*24.02.2020*
*విజయనగరం*
*విజయనగరంలో ‘జగనన్న వసతి దీవెన’ పథకం ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్.జగన్*
*పట్టణంలోని పోలీస్ బ్యారెక్ గ్రౌండ్స్‌లో దిశ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి*
*ముఖ్యమంత్రి ప్రసంగంలో ముఖ్యాంశాలు:*
*స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా పేద కుటుంబంలో ఉన్న వారు పేదరికం దాటి ముందుకు అడుగు వేయలేదు*
*ఈ పరిస్థితి మారాలి*
*అందుకు ఏకైక మార్గం, ఆ పేద కుటుంబం అప్పులపాలు కాకుండా, ఆ కుటుంబం నుంచి ఒక ఇంజనీరు, డాక్టర్ లేదా కలెక్టర్ అయినా కావాలి*
*వారూ పెద్ద చదువులు చదవాలి.*
*మంచి ఉద్యోగాలు పొందాలి.*
*వారు సంపాదించిన దాంట్లో కొంత ఇంటికి పంపాలి, అప్పుడే పేదరికం పోతుంది*
*రాష్ట్రంలో ఇప్పటికీ 33 శాతం నిరక్షరాస్యులున్నారు*
*అదే సమయంలో దేశంలో అది 27 శాతం మాత్రమే,అంటే జాతీయస్థాయి కంటే దిగువన మనం ఉన్నాం*
*గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో (జీఈఆర్) కూడా కేవలం 23 శాతమే ఉంది*
*ఈ పరిస్థితి మారడం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా చదువుల విప్లవానికి శ్రీకారం చుట్టాం*
*అందులో భాగంగా ఇవాళ ఇక్కడి నుంచి వసతి దీవెన ప్రారంభిస్తున్నందుకు గర్వపడుతున్నాను*
*ఏటా రూ.2.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న పేద విద్యార్థులకు రూ.20 వేల వరకు హాస్టల్, మెస్ ఛార్జీల కింద ఇస్తాం*
*జనవరి, ఫిబ్రవరిలో మొదటి వాయిదా కింద రూ.10 వేలు, జూలై, ఆగస్టులో మరో రూ.10 వేలు డిగ్రీ, ఆ పై కోర్సులు అభ్యసించే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తాం*
*వీరే కాకుండా ఐటిఐ విద్యార్థులకు రెండు విడతల్లో రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా రెండు విడతల్లో రూ.15 వేలు ఇస్తాం*
*ఒక కుటుంబంలో ఎందరు పిల్లలు చదివినా అందరికీ ఇస్తాం*
*దాదాపు 11.87 లక్షల మంది పిల్లలకు ఒక బటన్ నొక్కగానే, ఆయా మొత్తాల్లో సగం ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా దాదాపు రూ.1100 కోట్లు జమ అవుతాయి*
*వసతి దీవెన కోస ఏటా రూ.2300 కోట్లు ఖర్చు చేస్తుండగా, విద్యా దీవెన కోసం ఏటా మరో రూ.3700 ఖర్చు చేయబోతున్నాం*
*ఇవే కాకుండా అమ్మ ఒడి పథకంలో అక్షరాలా 42 లక్షల మంది తల్లులకు, తద్వారా 82 లక్షల మంది పిల్లలకు మేలు*
*ఆ తల్లుల ఖాతాల్లోకి రూ.15 వేల చొప్పున, రూ.6400 కోట్లు జమ చేశాం*
*ఈ మూడు పథకాలకే రూ.12400 కోట్లు ఖర్చు చేస్తున్నామని గర్వంగా చెబుతున్నాం*
*నాడు–నేడు మనబడి ద్వారా మూడేళ్లలో అన్ని స్కూళ్ల రూపురేఖలు మార్చబోతున్నాం*
*మధ్యాహ్న భోజన మెనూలో పూర్తి మార్పులు*
*దానికి అదనంగా రూ.200 కోట్లు ఖర్చైనా లెక్క చేయకుండా భరిస్తున్నాం*
*నాడు.నేడు మనబడిలో 45 వేల స్కూళ్లు, 471 జూనియర్ కళాళాలలు, 3287 హస్టళ్లు, 148 డిగ్రీ కళాశాలల రూపురేఖలు మారుతాయి*
*దీనికి దాదాపు రూ.13 వేల కోట్లు ఖర్చైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది*
*ప్రతి పిల్లవాడు చదవడమే కాదు, భావి తరంతో పోటీ పడాలి*
*అందుకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియమ్ ప్రవేశపెడుతున్నాం*
*ఇవాళ చదువుకుంటున్న పిల్లలు ప్రపంచంలో పోటీ పడాలి. దీన్ని ఈ ప్రభుత్వం గుర్తించి, అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తోంది*
*కానీ ఈ ప్రభుత్వంపై రోజూ కొందరు విమర్శలు చేస్తున్నారు. వారిని ఏమనాలో మీరే ఆలోచించాలి*
*తమను ప్రజలు చిత్తుగా ఓడించారు కాబట్టి, రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోవాలని కోరుకుంటూ డబ్బులు ఇచ్చి మరీ పత్రికల్లో రాయిస్తున్నారు*
*దుష్ప్రచారం చేస్తున్నారు* *ఇటువంటి వారిని ఏమనాలో మీరే ఆలోచించమని కోరుతున్నాను*
*రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయడానికి వీల్లేదని, దాడులు చేస్తున్న మూకలను ఏమనాలి అని చెప్పి, ఒక్కసారి ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను*
*చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 25 లక్షల ఇళ్లస్థలాల పట్టాలు ఇస్తా ఉంటే, ఇక చంద్రబాబు గురించి మాట్లాడుకునే వారే ఉండరనే భయంతో తప్పుడు రాతలు రాస్తున్న ఈ పత్రికలను, తప్పుడు మాటలు చూపిస్తున్న ఈ ఛానళ్లను ఏమనాలో ఒక్కసారి ఆలోచించాలని మిమ్మల్నందరినీ కోరుతున్నాను*
*ఇంగ్లిష్ మీడియమ్‌కు, వేర్వేరుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్లు ఏర్పాటు చేసి వారి జీవితాలు బాగు చేయడం కోసం ఇంకా ఫోకస్డ్‌గా అప్రోచ్ తీసుకోవడానికి.. ఇటు వంటి వాటికి కూడా చివరకు.. స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా దామాషాలో సీట్లు పెంచడానికి కూడా అడ్డు పడుతున్న ఇటువంటి వారిని ఏమనాలో ఒక్కసారి ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతా ఉన్నాను*
*ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నా కూడా చరిత్రలో అతి గొప్ప మెజారిటీతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం*
*ప్రజలు ఇచ్చిన బలంతో, దేవుడి దయతో ఇక మీదట కూడా ముందడుగులు వేస్తామని ఈ వేదిక నుంచి మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను*
*ఇంటింటా చదువులు, అందరికీ ఆరోగ్యం, అన్ని ప్రాంతాలకు నీళ్లు, రైతన్నలకు ఆనందం, ఉద్యోగాలు–ఉపాధి.. ఈ లక్ష్యాల సాధనే లక్ష్యంగా ప్రభుత్వాన్ని గొప్పగా నడిపేట్టుగా మీ బిడ్డను ఆశీర్వదించమని కోరుతా ఉన్నాను*
*దేవుడి దయ చాలా కావాలి. ఎందుకంటే రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నాం*
*ఏ తప్పూ చేయకపోయినా కూడా, ఏదేదో జరిగి పోతున్నట్లుగా విపరీతమైన రాతలు. విపరీతంగా చూపిస్తున్న టీవీ ఛానళ్లు*
*యుద్ధం చేస్తా ఉన్నది ఒక్క ప్రతిపక్షంతోనే కాదు. ఒక ఉన్మాదులతో యుద్ధం చేస్తా ఉన్నాం*
*ముఖ్యమంత్రి శ్రీ వైయస్. జగన్*
*సీఎం వైయస్.జగన్ పూర్తి ప్రసంగం*.....
చదువుల దీపాలు వెలిగిస్తేనే ఈ తరంతో పాటు, భావి తరాల తలరాతలు మారుతాయని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా పేద కుటుంబంలో ఉన్న వారు పేదరికం దాటి ముందుకు రాలేదని, ఈ పరిస్థితి మారాలని, పేద కుటుంబాల పిల్లలు కూడా గొప్ప చదువులు చదవాలని ఆయన ఆకాంక్షించారు. అందుకే ఆ దిశలోనే అడుగులు వేస్తూ, దేశంలో ఎక్కడా లేని విధంగా చదువుల విప్లవానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇవాళ చదువుకుంటున్న పిల్లలు ప్రపంచంతో పోటీ పడాల్సి ఉందని, దాన్ని గుర్తించే ఈ ప్రభుత్వం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తుంటే, రోజూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రం నుంచి పరిశ్రమలు పోవాలని కోరుకుంటూ డబ్బులు ఇచ్చి మరీ పత్రికల్లో రాయిస్తున్నారని, దుష్ప్రచారం చేస్తున్నారని అటువంటి వారిని ఏమనాలో అందరూ ఆలోచించాలని సీఎం కోరారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయడానికి వీల్లేదని, దాడులు చేస్తున్న మూకలను ఏమనాలి అని ఒక్కసారి ఆలోచన చేయాలని, తప్పుడు రాతలు రాస్తున్న ఈ పత్రికలను, తప్పుడు మాటలు చూపిస్తున్న ఈ ఛానళ్లను ఏమనాలో ఒక్కసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ మనం రాక్షసులతో యుద్ధం చేస్తున్నామని అన్నారు. ఏ తప్పూ చేయకపోయినా కూడా, ఏదేదో జరిగి పోతున్నట్లుగా విపరీతమైన రాతలతో పాటు, విపరీతంగా చూపిస్తున్న టీవీ ఛానళ్లు ఉన్నాయన్న ముఖ్యమంత్రి తాము యుద్ధం చేస్తా ఉన్నది ఒక్క ప్రతిపక్షంతోనే కాకుండా, ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నామని చెప్పారు.
సుదీర్ఘ పాదయాత్రలో నిరుపేద విద్యార్థుల, వారి తల్లిదండ్రుల కష్టాలు స్వయంగా చూసి, పేదరికం వల్ల ఏ ఒక్క విద్యార్థి కూడా ఉన్నత విద్యకు దూరం కాకూడదన్న లక్ష్యంతో చేపట్టిన ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరంలో ప్రారంభించారు.
ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఆపై కోర్సులు అభ్యసించే విద్యార్థులకు భోజనం, వసతి కింద ఈ పథకంలో ఏటా రూ.20 వేల వరకు ఆర్థిక సహాయం చేస్తారు. ఐటిఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు అభ్యసించే విద్యార్థులకు రూ.20 వేల ఆర్థిక సహాయం చేయనున్నారు. రెండు విడతల్లో ఆ మొత్తాన్ని ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. ‘జగనన్న వసతి దీవెన’ పథకంలో ఇప్పుడు 11,87,904 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోంది.
జగనన్న వసతి దీవెన పథకం తొలి విడతలో 53,720 మంది ఐటీఐ విద్యార్థులకు, 86,896 మంది పాలిటెక్నిక్ విద్యార్థులకు.. డిగ్రీ, పీజీ విద్యార్థులు మరో 10,47,288 మందికి ఆర్థిక సహాయం అందనుంది.
ఐటీఐ విద్యార్థులకు తొలి విడతగా రూ.5 వేల చొప్పున, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.7,500 చొప్పున, డిగ్రీ, పీజీ విద్యార్థులకు రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.1139.15 కోట్లు వారి వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు.
తాడేపల్లి నుంచి విశాఖపట్నం మీదుగా నేరుగా విజయనగరం చేరుకున్న సీఎం శ్రీ వైయస్ జగన్ స్థానిక అయోధ్య మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ‘జగనన్న వసతి దీవెన’ పథకం ప్రారంభించారు. ఆ తర్వాత స్థానిక పోలీసు బ్యారెక్ గ్రౌండ్స్‌కు చేరుకున్న సీఎం అక్కడ, దిశ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు.
*చదువుల దీపాలు వెలిగిస్తేనే*
ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు అంటూ ప్రసంగం మొదలు పెట్టిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్, దేశానికి స్వాతంత్య్రం వచ్చి తరాలు మారుతున్నా నిరుపేదలు, సామాజికంగా అణిచివేతకు గురైన వారి తలరాతలు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాల్లో చదువుల దీపాలను వెలిగిస్తేనే ఈ తరంతో పాటు, రాబోయే తరాల తలరాతలు కూడా మారుతాయని ఆయన స్పష్టం చేశారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా పరిస్థితి చూస్తే, పేద కుటుంబంలో ఉన్న వారు పేదరికం దాటి ముందుకు అడుగు వేయలేదని, ఈ పరిస్థితి మారాలని అన్నారు. అందుకు ఏకైక మార్గం ఆ పేద కుటుంబం అప్పులపాలు కాకుండా, ఆ కుటుంబం నుంచి ఒక ఇంజనీరు, డాక్టర్ లేదా కలెక్టర్ అయినా కావాలని పేర్కొన్నారు. వారూ పెద్ద చదువులు చదవాలని, మంచి ఉద్యోగాలు పొందాలని, అప్పుడు వారు సంపాదించిన దాంట్లో కొంత ఇంటికి పంపాలని, అప్పుడే పేదరికం పోతుందని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని సీఎం వెల్లడించారు.
*నిరక్షరాస్యత–జీఈఆర్*
రాష్ట్రంలో ఇప్పటికీ 33 శాతం నిరక్షరాస్యులున్నారన్న ముఖ్యమంత్రి, అదే సమయంలో దేశంలో అది 27 శాతం మాత్రమే అని చెప్పారు. అంటే జాతీయ స్థాయి కంటే దిగువన మనం ఉన్నామని గుర్తు చేశారు. అదే విధంగా 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉన్న పిల్లల్లో ఇంటర్ తర్వాత కళాశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్యకు సంబంధించిన ‘గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో’ (జీఈఆర్) కూడా చాలా తక్కువగా ఉందని తెలిపారు.
‘మనం బ్రిక్స్ దేశాలతో పోల్చుకుంటాం. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా. ఆయా దేశాలతో పోలిస్తే.. రష్యాలో జీఈఆర్ 81 శాతం, బ్రెజిల్, చైనాలో 50 శాతం ఉంటే, మన దగ్గర మాత్రం అది కేవలం 23 శాతం మాత్రమే. అంటే నూటికి 77 మంది పిల్లలు ఇంటర్ తర్వాత కళాశాలలకు వెళ్లడం లేదు’ అని ముఖ్యమంత్రి వివరించారు.
*చదువుల విప్లవం*
ఈ పరిస్థితుల్లో మన పిల్లలు ఏ రకంగా పేదరికం నుంచి బయటకు వస్తారు? ఆ కుటుంబాలు ఎలా బాగు పడతాయన్న సీఎం, ఈ పరిస్థితి మారాలని, ఆ పిల్లలు కూడా గొప్ప చదువులు చదవాలని స్పష్టం చేశారు. అందుకే ఆ దిశలోనే అడుగులు వేస్తూ, దేశంలో ఎక్కడా లేని విధంగా చదువుల విప్లవానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు.
అందులో భాగంగా ఇవాళ ఇక్కడి (విజయనగరం) నుంచి వసతి దీవెన ప్రారంభిస్తున్నందుకు గర్వపడుతున్నానని చెప్పారు. వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల కంటే తక్కువ ఉన్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఈ పథకంలో రూ.20 వేల వరకు భోజనం, వసతి కోసం ఇస్తామని ప్రకటించారు.
*ఇదీ వసతి దీవెన*
మంచి చదువులు చెప్పించడంతో పాటు, మంచి వసతి కల్పించాలన్న లక్ష్యంతో ఈ పథకం చేపట్టామన్న ముఖ్యమంత్రి, ఇందులో జనవరి, ఫిబ్రవరిలో మొదటి వాయిదా కింద రూ.10 వేలు, జూలై, ఆగస్టులో మరో రూ.10 వేలు డిగ్రీ, ఆ పై కోర్సులు అభ్యసించే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. వీరే కాకుండా ఐటిఐ విద్యార్థులకు రెండు విడతల్లో రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రెండు విడతల్లో రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదివినా, ప్రతి ఒక్కరికీ ఇస్తామని సీఎం ప్రకటించారు.
11.87 లక్షల మంది పిల్లలకు ఒక బటన్ నొక్కగానే, ఆయా మొత్తాల్లో సగం ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా రూ.1100 కోట్లకు పైగా జమ అవుతాయి.
*పథకాలు–వ్యయం*
వసతి దీవెన పథకం కోసం ఏటా రూ.2300 కోట్లు ఖర్చు చేస్తుండగా, విద్యా దీవెన పథకంలో ఏటా మరో రూ.3700 ఖర్చు చేయబోతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ రెండు పథకాల ద్వారా దాదాపు రూ.6 వేల కోట్లు పిల్లల కోసం ఖర్చు చేస్తున్నామని చెప్పారు.
*అమ్మ ఒడి*
ఇవే కాకుండా అమ్మ ఒడి పథకంలో 1 నుంచి 12వ తరగతి వరకు ప్రతి పిల్లవాడికి తోడుగా ఉండాలని అక్షరాలా 42 లక్షల మంది తల్లులకు, తద్వారా 82 లక్షల మంది పిల్లలకు మేలు జరిగే విధంగా, ఆ తల్లుల ఖాతాల్లోకి రూ.15 వేల చొప్పున జమ చేసి, అక్షరాలా రూ.6400 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి వివరించారు.
ఈ మూడు పథకాలకే రూ.12400 కోట్లు ఖర్చు చేస్తున్నామని గర్వంగా చెబుతున్నామని సీఎం అన్నారు.
*నాడు–నేడు మనబడి*
నాడు–నేడు మనబడి కార్యక్రమంలో వచ్చే మూడేళ్లలో అన్ని స్కూళ్ల రూపురేఖలు మార్చబోతున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అదే విధంగా మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు నాణ్యమైన వెరైటీ ఆహారం అందించేందుకు మెనూలో పూర్తి మార్పులు చేశామని, దానికి అదనంగా రూ.200 కోట్లు ఖర్చైనా లెక్క చేయకుండా పిల్లలకు తోడుగా ఉండే విధంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.
నాడు–నేడు మనబడి పథకంలో 45 వేల స్కూళ్లు, 471 జూనియర్ కళాళాలలు, 3287 హస్టళ్లు, 148 డిగ్రీ కళాశాలల రూపురేఖలు మారుతాయని, దీనికి దాదాపు రూ.13 వేల కోట్లు ఖర్చైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.
*ఇంగ్లిష్ మీడియం*
మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఒక చదువు మాత్రమే అన్న సీఎం, ప్రతి పిల్లవాడు చదవడమే కాదు, భావి తరంతో పోటీ పడాల్సి ఉందని చెప్పారు. అందుకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతున్నామని, ఆ తర్వాత ఏడాది 7వ తరగతి, ఆ తర్వాత 8వ తరగతి, ఆ తర్వాత 9వ తరగతి, ఆ తర్వాత ఏడాది 10వ తరగతి.. ఆ విధంగా వచ్చే 4 ఏళ్లలో మన పిల్లలు బోర్డు పరీక్షను ఇంగ్లిష్‌లో రాస్తారని, అదే సమయంలో తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉంటుందని వివరించారు.
*అందరి గురించి*..
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రభుత్వం తమది అని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలో కోసం ఆలోచించే ప్రభుత్వం తమదని.. ప్రతి అక్కా చెల్లి గురించి అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నామని.. మహిళా సాధికారతకు కట్టుబడిన ప్రభుత్వం తమది అని.. అన్ని కుటుంబాలు చల్లగా ఉండాలని.. ఆ దిశలోనే దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
*ఇన్ని చేస్తున్నా..*
ఇవాళ చదువుకుంటున్న పిల్లలు ప్రపంచంలో పోటీ పడాల్సి ఉందని, దీన్ని ఈ ప్రభుత్వం గుర్తించి, అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తోందని సీఎం చెప్పారు. అయినా ఈ ప్రభుత్వంపై రోజూ కొందరు విమర్శలు చేస్తున్నారని గుర్తు చేశారు. వారిని ఏమనాలో అందరూ ఆలోచించాలని కోరారు.
*ఒక్కసారి ఆలోచన చేయండి*
‘తమను ప్రజలు చిత్తుగా ఓడించారు కాబట్టి, రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోవాలని కోరుకుంటూ డబ్బులు ఇచ్చి మరీ పత్రికల్లో రాయిస్తున్నారు. దుష్ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి వారిని ఏమనాలో మీరే ఆలోచించమని కోరుతున్నాను. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయడానికి వీల్లేదని, దాడులు చేస్తున్న మూకలను ఏమనాలి అని చెప్పి, ఒక్కసారి ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 25 లక్షల ఇళ్లస్థలాల పట్టాలు ఇస్తా ఉంటే, ఇక చంద్రబాబు గురించి మాట్లాడుకునే వారే ఉండరనే భయంతో తప్పుడు రాతలు రాస్తున్న ఈ పత్రికలను, తప్పుడు మాటలు చూపిస్తున్న ఈ ఛానళ్లను ఏమనాలో ఒక్కసారి ఆలోచించాలని మిమ్మల్నందరినీ కోరుతున్నాను’.
‘ఇంగ్లిష్ మీడియంకు, వేర్వేరుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్లు ఏర్పాటు చేసి వారి జీవితాలు బాగు చేయడం కోసం ఇంకా ఫోకస్డ్‌గా అప్రోచ్ తీసుకోవడానికి.. ఇటు వంటి వాటికి కూడా చివరకు.. స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా దామాషాలో సీట్లు పెంచడానికి కూడా అడ్డు పడుతున్న ఇటువంటి వారిని ఏమనాలో ఒక్కసారి ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతా ఉన్నాను’ అని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ కోరారు.
*ఇక మీదటా ముందడుగులు*
ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నా కూడా చరిత్రలో అతి గొప్ప మెజారిటీతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం వెల్లడించారు. ప్రజలు ఇచ్చిన బలంతో, దేవుడి దయతో ఇక మీదట కూడా ముందడుగులు వేస్తామని, ఇదే విషయాన్ని ఈ వేదిక నుంచి మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తున్నానని చెప్పారు.
*రాక్షసులు, ఉన్మాదులతో యుద్ధం*
‘ఇంటింటా చదువులు, అందరికీ ఆరోగ్యం, అన్ని ప్రాంతాలకు నీళ్లు, రైతన్నలకు ఆనందం, ఉద్యోగాలు–ఉపాధి.. ఈ లక్ష్యాల సాధనే లక్ష్యంగా ప్రభుత్వాన్ని గొప్పగా నడిపేట్టుగా మీ బిడ్డను ఆశీర్వదించమని కోరుతా ఉన్నాను. దేవుడి దయ కూడా చాలా కావాలి. ఎందుకంటే రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఏ తప్పూ చేయకపోయినా కూడా, ఏదేదో జరిగి పోతున్నట్లుగా విపరీతమైన రాతలు. విపరీతంగా చూపిస్తున్న టీవీ ఛానళ్లు. యుద్ధం చేస్తా ఉన్నది ఒక్క ప్రతిపక్షంతోనే కాదు. ఒక ఉన్మాదులతో యుద్ధం చేస్తా ఉన్నాం’ అని సీఎం పేర్కొన్నారు.
*అందుకే*..
ఇటువంటి చోట అందరి చల్లని దీవెనలు కావాలని, దేవుడి దగ్గర అందరి చల్లని ప్రార్థనలు కూడా కావాలని కోరారు.
*చివరగా*..
‘మీ బిడ్డను, మీ అన్నను ఆశీర్వదించాలని మరోసారి కోరుకుంటున్నాను’ అంటూ సీఎం శ్రీ వైయస్ జగన్ ప్రసంగం ముగించారు.
కాగా, కార్యక్రమంలో 6వ తరగతి విద్యార్థి అంగ్ల ప్రసంగం సీఎంతో సహా, ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.
*సీహెచ్ అభిమన్యు. 6వ తరగతి, జడ్పీహెచ్‌ఎస్, బొప్పడాం.*
– ‘నిరుపేద కుటుంబాలకు సీఎం ఎంతో మేలు చేస్తున్నారు. ఎన్నెన్నో పథకాలు అమలు చేస్తున్నారు. విష్ణు భగవంతుడు కాని వాడు రాజ్యానికి రాజు కాడు. కాబట్టి మన జగనన్న కూడా విష్ణు దేవుడంతటి వారు. సుదీర్ఘ పాదయాత్రలో నిరుపేద విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కష్టాలు స్వయంగా చూసిన శ్రీ వైయస్ జగన్, అమ్మ ఒడి పథకం ద్వారా నిరుపేద తల్లులకు రూ.15 వేల ఆర్థిక సహాయం చేయడంతో పాటు, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ‘జగనన్న గోరుముద్ద’ అమలు చేస్తున్నారు. అద్భుత మెనూతో దాన్ని అమలు చేస్తూ, ఒక అమృత భాండాగారంగా మాకిస్తున్నారు. ఇంకా ఉన్నత విద్యను అభ్యసించే విధంగా విద్యార్థులకు పూర్తి ప్రోత్సాహం ఇస్తున్నారు. నేను భవిష్యత్తులో తప్పనిసరిగా ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను’.
అభిమన్యు ప్రసంగానికి ముగ్ధుడైన సీఎం శ్రీ వైయస్ జగన్, ఆ పిల్లవాణ్ని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా ముద్దు పెట్టుకుని అభినందించారు.
ఉప ముఖ్యమంత్రి శ్రీమతి పి.పుష్పశ్రీవాణి, మంత్రులు శ్రీ బొత్స సత్యనారాయణ, శ్రీ పి.విశ్వరూప్, శ్రీమతి మేకతోటి సుచరిత, శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాస్, శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్, శ్రీ ఎం.శంకరనారాయణ, శ్రీమతి తానేటి వనితతో పాటు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, అనధికారులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
*జగనన్న వసతి దీవెన–విద్యార్థులు*
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,31,899 మంది, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 57,270 మంది విద్యార్థులు ఇప్పుడు ‘జగనన్న వసతి దీవెన’ ద్వారా లబ్ధి పొందనుండగా, జిల్లాల వారీగా చూస్తే.. విజయనగరంలో 59,688, విశాఖలో 1,05,709, తూర్పు గోదావరిలో 1,23,938, పశ్చిమ గోదావరిలో 86,816, కృష్ణాలో 1,19,197, గుంటూరులో 1,19,618, ప్రకాశంలో 70,128, నెల్లూరులో 67,541, అనంతపురంలో 85,041, వైయస్సార్ కడపలో 78,595, కర్నూలులో 82,464 మంది విద్యార్థులు ‘జగనన్న వసతి దీవెన’ పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారు.