తేది: 12.03.2020
అమరావతి
క్రీడల్లో రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు
అభినందించి సత్కరించిన ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షులు
అమరావతి, 12 మార్చి: క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు రాణిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షులు కె.వెంకట్రామిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గోల్డ్, సిల్వర్ మెడల్ సాధించిన ఉద్యోగులు (క్రీడాకారులు) గురువారం రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగ సంఘాల అధ్యక్షులు కె.వెంకట్రామిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. క్రీడల్లో రాణించి పతకాలు సాధించిన ఇద్దరు ఉద్యోగులను ఆయన అభినందించి సత్కరించారు. సచివాలయం మూడోబ్లాక్ లోని ఉద్యోగ సంఘ కార్యాలయంలో కమిటీతో కలిసి గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీహార్(పాట్నా) లో ఏపీ సివిల్ సర్వీసెస్ స్పోర్ట్స్ నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ మరియు పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొని పతకాలు సాధించడం హర్షణీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు జిల్లా తెనాలిలోని నందివెలుగు జిల్లా పరిషత్ హైస్కూల్ కు చెందిన కొల్లిపర నాగశిరీష పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని బంగారు పతకం(గోల్డ్ మెడల్) సాధించారని అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ లో రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న పీ.బి.వి.ఎస్ కిషోర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని వెండిపతకం(సిల్వర్ మెడల్) సాధించడం విశేషమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులను క్రీడల్లో ప్రోత్సహిస్తుందని ఆయన గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ సెక్రటరీ శేఖర్, ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అదనపు కార్యదర్శి కె.రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
........