కరోనా కట్టడికి మరిన్ని చర్యలు
: మంత్రుల బృందం
అమరావతి : కరోనా పై అమరావతి సచివాలయం ఐదవ భవనంలో మంత్రులు బృందం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని) మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. రాష్ట్రంలోను లేదా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన లేదా వేరే రాష్ట్రాలకు చెందిన వారు అయినప్పటికీ ఎక్కడా ఉన్నవారిని అక్కడే ఉంచి వారికి తగిన ఆహారం వసతి సౌకర్యాలు కల్పించాలని మంత్రులు బృందం అధికారులకు స్పష్టం చేసింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రెండు మూడు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువుల నిల్వలు అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో కూరగాయలు ఇతర నిత్యావసర వస్తువులు ఆర్టీసి డిపోల్లో అత్యవసర సేవలకై అందుబాటులో ఉంచిన ఆర్టీసీ బస్సులు ద్వారా వివిధ కాలనీలకు పంపి సరఫరా చేస్తే బాగుంటుందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు రోడ్లపై తిరగకుండా ఇళ్ళకే పరిమితం అయ్యేలా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిర్మాణ కార్మికులు, ఇతర కూలీలు వంటివారికి తగిన ఆహారం, వసతి సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందన్నారు. సీఎంవో అదనపు సిఎస్ డా.పివి రమేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు,తిరుపతి, కర్నూలు వంటి నగరాలకు ఒక ఐఏఎస్ అధికారిని నియమించి ప్రత్యేక దృష్టి పెట్టి కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు . ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, సియంఓ అదనపు సిఎస్ పివి రమేశ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి, హరికృష్ణ, ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కరోనా కట్టడికి మరిన్ని చర్యలు : మంత్రుల బృందం