తేది : 06.03.2020
అమరావతి
కరోనా వైరస్ పై వస్తున్న వదంతులు నమ్మవద్దు
• రాష్ట్రంలో కరోనా కేసుల్లేవు
• కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది
• అధిక ధరకు మాస్క్ లు అమ్మితే కఠిన చర్యలు
• ప్రతిరోజు కరోనా వైరస్ పరిస్థితిపై మీడియా బులెటిన్ విడుదల: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని)
• ఫిబ్రవరి 10 తర్వాత విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన వ్యక్తులు తప్పనిసరిగా తమ వివరాలను వైద్యారోగ్యశాఖకు అందించాలి
• కరోనా వైరస్ కు సంబంధించి 104 హెల్ప్ లైన్ ఏర్పాటు :ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి డా.పి.వి రమేష్
• త్వరలో ప్రభుత్వాసుపత్రుల్లో టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు
• రాష్ట్రంలో 20 వేల మెడికల్ షాపుల్లో అందుబాటులో ఫ్రీ మాస్క్ లు: వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి
అమరావతి, 6 మార్చి : కరోనా వైరస్ కు సంబంధించి మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని) అన్నారు. వెలగపూడి సచివాలయంలోని నాల్గవ బ్లాక్ లో ఉన్న ప్రచార విభాగంలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.పి.వి రమేష్, వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి లతో కలిసి ఉపముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు.రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు నమోదుకాలేదని స్పష్టం చేశారు.ఇప్పటివరకు మొదటిదశలో 11, రెండవ దశలో 13 కేసులు మొత్తం 24 కేసులు వైద్యారోగ్యశాఖ దృష్టికి రాగా వారి శాంపిల్స్ ను పూణేలోని ల్యాబ్ కు పంపించామన్నారు. అందులో 20 మందికి వ్యాధిలేదని తేలినట్లు నిర్ధారించారన్నారు. మరో నలుగురి సమాచారం రావాల్సి ఉందని వెల్లడించారు. నలుగురిలో ముగ్గురు శ్రీకాకుళం వాసులుకాగా, ఒకరు ఒంగోలుకు చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. ఇప్పటివరకు వచ్చిన కేసులన్నీ అనుమానిత కేసులేనని మంత్రి స్పష్టం చేశారు.తిరుపతిలో ఒక అనుమానిత కేసు వచ్చినప్పటికీ వారికి కరోనా సోకలేదని తేలడంతో ఇంటికి పంపినట్లు వెల్లడించారు. కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని మంత్రి సూచించారు. ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం మూడు గంటలకు పైగా వైద్య ఆరోగ్యశాఖతో పాటు ఇతర శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్ధేశం చేశారన్నారు. కరోనా వైరస్ కు సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని తెలిపారు. మాస్క్ లను బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.దీనికి సంబంధించి ఇప్పటికే ఒంగోలులో రెండు షాపులపై కేసులు నమోదు చేశామన్నారు. అధిక ధరలకు ఎవరైనా మార్కెట్లో మాస్క్ లు విక్రయిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. మందుల కొరత ఉందని వస్తున్న వార్తలు అవాస్తవమని, సరిపడా మందులతో పాటు మాస్క్ లు తదితర ఎక్విప్ మెంట్, సిబ్బంది ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోకి కరోనా వైరస్ ప్రవేశిస్తే ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కరోనాపై ఈరోజు కేంద్రం నిర్వహించే కార్యశాల(వర్క్ షాప్)లో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఢిల్లీకి పంపినట్లు మంత్రి వెల్లడించారు. మార్చి 9న రాష్ట్రస్థాయిలో శిక్షణాకార్యక్రమం ఏర్పాటు చేసి రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో వైద్యులకు శిక్షణను ఇస్తామన్నారు. కరోనా వైరస్ ను ఎదుర్కోవడం ఎలా, ముందస్తు జాగ్రత్తలు, నివారణ చర్యలు తదితర అంశాలను క్యాంపులో వివరిస్తామన్నారు. ప్రజలెవరూ భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని, దుష్ప్రచారాలను నమ్మవద్దని హితవు పలికారు.
ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి డా.పి.వి రమేష్ మాట్లాడుతూ కరోనా వైరస్ అనేది కరోనా సోకిన వ్యక్తి నుంచి ఇతరులకు సోకుతుందన్నారు. మరే ఇతర మార్గాల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందదన్నారు. జంతువుల ద్వారా, చికెన్, మటన్ తినడం ద్వారా కరోనా వ్యాప్తి చెందనని, అది సోకిన వ్యక్తికి దగ్గరగా ఉంటే తప్ప వ్యాప్తి చెందే అవకాశం లేదన్నారు. ఒకవేళ వైరస్ సోకినా 14 నుండి 28 రోజుల వరకు లక్షణాలు కన్పించవన్నారు. ఎక్కువగా గొంతు, ముక్కు ద్వారా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుందని వివరించారు. కరోనా సోకిన వారిని తాకితే అధికశాతం మంది నామమాత్రపు చికిత్స తీసుకుంటే సరిపోతుందని, ఐదు శాతం మంది మాత్రమే ఐసీయూ దాకా వెళ్లాల్సి ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి ప్రతీ రోజూ ఈ విషయమై సమీక్షలు జరుపుతూ పలు సలహాలు, సూచనలు ఇస్తున్నారన్నారు. వైద్యఆరోగ్యశాఖ మంత్రి కరోనాపై అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. ఇదో కొత్త రకం వైరస్ అని వెల్లడించారు. ఫిబ్రవరి 10 తర్వాత విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన వ్యక్తులు తప్పనిసరిగా తమ వివరాలను వైద్యారోగ్యశాఖకు అందించాలని కోరారు. అదే విధంగా అనుమానితులు 104 హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి తగిన సమాచారం పొందవచ్చన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా ఇంటివద్దే ఉండాలని, జనసంచార ప్రాంతాల్లో తిరగవద్దని సూచించారు. అవసరమైతే తప్ప ఎవరూ దూర ప్రయాణాలు చేయవద్దని హితవు పలికారు. చేతులు కడుక్కోవడం, ముఖానికి మాస్క్ లు ధరించడం, ఎస్క్ లేటర్, తలుపులు, బల్లలపై చేతులు వేయకుండా ఉండటం వంటి సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను నియంత్రిచవచ్చన్నారు. ప్రజలను ఆందోళనకు గురిచేయకుండా మీడియా, సోషల్ మీడియా వాస్తవాలను ప్రసారం చేయాలని కోరారు. తప్పుడు కథనాలు ప్రచారం చేయవద్దని హితవు పలికారు. కరోనా కూడా అన్ని జబ్బుల్లాంటిదేనని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పిలుపునిచ్చారు. ఏ సమస్య ఉన్నా వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు బాధ్యతగా తమ వివరాలు వైద్య ఆరోగ్యశాఖకు తెలియపరచాలన్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఆరోగ్య సలహాలు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనలు ప్రజలు పాటించాల్సిందిగా కోరారు.
వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ దరి చేరకుండా ప్రజలు ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. దేశంలో కరోనా వైరస్ లు నమోదైన దృష్ట్యా రాష్ట్రంలో ఇప్పటివరకు 351 మందిని పరిశీలనలో పెట్టామన్నారు. ఇప్పటికే కరోనా వైరస్ పై వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీల ను సమన్వయపరుస్తూ సీఎస్ అధ్యక్షతన రెండు సార్లు సమీక్ష నిర్వహించామన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించామన్నారు. రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి నెల అవుతుందన్నారు. నిన్ననే 104 హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశామన్నారు. ఎవరికైనా కరోనాకు సంబంధించిన అనుమానాలుంటే హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చన్నారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు ఒకసారి, రాత్రి 8 గంటలకు ఒకసారి ఆరోగ్యపరిస్థితిపై బులెటిన్ విడుదల చేస్తున్నామన్నారు. కరోనా పాజిటివ్ కేసులు వస్తేనే ఎన్ 95 మాస్క్ లు వాడాలన్నారు. ఇప్పటికే లక్షా పదివేల ఎన్ 95 మాస్క్ లు అందుబాటులో ఉంచామన్నారు. రాష్ట్రంలో 20 వేల మెడికల్ షాపుల్లో ఫ్రీ మాస్క్ లు అందుబాటులో ఉంచామన్నారు. ఎవరైనా మాస్క్ లను బ్లాక్ చేయడం, అధిక ధరలకు అమ్మడం వంటివి చేస్తుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో రాష్ట్రంలో టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. దీనికి సంబంధించి రూ.100 కోట్లు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించారని తెలిపారు. ఇప్పటికే ఐసీఎంఆర్ తో ఈ విషయమై చర్చించామన్నారు. త్వరలో రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈనెల 4వ తేదీన ఇటలీ దేశం నుండి రాష్ట్రానికి 23 మంది వచ్చారని, వారిలో 14 మందికి ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే వైద్య పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందన్నారు. మరో నలుగురు వ్యక్తులు అందుబాటులో లేరని వారి వివరాలు సేకరిస్తున్నామన్నారు. మిగిలిన వారు స్వగ్రామాలకు వచ్చిన వెంటనే పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వీరందరిని హౌస్ ఐసోలేషన్ లో ఉంచుతామన్నారు. చైనా నుంచి విశాఖకు నౌక వచ్చిందని దీనిపై నౌకాదళ అధికారుల నుండి నిబంధనల ప్రకారం వివరాలు సేకరించి వెల్లడిస్తామన్నారు.
..............