కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు

కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు
విజయవాడ: కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్ కేఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. కరోనా నిరోధక చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. 135 మంది శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపగా 108 మందికి  నెగిటివ్‌ వచ్చిందన్నారు. 3 కోరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని, వారికి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. 24 మంది శాంపిల్స్‌ రిపోర్టులు రావాల్సి ఉందని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చే వారికి గృహ నిర్బంధ నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడం కోసం ఇంటింటి సర్వే చేపట్టామన్నారు. ఏపీలో అన్ని లైన్‌ డిపార్ట్‌మెంట్లతో  కలిసి సర్వే చేపడుతున్నామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సహకారంతో ఈ సర్వే చేపట్టామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కోటి 41 లక్షల కుటుంబాలకు గాను.. కోటి 33 లక్షల ఇళ్లను సర్వే చేశామని తెలిపారు. ప్రతీ పట్టణ, గ్రామాల్లో విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని స్థానిక పీహెచ్‌సీల ద్వారా  వైద్యుల పర్యవేక్షణలో ఉంచామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల స్వీయ నిర్బంధంలో  తప్పనిసరిగా ఉండాలని జవహర్‌రెడ్డి పేర్కొన్నారు.