ఇంజనీరింగ్‌ ఫీజుల్లో కోత.  నేడు సర్కారుకు సిఫారసులు నిబంధనలకు విరుద్ధంగా ఒక్క ఏడాదికే పరిమితం కమిషన్‌ రెగ్యులేషన్స్‌కు సవరణ

ఇంజనీరింగ్‌ ఫీజుల్లో కోత.  నేడు సర్కారుకు సిఫారసులు
నిబంధనలకు విరుద్ధంగా ఒక్క ఏడాదికే పరిమితం
కమిషన్‌ రెగ్యులేషన్స్‌కు సవరణ
అమరావతి : ఇంజనీరింగ్‌ ఫీజులకు సంబంధించిన సిఫారసులను ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. 2019-20 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తించేలా ఈ సిఫారసులు ఉండనున్నాయి. తాజాగా సీఎం వద్ద జరిగిన సమావేశం తర్వాత ప్రతిపాదిత ఫీజుల్లో పలు మార్పులు చేశారు. కనిష్ట ఫీజుగా రూ.35 వేలలో మార్పు లేకపోయినా కాలేజీల సంఖ్యను మాత్రం భారీగా పెంచారు. గరిష్ఠ ఫీజును తొలుత రూ.99 వేలుగా, తర్వాత రూ.75 వేలుగా, ఇప్పుడు రూ.69 వేలుగా తగ్గించి సిఫారసు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజులపై భారీగా కోతలు పెట్టి మరీ ఫీజులను ప్రతిపాదించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 287 ఇంజనీరింగ్‌ కాలేజీలకు ఫీజులు నిర్ణయించాల్సి ఉండగా 281 కాలేజీలకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. 183 కాలేజీలకు రూ.35 వేలు, 37 కాలేజీలకు రూ.35 వేలు-రూ.45 వేలు, 30 కాలేజీలకు రూ.45వేలు-రూ.55 వేలు, 11 కాలేజీలకు రూ.55 వేలు-రూ.65 వేలు, 20 కాలేజీలకు అత్యధికంగా రూ.65 వేలు-రూ.70 వేల మఽధ్య ఫీజును ప్రతిపాదించినట్లు తెలిసింది. వాస్తవానికి 2019-22 విద్యా సంవత్సరం వరకు అంటే మూడేళ్లకు ఫీజులు సిఫారసు చేయాల్సి ఉండగా.. ఉన్నత విద్య కమిషన్‌  కేవలం 2019-20 వరకే సిఫారసు చేస్తోంది. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం కావడంతో ‘కమిషన్‌ రెగ్యులేషన్స్‌-2020’కి సవరణ చేస్తూ ఉన్నత విద్యాశాఖ  ఉత్తర్వులు జారీ చేసింది.