ఉంది. గోదావరిలో ఏటా 3 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. ఆ నీటిని కృష్ణా నది వైపునకు తీసుకువస్తే, 8 జిల్లాలకు నీరందించవచ్చు. గోదావరి నుంచి బనకచర్లకు నీరు తీసుకురావాలంటే రూ.68 వేల కోట్లు ఖర్చవుతాయని తేలింది. ఆ మొత్తం వ్యయం ఎలా తగ్గించాలని చెప్పి, తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడాం. ప్రత్యామ్నాయ మార్గంలో తక్కువ వ్యయంతో నీరు తీసుకువస్తే రూ.40 వేల కోట్లు అవుతాయి. ఆ విధంగా ప్రతి పైసా కోసం కిందా మీద పడుతా ఉన్నాం. ఇలాంటి ముఖ్యమైన ప్రాజెక్టు. 8 జిల్లాలకు వరప్రదాయిని. మరి చేద్దామా? వద్దా? అని ఇదే సభలో అడుగుతున్నాను’ అని ప్రశ్నించారు.


*ఈ ప్రాజెక్టులు చేపడదామా?*
 ‘వెనకబడిన ఉత్తరాంధ్రకు ప్రాణం పోసే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు. పోలవరం ఎడమ కాలువ నుంచి నీరు తరలించే ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.16 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. ఆ నీరు వస్తే ఉత్తరాంధ్రకు సాగు నీరందుతుంది. మరి ఆ ప్రాజెక్టు చేపడదామా? వద్దా? చెప్పండి’.
 ‘రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిస్థితి మీరే చూస్తున్నారు. నీరు వచ్చినా నింపుకునే పరిస్థితి లేదు. కాలువలు సక్రమంగా లేవు. డ్యామ్‌లకు సంబంధించి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలు కూడా ఇవ్వలేని పరిస్థితి. అవి ఇచ్చి, డ్యామ్‌లు బాగు చేసి నీరు నింపాలంటే అక్షరాలా రూ.25 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా. ఇది చేయకపోతే కరువులో ఉన్న ఈ ప్రాంతానికి మేలు చేసే పరిస్థితి ఉండదు. అదే విధంగా ఇప్పుడు కొనసాగుతున్న జలయజ్ఞం ప్రాజెక్టులు చూస్తే, నాన్నగారి హయాం నుంచి కంటిన్యూ అవుతున్నాయి. చంద్రబాబు హయాం ముగిసినా పూర్తి కాలేదు. అవి ఇప్పుడు పూర్తి కావాలంటే అక్షరాలా రూ.30 వేల కోట్లు ఖర్చవుతాయని ఇంజనీర్లు చెబుతున్నారు. మనలో 62 శాతం మంది కేవలం వ్యవసాయం, సంబంధిత పనులపైనే బతుకుతున్నారు’.
 ‘రైతులకు శాశ్వతంగా ఉచిత విద్యుత్‌ ఇవ్వాలంటే ప్రభుత్వం సబ్సిడీగా ట్రాన్స్‌కోకు రూ.8 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. గతంలో చంద్రబాబు ఏరోజు కూడా రూ.1200 కోట్లకు మించి ఇవ్వలేదు. దాంతో ట్రాన్స్‌కో బయటి నుంచి అప్పులు తెచ్చుకుంది. కాబట్టి రైతులకు శాశ్వతంగా ఉచిత విద్యుత్‌ ఇవ్వడం కోసం మరో మార్గం ఆలోచిస్తే.. సౌర విద్యుత్‌ ఉత్పత్తి. అందువల్ల 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి కోసం రూ.36 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. ఆ మొత్తం ఖర్చు పెడితే, ఏటా ట్రాన్స్‌కోకు రూ.8 వేల కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదని చూస్తున్నాం’.
 ‘మరోవైపు స్కూళ్లు, ఆస్పత్రులలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆస్పత్రులలో జనరేటర్లు లేక సెల్‌ఫోన్‌ లైట్ల వెలుగులో ఆపరేషన్లు చేయాల్సిన పరిస్థితి ఉంది. అదే విధంగా స్కూళ్లలో కనీస వసతులు కల్పించడానికి రూ.12 వేల కోట్లు, ఆస్పత్రులను బాగు చేయడానికి రూ.14 వేల కోట్లు ఖర్చవుతాయి. అంటే ఈ రెండింటికీ మొత్తం రూ.26 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. మరి ఆ పనులు చేద్దామా? వద్దా? చెప్పండి’.
 ‘రాష్ట్రంలో ఇవాళ తాగునీటి పరిస్థితి చూస్తున్నాం. కొద్ది రోజుల క్రితం వాటర్‌గ్రిడ్‌లో తాగడానికి నీళ్లు ఇవ్వడం కోసం ఉభయ గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల ప్రభావిత పలాస ప్రాంతం, కరువుతో అల్లాడే పల్నాడు, ప్రకాశం జిల్లాలో కిడ్నీ పీడిత ప్రాంతాలలో ప్రతి గ్రామానికి సురక్షిత మంచినీటి కోసం చేయాలంటే రూ.12 వేల కోట్లు ఖర్చవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇది చేయాలంటే మొత్తం రూ.45 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా’.
 ‘ఇక్కడే భావనపాడు. పక్కనే మచిలీపట్నం. అక్కడ పోర్టు వస్తే అభివృద్ధి జరుగుతుంది. అదే విధంగా ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టు. ఆ పనుల కోసం రూ.15 వేల కోట్లు కావాలి. మరి ఖర్చు *చేద్దామా? వద్దా?*
పేదలకు ఇంటి స్థలాలు. ఈ ఉగాది నాటికి అక్షరాలా 25 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని సంకల్పించాము. అదే విధంగా వచ్చే 4 ఏళ్లలో సంవత్సరానికి 6 లక్షల చొప్పున ఇళ్లు కట్టించి ఇవ్వాలంటే రూ.10 వేల కోట్లు కావాలి. ఆ విధంగా 4 ఏళ్లలో మొత్తం రూ.40 వేల కోట్లు కావాలి. మరి చేద్దామా? వద్దా?’ అని సభను సీఎం ప్రశ్నించారు.


*ఇంకా సంక్షేమ పథకాలు*..
 ‘దాదాపు 50 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాము. దాదాపు 46 లక్షల మందికి రైతు భరోసా అమలు చేస్తున్నాము. దాదాపు 43 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి పథకం. రాష్ట్ర జనాభాలో 90 శాతం మందికి ఆరోగ్యశ్రీ. లక్షలాది కుటుంబాల్లో ఉన్నత చదువులు చదువుకుంటున్న వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌. వసతి దీవెన. వడ్డీ లేని రుణాలు. ఉచిత పంటల బీమా. ధరల స్థిరీకరణ నిధి. విపత్తుల సమయంలో ఆదుకునే నిధి. పేదలకు నాణ్యమైన బియ్యం సరఫరా. 9 గంటల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌. ఇంకా చాలా చాలా పథకాలు అమలు చేస్తున్నాం’ అని వివరించారు.


*నాకూ చేయాలని ఉంది. కానీ*
 ‘ఇవన్నీ చేస్తూ కేవలం 8 కి.మీ రేడియస్‌లో ఉన్న 53 వేల ఎకరాల కోసం మరో లక్ష కోట్లు ఖర్చు చేయడం సాధ్యమేనా? నాకు అమరావతి నిర్మాణం చేయాలని ఉంది. మరోవైపు సంక్షేమ, అభివృద్ధి పథకాలు కూడా అమలు చేయాలని ఉంది. ఒక సీఎంగా అవన్నీ చేయాలని తాపత్రయ పడతాను. కానీ చేయగలిగిన పరిస్థితి ఉందా? లేదా? అన్నది ఆలోచిస్తాను’ అని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ చెప్పారు.


*కృష్ణా జిల్లాతో అనుబంధం*
 ‘చంద్రబాబుకు పిల్లనిచ్చిన మామ ఊరు నిమ్మకూరు అయితే, మా మేనత్త గారిది కూడా ఇదే జిల్లా మైలవరం నియోజకవర్గంలోని గణపవరం. మాకు ఈ జిల్లాతో నాలుగు దశాబ్ధాల అనుబంధం ఉంది. మాకు ఇక్కడ థియేటర్లు కూడా ఉన్నాయి. ఈ జిల్లా ప్రజలు మాపట్ల అపారమైన ప్రేమ చూపారు. ఇదే కృష్ణా, గుంటూరు జిల్లాలలో మొత్తం 33 మంది ఎమ్మెల్యేలు ఉంటే 29 మంది మా పార్టీ వారే గెల్చారు. ఈ జిల్లాలో నివసిస్తున్న వారంతా నా వారు. చివరకు టీడీపీలో గెల్చిన వారు కూడా మాకు మద్దతు ఇస్తున్నారు’ అని ముఖ్యమంత్రి వివరించారు. 


 రాజకీయాలలో నిజాయితీ, చిత్తశుద్ధి, మంచి చేయాలన్న ఆలోచన ఉండాలని, అది ఉంటేనే మంచి చేయగలుగుతామన్న ఆయన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నీ చేస్తూ, 8 కి.మీ పరిధిలో 53 వేల ఎకరాలకు మరో లక్ష కోట్లు ఖర్చు చేయడం ధర్మమేనా? అని అడిగారు. 


*పరిపాలన వికేంద్రీకరణ*
 ‘పరిపాలన వికేంద్రీకరణ చేస్తూ అడుగులు ముందుకు వేస్తాం. అమరావతి అనేది కూడా పెరుగుతుంది. ఏదో ఒక రోజు ఒక మహానగరంగా అభివృద్ధి చెందుతుంది. అందుకే అమరావతిని లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ చేశాము.
ఇదే విజయవాడ, గుంటూరులో దాదాపు 18 లక్షల జనాభా. ఈ రెండు నగరాలలో వచ్చే 5 ఏళ్లలో కేవలం రూ.2 వేల కోట్లు పెడితే, ఎంతో అభివృద్ధి చెందుతాయి. చివరకు నా ఇల్లు ఉన్న తాడేపల్లి కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. తాడేపల్లి, మంగళగిరిని మోడల్‌ మున్సిపాలిటీలుగా మార్చడం కోసం రూ.1100 కోట్లు ఖర్చు చేస్తే చాలు’.
 ‘ఇదే కృష్ణా జిల్లా, విజయవాడలో కృష్ణలంక ముంపునకు గురవుతోంది. ఈ 5 ఏళ్లలో కనీసం రీటెయినింగ్‌ వాల్‌ కూడా కట్టలేదు. అందుకే వెంటనే నిధులు మంజూరు చేశాను. పల్నాడులో తాగు, నీటి సరఫరాతో పాటు, మెడికల్‌ కాలేజీ, మచిలీపట్నంలో బ్యారేజీ కట్టాల్సి ఉంది. ఒక రెండు బ్యారేజీలు కడితే స్టోరేజీ కెపాసిటీ పెరుగుతుంది’.
 ‘ఇదే విజయనగరం జిల్లాలో మెడికల్‌ కాలేజీ లేదు. ట్రైబల్‌ ప్రాంతంలో యూనివర్సిటీ. ఇంజనీరింగ్, మెడికల్‌ కాలేజీల ఏర్పాటు. ఇవన్నీ కావాలంటే వనరులను దృష్టిలో ఉంచుకుని ప్రతి అడుగు వేస్తున్నాము’ అని ముఖ్యమంత్రి వివరించారు.
 ఒక మనిషికి ఎన్నో కోరికలు ఉన్నా, ఆర్థిక పరిస్థితిని బట్టి, ఏది ప్రాధాన్యమో నిర్ణయించుకుంటాడని, ఏదీ చూడకుండా అన్నీ మొదలు పెడితే ఏదీ పూర్తి కాదు. మరో భ్రమరావతిని చూపాల్సి వస్తుందని స్పష్టం చేశారు.


*విశాఖలోనే ఎందుకు?*
 ‘ఒక నాయకుడిగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే.. మన దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే, ఎంత జాగ్రత్తగా వాడాలన్న దానిపై ఆలోచన చేయాలి. ఒకవైపున 8 కి.మీ రేడియస్‌లో 53 వేల ఎకరాల వర్జిన్‌ ల్యాండ్‌. అక్కడ కనీసం వసతుల కోసం రూ.1.09 లక్షల కోట్లు కావాలి. ఈ మొత్తంలో కనీసం పదో వంతు ఖర్చు చేస్తే చాలు.. ఇవాళ కాకపోతే మరో 10 ఏళ్లకు హైదరాబాద్‌తో విశాఖ పోటీ పడుతుంది. మన పిల్లలకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విశాఖలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. 5 ఏళ్ల తర్వాత ఇదే చట్టసభలో మనం కూర్చుని ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? అన్నది చర్చిస్తే, ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇక్కడ లక్ష కోట్లు ఖర్చు చేస్తే, ఏం ప్రయోజనం ఉండదు. అదే విశాఖలో అతి తక్కువ ఖర్చు చేస్తే, ఎంతో అభివృద్ధి చెందవచ్చు. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి’ అని చెప్పారు.


*రాజధాని మధ్యలోనే ఉండాలా?*
 ‘ఒక్కసారి అందుకే ఆలోచన చేయండి. మనం బాధ్యత కలిగిన నాయకత్వ స్థాయిలో ఉన్నాం. కొన్ని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరిగే పరిస్థితి ఉన్నప్పుడు తీసుకోకపోవడం సమంజసం కాదు. రాజధాని రాష్ట్రం మధ్యలోనే ఉండాలని కాసేపటి క్రితం చంద్రబాబు గట్టిగా వాదించారు. మరి దేశ రాజధానికి అనేక నగరాలు ఎంతెంత దూరంలో ఉన్నాయో చూడండి. రాజధాని మధ్యలోనే ఉండాలని చంద్రబాబు, రామోజీరావు భావిస్తే, వెంటనే ప్రధాని మోదీకి లేఖ రాయండి. దేశం నడిబొడ్డుకు రాజధాని మార్చమని’.
 ‘అనేక రాష్ట్రాలలో రాజధానులు ఎక్కడెక్కడో ఉన్నాయి. ఎవరూ కూడా మధ్యలో ఉండాలని లెక్కలు వేసుకోరు. రాజధాని ఎక్కడ పెడితే ఖర్చు తగ్గుతుంది. వేగంగా అభివృద్ధి చెందుతుంది అన్నది ముఖ్యం’ అని చెప్పారు.


*అమరావతి ప్రజలకు*..
 ‘అమరావతి ప్రజలు, రైతులకు భరోసా ఇస్తున్నాను. ఎక్కడ కూడా మేము రాజధానిని మారుస్తున్నామని చెప్పలేదు. రాజధాని ఎక్కడికీ పోవడం లేదు. ఇక్కడే అసెంబ్లీ ఉంటుంది. ఇక్కడే చట్టాలు చేస్తాము. కాకపోతే మరో రెండు చోట్ల క్యాపిటల్స్‌ పెడుతున్నాము. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్‌ క్యాపిటల్‌ పెడుతున్నాము. ఇక్కడ అభివృద్ధి చేస్తూ, మిగిలిన వాటిని కూడా అభివృద్ధి చేస్తాము’.
 ‘అమరావతిలో రైతులకు యాన్యుటీగా ఇస్తున్న రూ.30 వేలు, రూ.50 వేల పరిహారాన్ని మరో 5 ఏళ్లు పెంచి 15 ఏళ్ల పాటు ఇవ్వబోతున్నాము. భూమి లేని పేదలకు ఇప్పుడు ఇస్తున్న రూ.2500 పెన్షన్‌ను రూ.5 వేలు చేస్తాము. దీని వల్ల 21 వేల కుటుంబాలకు మేలు జరుగుతుంది. ఇంకా పేదలు, అసైన్డ్‌ భూములు ఇచ్చిన అందరికీ కూడా ఇచ్చే స్థలం పెంచుతాము’ అని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.


చివరగా..
 చంద్రబాబు మాదిరిగా గ్రాఫిక్స్‌ చూపబోమని, చేయాల్సిందంతా చేసి చూపుతామని, అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు బాగుండాలని చెప్పారు. తాను ఏనాడూ వివక్ష చూపలేదని, తనకు అత్యంత సన్నిహితుడు కొడాలి నానితో పాటు, తన కార్యక్రమాలు చూసే తలశిల రఘురాం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారని గుర్తు చేశారు. 
 తనకు అందరూ ఓటు వేశారు కాబట్టే గెల్చానని, అందుకే ప్రతి ప్రాంతం, ప్రతి ఒక్కరి సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తానని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
Image
నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ.
Image