నాటు సారా కేంద్రాలపై మెరుపు దాడులు

నాటు సారా కేంద్రాలపై మెరుపు దాడులు
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో నాటు సారా నిర్మూలనకు పోలీసులు కదం తొక్కారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాల మేరకు, ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్‌కు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా నాటు సారా కేంద్రాలపై పోలీసు, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పోలీస్, ఎక్సైజ్ శాఖ సమన్వయంతో నాటు సారా తయారీ కేంద్రాలపై ఉదయం 4 గంటల నుండి దాడులు చేస్తున్నారు. పదివేల మంది సిబ్బందితో తనిఖీలు కొనసాగుతున్నాయి. వందలాది మంది పోలీస్ అధికారులతో కూడిన బృందాలతో, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు, ప్రొబేషనరీ ఐపీఎస్, సీఐలు,ఎస్సైలు, పది వేల మంది సిబ్బందితో రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు దాడులు జరుగుతున్నాయి. నాటుసారా నిల్వలు ఉన్నాయనే సమాచారం మేరకు జిల్లాలను జల్లెడపడుతున్నారు. ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో బెల్లం ఊట నిల్వలు, నాటుసారా నిల్వలను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఎన్నికల్లో పూర్తిగా మద్యం, డబ్బు పంపిణీని కట్టడి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులు చేస్తున్నారు.