వైకాపా రంగులతో కార్యాలయాలున్నచోట ఎన్నికలు ఆపండి: శైలజానాథ్
విశాఖపట్నం: ప్రభుత్వ కార్యాలయాలకు ఎక్కడైతే వైకాపా రంగులున్నాయో.. ఆయా ప్రాంతాల్లో ఎన్నికలు ఆపేయాలని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు. నగర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకవేళ రంగులు తొలగించని పక్షంలో అధికారుల నుంచి ధనాన్ని వసూలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికల్ని కుట్రపూరితంగా నిర్వహిస్తోందని ఆరోపించారు. ఇవే ఎన్నికల్ని 3 నెలల ముందు నిర్వహించి ఉంటే కాంగ్రెస్ కూడా స్వాగతించేదన్నారు. బుధవారం అరకు ప్రాంతంలో పర్యటించినప్పుడు నామినేషన్ వేసే అభ్యర్థుల్ని కూడా అధికార పార్టీ వ్యక్తులు బెదిరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. మద్దతు ఇవ్వకపోతే పథకాల్ని ఆపేస్తామని, అంగన్వాడీలో వారికున్న ఉద్యోగుల్ని తీసేస్తామని భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. నామినేషన్ వేస్తున్న అభ్యర్థులకు కుల ధ్రువీకరణ మంజూరులో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, పీసీసీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి జి.ఎ.నారాయణ, కార్యదర్శి సోడదాసి సుధాకర్, జిల్లా ఇన్‌ఛార్జి సంకు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
వైకాపా రంగులతో కార్యాలయాలున్నచోట ఎన్నికలు ఆపండి: శైలజానాథ్