విస్తృత తనిఖీలు, విభిన్న కోణాల్లో దర్యాప్తు చేయండి


తేది : 25.02.2020
అమరావతి


విస్తృత తనిఖీలు, విభిన్న కోణాల్లో దర్యాప్తు చేయండి


రాష్ట్రస్థాయి వాణిజ్య పన్నుల శాఖ సమగ్ర సమీక్షలో అధికారులకు సూచించిన ఉప ముఖ్యమంత్రి, అబ్కారీ మరియు వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె.నారాయణస్వామి


విజయవాడ రూరల్, ఫిబ్రవరి 25 : కోట్లలో వ్యాపారం చేస్తూ జీఎస్టీ ని ఎగవేస్తున్న పలువురు వ్యాపారులను వాణిజ్యపన్నుల శాఖ గుర్తించిందని ఉప ముఖ్యమంత్రి, అబ్కారీ మరియు వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె.నారాయణస్వామి వెల్లడించారు. జీఎస్టీ చట్టప్రకారం వైజాగ్ లో వ్యాపారి పై ఇటీవల కేసు నమోదు చేశామని తెలిపారు. కోట్లలో వ్యాపారం చేస్తూ లక్షల్లో జీఎస్టీ కడుతూ వాణిజ్య పన్నుల శాఖను మోసం   చేస్తున్న పలువురు వ్యాపారులను అధికారులు గుర్తించినట్లు మంత్రి వివరించారు. విజయవాడ రూరల్, ఈడ్పుగల్లులోని కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ కార్యాలయంలో మంత్రి మాట్లాడారు. వాణిజ్యపన్నుల  శాఖ అధికారులను విస్తృత తనిఖీలు చేయాలని మరియు విభిన్న కోణాల్లో దర్యాప్తు  చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. 2019 మార్చి నెలలో జీఎస్టీ ద్వారా రూ.1,800 కోట్లు రెవిన్యూ ఉందని, ఈ సంవత్సరం మార్చి నెలలో దీనికి అదనంగా రూ.1,000 కోట్లు రెవిన్యూ వసూలు చేయటానికి అధికారులను ఆదేశించామని తెలిపారు.  రూ.1000 కోట్ల  పాత బకాయిలను వసూలు చేయడం ద్వారా జూలై 2017 నుండి జనవరి 2020 వరకు ఉన్న లేట్ ట్యాక్స్ పేమెంట్స్ మీద వడ్డీ రూ.377 కోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు. రిటర్న్స్ ఫైల్ చేయని వారి మీద , ట్యాక్స్ లను సరిగా కట్టని వారి మీద చర్యలు తీసుకోవడం ద్వారా రూ.100 కోట్లు వసూలు చేయాలని నిర్ణయిoచడమైనందని వివరించారు.  జీఎస్టీ ఇన్ స్పెక్షన్స్ ద్వారా 270 కోట్లు , ఎరియర్స్ కలెక్షన్ ద్వారా రూ.150 కోట్లు మరియు CVT, ఇతర మార్గాల ద్వారా ఈ రూ.1,000 కోట్లు అదనంగా సాధించాలని అధికారులను ఆదేశించామన్నారు. 2020 జనవరి నెలాఖరి వరకు రూ.36 వేల కోట్లు రెవిన్యూ సాధించారు. మార్చి 31వ తేదీ నాటికి రూ. 45,000 వేల కోట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టినట్లు వెల్లడించారు. మార్చి 31 వ తేది వరకు రెవిన్యూ కలెక్షన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించామన్నారు.  ఈ నెలలో బాగా రెవిన్యూ సాధించిన అధికారులను ప్రత్యేకంగా గుర్తించి ప్రోత్సాహకములు మరియు గుర్తింపు పత్రాలు (సర్టిఫికెట్స్) ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. అదే విధంగా ఎరియర్స్ కలెక్ట్  చేయాలని సూచించడంతో పాటు సర్కిల్ వైస్ రిటర్న్స్ ఫైలింగ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపామన్నారు. వ్యాట్ మరియు జీఎస్టీ చట్టాల ప్రకారం గతం లో వాయిదా వేసిన బకాయిలు వసూలు చేయాలని చెప్పినట్లు మంత్రి తెలిపారు.  డివిజన్లు వారీగా రెవిన్యూ వచ్చే అంశాలపై దృష్టి పెట్టి రెవిన్యూ పెంచాలని సూచించినట్లు మంత్రి వెల్లడించారు. అక్రమంగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్న వారిపై కేసులు బుక్ చేయాలని ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రధానంగా సర్వీస్ సెక్టార్స్ పై దృష్టి పెట్టాలని సూచించినట్లు మంత్రి తెలిపారు. 


ఈ ఉన్నతస్థాయి సమీక్షలో రెవెన్యూ డిపార్ట్ మెంట్ స్పెషల్ సీఎస్ డా. డి.సాంబశివరావు, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ పీయూష్ కుమార్, 13 జిల్లాల జీఎస్టీ జాయింట్ కమిషనర్లు మరియు కమర్షియల్ ట్యాక్స్  కమిషనరేట్ లోని జాయింట్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


 


............