ఓటమి భయంతోనే ఇలాంటి చర్యలు

*రాజకీయ కుట్రతోనే ఎన్నికలు వాయిదా*– చంద్రబాబు కనుసన్నల్లో ఈసీ పనిచేయడం దారుణం


– ఓటమి భయంతోనే ఇలాంటి చర్యలు


– మేం అడ్డుకునుంటే అన్ని నామినేషన్లు పడేవా?


– ఎన్నికలు జరిగితే వైసీపీ క్లీన్‌స్వీప్‌ చేయడం ఖాయం


– రాయదుర్గం, తాడిపత్రి సీఐల సస్పెన్షన్‌ శోచనీయం


– అధికారులను మానసికంగా దెబ్బతీయడానికి టీడీపీ యత్నం


– ఆరు వారాలు రాష్ట్రాన్ని చంద్రబాబే పాలించాలనుకుంటున్నారు?


– గవర్నర్‌ జోక్యం చేసుకుని ఎన్నికలు నిర్వహించాలి


– మీడియాతో ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి


 


అనంతపురం :


కరోనా పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం రాజకీయ కుట్రతోనే జరిగిందని అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు కనుసన్నల్లో ఎలక్షన్‌ కమిషనర్‌ పని చేయడం శోచనీయమన్నారు. ఆదివారం తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, స్థానిక ఎన్నికల్లో ఓటమి తప్పదని ఆయన గ్రహించారన్నారు. అందుకే తన హయాంలో నియమించుకున్న ఈసీ రమేశ్‌కుమార్‌ను వాడుకుని ఎన్నికలు వాయిదా పడేలా చేశారని ఆరోపించారు. ఇదంతా ప్రీప్లాన్‌గా జరిగిందన్నారు. తాను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. కరోనా అనేది డెంగీ, స్వైఫ్లూ వంటిదేనని, ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉందన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించిందని, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 90 శాతం స్థానాలు వైసీపీ విజయం సాధించేదన్నారు. ఈ క్రమంలో టీడీపీకి ప్రజలు శాశ్వత సమాధి కడుతున్నారని గ్రహించి ఎన్నికల కమిషనర్‌తో కలిసి రాజకీయ క్రీడను చంద్రబాబు ఆడారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్న సమయం నుంచే ఈ ఎన్నికలు జరగవని చంద్రబాబు ప్రకటనలు చేస్తూ ఉన్నారని, కానీ ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తారని అనుకోలేదన్నారు. టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న సీపీఐ నేతలు కూడా కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని ఏకంగా మాస్క్‌లు ధరించి ప్రెస్‌మీట్లు పెట్టారన్నారు. పత్రికల్లో ఆ వార్తలు చదవగానే అనుభవం ఉన్న నాయకులు ఇలా మాట్లాడారేంటని అనుకున్నానని, కానీ ఎన్నికల వాయిదా ప్రకటన రాగానే దీని వెనుక ఉన్న వాస్తవాలు తెలుస్తున్నాయన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సంబంధిత వైద్య ఆరోగ్యశాఖ నుంచి నివేదికలు తెప్పించుకోకుండా ఎన్నికలు వాయిదా అని చెప్పడం దారుణమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి మరోసారి పట్టం కట్టాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, ఈ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీని రద్దు చేసుకునే పరిస్థితులు వస్తాయని అన్నారు.


*అలా చేసుకుంటే ఇన్ని నామినేషన్లు వేసేవాళ్లా?*


స్థానిక ఎన్నికలు అప్రజాస్వామికంగా జరుగుతున్నాయని ప్రతిపక్షాలు వ్యాఖ్యానించడాన్ని ఎమ్మెల్యే అనంత ఖండించారు. జిల్లాలో 841 ఎంటీపీసీ స్థానాలకు 4575, జెడ్పీటీసీకి సంబంధించి 63 స్థానాలకు 409 నామినేషన్లు, అనంతపురం మునిసిపల్‌ కార్పొరేషన్‌తో పాటు 10 మునిసిపాలిటీల్లోని 358 వార్డులకు 2535 నామినేషన్లు వేశారన్నారు. నిజంగా తాము బెదిరిస్తూ అప్రజాస్వామికంగా వెళ్తుంటే అంత మంది నామినేషన్‌ వేసేవారా? అని ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో 1994లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగాయో, ఎన్ని ఏకగ్రీవాలు చేసుకున్నారో గమనించాలన్నారు. ప్రసుత్తం వైసీపీకి 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారని.. కానీ ఎక్కడా అప్రజాస్వామికంగా వ్యవహరించడం లేదన్నారు. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాకపోయినా తాడిపత్రి, రాయదుర్గం సీఐలను సస్పెండ్‌ చేయడం దారుణమన్నారు. అధికారులను మానసికంగా దెబ్బతీయడానికి ఎన్నికల కమిషనర్‌ను చంద్రబాబు అడ్డుపెట్టుకున్నారని ఆరోపించారు. ఆరు వారాల పాటు అధికారాన్ని తన చేతుల్లో పెట్టుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, పరోక్షంగా ఆయనే రాష్ట్రాన్ని పాలించాలని అనుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు కుట్రలకు మారుపేరని, ఎన్టీఆర్‌ను దించి అధికారాన్ని చేజెక్కించుకున్న విషయాన్ని ఎవరూ మరచిపోలేరన్నారు. స్థానిక ఎన్నికలు ఈ నెలాఖరులోగా పూర్తి చేయకపోతే 14వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన సుమారు రూ.5 వేల కోట్లు వెనక్కువెళ్తాయన్నారు. పేదలకు పంపిణీ చేసే ఇళ్ల స్థలాలపై కూడా చంద్రబాబు ముందు నుంచి అడ్డుకుంటున్నారని, ఇప్పుడు ఈసీని అడ్డుపెట్టుకుని ఆరు వారాలు వాయిదా పడేలా చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి చంద్రబాబు సైంధవుడిలా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల వాయిదాపై తక్షణం గవర్నర్‌ స్పందించి ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్‌ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.