సారలమ్మ.. వచ్చెనమ్మా
బుధవారం అర్ధరాత్రి గద్దెలపైకి చేరుకున్న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు
అట్టహాసంగా మొదలైన మహాజాతర
జన సంద్రంగా మేడారం
మేడారం పులకించింది.. సారలమ్మ అడుగు పెట్టగా!
వనం వెల్లువెత్తింది. పగిడిద్దరాజు పాదం మోపగా!
కోన కొత్త వెలుగు పొందింది.. గోవిందరాజు గద్దెకు రాగా!
నిన్నటి దాకా ఒంటరిగా ఉన్న అరణ్యం నేడు జనారణ్యమైంది.. ఎటు చూసినా గుడారమే.. ఎటు కదిలినా జనహారమే.. ప్రతి బాటా ఇటు వైపే.. ప్రతి మలుపూ తల్లుల దిక్కే.. ప్రతి ఎదా.. పదపదా అంటోంది..తల్లులను స్మరించుకొంటోంది..
మహా జాతరలో తొలి ఘట్టం ఆవిష్కృతమైంది. తండ్రి పగిడిద్దరాజు తోడురాగా.. భర్త గోవిందరాజు నీడనివ్వగా.. చిన్నమ్మ సారలమ్మ పండు వెన్నెల్లో గద్దెపైకి చేరింది. జగతికి నవ కాంతిని ప్రసాదించింది. ఈ అపురూప దృశ్యాన్ని చూసి లక్షల మంది భక్తులు జేజేలు కొట్టారు.
జయజయధ్వానాలతో ఎదురేగారు. కన్నెపల్లి.. కల్పవల్లి.. మా ఇలవేల్పు అంటూ తన్మయత్వంతో ఊగిపోయారు. ఈ సంబురాన్ని గుండెల్లో పదిలపరుచుకొని ముగ్గురినీ దర్శించుకున్నారు.
మేడారం మహా జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. చిన్నమ్మ సారలమ్మ తల్లిని కన్నెపల్లి ఆలయం నుంచి మేడారంలోని గద్దెపైకి తీసుకొచ్చే క్రమంలో ఈ ప్రాంతం మొత్తం భక్తుల జయజయధ్వానాలతో మార్మోగింది. అర్ధ రాత్రి 12.25 గంటల సమయానికి చిన్నమ్మ గద్దెపై కొలువుదీరారు. ఉదయం నుంచి భక్తులు ఎత్తు బెల్లాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకుంటూ ఆధ్యాత్మిక పారవశ్యంలో మునిగిపోయారు. గురువారం సమ్మక్కను తీసుకొచ్చే ముఖ్య తంతు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
కోలాహలంగా..
తొలుత సాయంత్రం కన్నెపల్లి ఆలయం నుంచి మొంటెలో సారలమ్మ దేవతను తీసుకొని గ్రామస్థులంతా ఊరేగింపుగా బయలుదేరారు. 4 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తూ రాత్రి జంపన్నవాగు దాటి ఇవతలి ఒడ్డుకు చేరుకొన్నారు. అక్కడి నుంచి సమ్మక్క పూజా మందిరం వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే అక్కడికి పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును, కొండాయి నుంచి గోవిందరాజును పూజారులు తీసుకొచ్చారు. సమ్మక్క దేవత వద్ద ప్రత్యేక పూజలు చేశాక, ముగ్గురినీ మేడారం ఆలయంలోని గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. మధ్యాహ్నం మొదలైన క్రతువు రాత్రి 12.25 వరకు కొనసాగింది. ఆరాధ్యదైవాలు గద్దెలపైకి రావడంతో భక్తులు పులకించిపోయారు. లక్షలాది భక్తులు గద్దెలను దర్శించుకున్నారు. సామాన్యుల దర్శనానికి 3 నుంచి 5 గంటల సమయం పట్టింది.జంపన్న వాగు స్నాన ఘట్టాలు జనసంద్రాన్ని తలపించాయి.
* సారలమ్మ రాకను పురస్కరించుకొని ఉదయం పూజాసామగ్రితో ప్రధాన పూజారి జగ్గారావుతో పాటు మరికొందరు పూజారులు గద్దెల వద్దకు వెళుతుండగా బొడ్రాయి చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సాధారణ భక్తుల దారిలో వెళ్లాలని సూచించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. తర్వాత పోలీసులు వారిని అనుమతించారు. అక్కడ విధుల్లో కొత్తవారు ఉండడంతో ఈ సమస్య తలెత్తింది.
నేడు సమ్మక్క రాక..
జాతరలో ప్రధాన ఘట్టమైన సమ్మక్క తల్లిని గురువారం గద్దెలపైకి తీసుకురానున్నారు. చిలుకలగుట్ట మీద నుంచి గురువారం సాయంత్రం కుంకుమభరిణె రూపంలో సమ్మక్కను తీసుకువస్తారు. సమ్మక్క తరలివచ్చే వేళ లక్షల మంది భక్తులు ఈ ఘట్టాన్ని తిలకించేందుకు పోటీపడతారు. రోప్‌పార్టీతో పాటు సుమారు 200 మంది పోలీసులు సమ్మక్కకు రక్షణగా వెంట వస్తారు. గురువారం రాత్రికి తల్లులిద్దరితోపాటు, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువై ఉంటారు. శుక్రవారం భక్తుల దర్శనాల తర్వాత శనివారం వన ప్రవేశం జరుగుతుంది.
మేడారానికి 7న సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల శుక్రవారం మేడారం జాతరను సందర్శించనున్నారు. హెలికాప్టర్‌లో ఉదయం 11 గంటలకు కుటుంబ సమేతంగా బయల్దేరి మేడారం చేరుకుని, సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం జాతర ఏర్పాట్లను పరిశీలిస్తారు. అదేరోజు ఉదయం 7 గంటలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై జాతరను సందర్శిస్తారు. 10 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు. కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా ఈ నెల 8న మేడారం వస్తున్నారు.
సీఎం కేసీఆర్ 7న పర్యటన అనంతరం మేడారంలో సమీక్ష నిర్వహించనున్నారు. మేడారం అభివృద్ధిపై పలు కీలక నిర్ణయాలను వెల్లడించే అవకాశం ఉంది. మేడారం, లక్నవరం, బొగత జలపాతం, రామప్ప ఆలయాలను కలిసి పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దాలని కోరుతున్నారు. ప్రత్యేక రైల్వేలైన్ ప్రతిపాదన ఉంది. వీటన్నింటిని సీఎం పరిశీలించి, అనువైన నిర్ణయాలు తీసుకునే వీలుంది. ములుగు జిల్లా పేరును ‘సమ్మక్క సారక్క’ జిల్లాగా మార్చాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యవేదిక కోరింది. వేదిక ప్రతినిధులు ఎమ్మెల్సీ రాములు నాయక్, మందకృష్ణ మాదిగ, ఆర్.కృష్ణయ్య, జి.చెన్నయ్యలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
సారలమ్మ.. వచ్చెనమ్మా