ప్రజల తీర్పును ఇప్పటికీ గౌరవించడం లేదు

ప్రజల తీర్పును ఇప్పటికీ గౌరవించడం లేదు
చిత్తూరు : ‘ఏ నగరంలో అయితే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఇబ్బంది పెట్టాలని చూశావో అదే నగరంలో నీకు ప్రజలు ఎటువంటి బహుమానం ఇచ్చారో చూస్తున్నావు’ అంటూ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ప్రజా చైతన్య యాత్ర పేరుతో గురువారం విశాఖపట్నంలో అడుగుపెట్టిన చంద్రబాబుకు స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. దీనిపై నారాయణస్వామి మాట్లాడుతూ.. కేవలం రియల్‌ ఎస్టేట్‌ కోసం, సొంతవాళ్ల కోసమే బాబు అమరావతి అంటున్నారని మండిపడ్డారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును ఆయన ఇప్పటికీ గౌరవించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజల మనోభావాలను గౌరవించి మూడు రాజధానులకు మద్దతిస్తే బాగుంటుందని హితవు పలికారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి కావాలనే మూడు రాజధానులు ప్రకటించామని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
వైఎస్సార్‌ కడప: ‘సీఎం జగన్‌ ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న సమయంలో వైజాగ్‌ ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే మీదనే ఆపేశారు.. కానీ ప్రస్తుతం చంద్రబాబును విశాఖ పర్యటనకు అనుమతిచ్చారు’ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అదే బాబుకు, వైఎస్‌ జగన్‌కు ఉన్న తేడా అని పేర్కొన్నారు. వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న బాబుపై ఆగ్రహంతోనే ప్రజలు అడ్డుకున్నారని తెలిపారు. ప్రజల అభిమానం లేని వ్యక్తులు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడటం సహజమేనని ఆయన విమర్శించారు.