‘ఏపీలో ఉన్నామా ? పాకిస్తాన్‌లో ఉన్నామా ?’
అమరావతి: రాజధాని అమరావతి గ్రామాల్లో ఒకటైన మందడంలో తీవ్ర ఉద్రక్తత చోటుచేసుకుంది. రాజధానిని అమరావతిలోనే ఉంచాలన్న డిమాండ్‌తో రైతులు, స్థానికులు చేస్తున్న ఆందోళన 24 వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో... శుక్రవారం మందడంలో ఉద్రక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మందడం రైతులకు పోలీసులకు మధ్య పోలేరమ్మ గుడి వద్ద తోపులాట చోటుచేసుకొంది. ‘రాజధాని అమరావతిలోనే’ డిమాండ్‌తో విజయవాడకు బయలుదేరిన పలువురు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. దీంతో పలు గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజయవాడలో అమ్మవారికి నైవేద్యం, గాజులు, పసుపు, కుంకుమ ఇచ్చేందుకుగాను జేఎసీ ఆధ్వర్యంలో స్థానికులు విజయవాడకు ప్రదర్శనగా బయలుదేరారు. ఈ క్రమంలోనే... మందడం లోని పోలేరమ్మ ఆలయం వద్ద పోలీసులు వారిని అడ్డుకొన్నారు. ఈ క్రమంలో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి పోలీసుల అనుమతి కావాలా ? అంటూ మహిళలు పోలీసులను నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామా ? పాకిస్తాన్‌లో ఉన్నామా ? అంటూ మహిళలు తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. అమ్మవారికి పొంగళ్లు పెడుతుంటే పోలీసులు అడ్డుకోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం ఆందోళన చేస్తున్నామా ? అమ్మవారిని దర్శించుకోవడం తప్పా? అని రైతులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సమయంలో గుడి వద్ద రైతులను అరెస్ట్ చేశారు. మందడంలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి మరీ రైతులను అరెస్ట్ చేశారు. గుడికి వెళుతుంటే అక్రమంగా అరెస్ట్ చేశారనంటూ రైతులు మండిపడ్డారు. ఈ సందర్భంలోనే తుళ్లూరు మండలం పెద్దపరిమిలో కూడా ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఏపీలో ఉన్నామా ? పాకిస్తాన్‌లో ఉన్నామా ?’