విలేకరుల సమావేశం వివరాలు (16.03.2020.)
రాష్ట్రంలో పొలిటికల్ టెర్రరిజం నడుస్తోంది
· రాష్ట్రంలో పౌరులస్వేచ్ఛ, సమానత్వం, హక్కులను తొక్కిపడేస్తున్నారు.
· నామినేషన్లు వేయకుండా టీడీపీని అడ్డుకొని, అవన్నీ ఏకగ్రీవమంటారా?
· వైసీపీకి ఏకగ్రీవమైన స్థానాలన్నింటికీ రీనోటిఫికేషన్ ఇచ్చి, తిరిగి ఆన్ లైన్ లో నామినేషన్లు స్వీకరిస్తే,
టీడీపీ బరిలో ఉందో లేదో తేలుతుంది.
· ప్రభుత్వ నిర్వహణకు మూలస్తంభాలైన శాసన, కార్యనిర్వాహక, పత్రికా వ్యవస్థలను జగన్ కూలదోశాడు.
· ఆయన జమానాలో చివరకు మిగిలింది న్యాయవ్యవస్థే.
· అదికూడా నేలకూలితే, రాష్ట్రంలో మిగిలేది రాచరికమే.
· అప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజుగా, మంత్రులంతా సామంతరాజులు, పాలెగాళ్లు, జమీందారుల్లా మారి ప్రజలను ఏలుతారు.
· జగన్ కు అధికారముంటే, ఎన్నికల కమిషన్ ని, కోర్టులను కూడా రద్దుచేసేవాడు.
శ్రీ దీపక్ రెడ్డి (ఎమ్మెల్సీ)
ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల ప్రాణత్యాగం వల్ల భారతదేశానికి, రాష్ట్రానికి స్వాతంత్ర్యం లభించిందని, కానీ నేడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, జరుగుతున్న దారుణాలు చూస్తే, ఆ దివంగతుల ఆత్మలు క్షోభిస్తాయని టీడీపీనేత, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వాపోయారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగం ద్వారా పౌరులకు సంక్రమించిన హక్కులన్నీ రాష్ట్రంలో కాలరాయబడుతున్నా యని, స్వాతంత్రం వచ్చినప్పుడు దేశంలో 584 రాజ్యాలు ఉండేవని, తదనంతరం అవన్నీ ఒకే జెండా కిందకు తీసుకురావడం జరిగిందన్నారు. రాచరికం, కమ్యూనిస్ట్ విధానం, ఒకే నాయకుడిని బలవంతుడినిచేసి అందరూ అతనికిందే పనిచేసేవిధానం (అటోక్రటిక్ సిస్టమ్) వంటివికాదని, అంతిమంగా ప్రజలచేత, ప్రజల కోసం, ప్రజలద్వారా, ప్రజలవల్ల ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యవ్యవస్థే, ఈదేశానికి, దేశపౌరులకు మంచిదని నిర్ణయించడం జరిగిందని దీపక్ రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగం ద్వారా ప్రజలకు సంక్రమించిన స్వేఛ్ఛ, సమానత్వం, ప్రాథమిక న్యాయం వంటి పౌరులకు సంక్రమించిన ప్రాథమిక హక్కులన్నీ కాలరాయబడేలా, రాష్ట్రంలో పొలిటికల్ టెర్రరిజం కొనసాగుతోందని దీపక్ రెడ్డి స్పష్టంచేశారు. ఆ టెర్రరిజం ఎలా ఉందంటే, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కాలరాస్తోందని, ప్రభుత్వ మాటవినని వారిని బెదిరించడం, భయపెట్టడం, రకరకాలుగా ఇబ్బంది పెట్టడం, అప్పటికీ వినకపోతే వారిపై దాడిచేయడం, కొట్టడం, అంతిమంగా ఆర్థిక మూలాలు దెబ్బతీయడం, తప్పుడు కేసులుబనాయించి కేసులు పెట్టడం వంటివి జరుతున్నా యన్నారు. ఈవిధంగా రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగం యథేచ్ఛగా ఉల్లంఘనకు గురవుతోందని, దానిద్వారా పౌరులకు సంక్రమించబడిన హక్కులను పాలకులే తొక్కిపడేస్తున్నారని టీడీపీ నేత ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై తెలుగుదేశంపార్టీ అనేక ఫిర్యాదులుచేసినా ప్రజల పక్షాన స్పందించాల్సిన పోలీసులు, అధికారయంత్రాంగం పట్టించుకోలేదన్నారు. ప్రజావేదికను కక్షపూరితంగా కూల్చివేశారని, 6కోట్ల రూపాయల ప్రజలసొమ్మును దుర్వినియోగం చేసిందని, కూల్చివేయబడిన శిథిలాలు తొలగించకుండా, అలానే ఉంచడంద్వారా తామను కున్నది చేస్తామనే సంకేతాలను ప్రజలకు తెలియచేస్తోందన్నారు. రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని రాజ్యాంగంపై ప్రమాణంచేసిన మంత్రులు, రాష్ట్రంలో జరగుతున్న సంఘటన లపై ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదన్నారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఏకగ్రీవాలపై సిగ్గులేకుండా మాట్లాడతున్న ముఖ్యమంత్రి, టీడీపీ వారిని అడ్డుకొని 806 నామినేషన్లు పడకుండాచేయడంపై ఎందుకు స్పందించలేదన్నారు. చిన్నచిన్నతప్పులు చూపి, అకారణంగా తిరస్కరించిన 280 నామినేషన్ల గురించి గానీ, టీడీపీవారిని భయపెట్టి, 1486 నామినేషన్లు ఉపసంహరింపచేయడంపై గానీ ముఖ్యమంత్రి ఎందుకు చెప్పలేదని దీపక్ రెడ్డి నిలదీశారు. అవకతవకలు, అన్యాయాలు, దౌర్జాన్యాలు, ప్రలోభాలతో 2571 నామినేషన్లు తిరస్కరించారని, దానిపై జగన్మోహన్ రెడ్డి నోరెందుకు మెదపలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దౌర్జన్యాలపై, నామినేషన్ల ప్రక్రియలో జరిగిన దారుణాలకు సంబంధించిన సమాచారాన్ని, తాము ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి తెలియచేసినా, వాటిపై ఎన్నికల కమిషన్ ఏవిధమైన చర్యలు తీసుకోలేదని, నిజంగా ఈసీకి చిత్తశుద్ధి ఉంటే, ఆయా ఫిర్యాదులపై ఎందుకు స్పందించలేదని దీపక్ రెడ్డి ప్రశ్నించారు. వైసీపీకి ఏకగ్రీవమైన స్థానాలకు రీనోటిఫికేషన్ ఇచ్చి, ఆన్ లైన్ ద్వారా నామినేషన్లు తీసుకునే వెసులుబాటు ఎన్నికల కమిషన్ కల్పిస్తే, ఆయాస్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారో, లేదో తేలిపోతుందని, ఇలా చేసే ధైర్యం రాష్ట్రప్రభుత్వానికి, ఎన్నికలసంఘానికి ఉందా అని దీపక్ రెడ్డి నిలదీశారు. ధర్మంగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన, అంత ధైర్యం జగన్ ప్రభుత్వానికి ఉంటే, వైసీపీకి ఏకగ్రీవమైన స్థానాలన్నింటిలో వేసిన నామినేషన్ల ఎన్ని, అవి ఎందుకు తిరస్కరించబడ్డాయి, ప్రభుత్వ ఆదేశాలకు లోబడి అకారణంగా నామినేషన్లు తిరస్కరించిన అధికారులెవరనేది ఆరాతీసి, ప్రతిపక్షంపై దాడికి పాల్పడిన వైసీపీవారిని గుర్తించి, వారిపై న్యాయపరంగాచర్యలు తీసుకోవాలని దీపక్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికారపార్టీకి ఏకగ్రీవమైన స్థానాల్లో, టీడీపీ తరుపున నామినేషన్లు వేసిన అభ్యర్థుల జాబితాను ముఖ్యమంత్రికి అందచేస్తామని, ఆ జాబితా ప్రకారం తమపార్టీ వారి నామినేషన్లు ఆమోదించి, తిరిగి ఎన్నికలు నిర్వహించే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా అని ఎమ్మెల్సీ సవాల్ విసిరారు. తమపార్టీ తరుపున పడిన నామినేషన్ల జాబితాను ఆమోదించి, ధర్మబద్ధంగా తిరిగి ఎన్నికలు నిర్వహించి, అప్పుడు వైసీపీవారు గెలిస్తే, ముఖ్యమంత్రి చెప్పినట్లుగా ఆయాస్థానాలన్నీ వైసీపీవేనని అంగీకరిస్తా మన్నారు. ప్రభుత్వం శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, పత్రికా వ్యవస్థ, న్యాయవ్యవస్థ లనే నాలుగుస్తంభాలపై నిలిచి ఉంటుందని, జగన్ పాలకుడయ్యాక రాష్ట్రంలో మూడు స్తంభాలు నేలకొరిగాయన్నారు. కౌన్సిల్ (పెద్దలసభ) తన మాట వినలేదని, దాన్ని రద్దుచేశారని, సాక్షాత్తూ మైనారిటీ వర్గానికి చెందిన ఛైర్మన్ పైనే దాడికి పాల్పడ్డారన్నారు. అంతటితో ఆగకుండా మండలిలోని టీడీపీసభ్యులపై కూడా దాడికి యత్నించారని, దాని నిర్వహణకు రూ.60కోట్ల ఖర్చవుతుందని దుష్ప్రచారం చేయడం జరిగిందన్నారు. పెద్దలసభ నిర్వహణకు కేవలం రూ.18కోట్లే అవుతుందని, గతేడాది బడ్జెట్ పుస్తకాలు చూస్తే ఆ వాస్తవం తెలుస్తుందన్నారు. 88మంది అధికారపార్టీ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయని, అలాంటివారు ఏకపక్షంగా వ్యవస్థలను రద్దుచేయడానికి పూనుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ నిర్వహణకు రెండో స్తంభమైన అధికార యంత్రాం గాన్ని కూడా సర్వనాశనం చేశారని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కింద పనిచేసే ఉద్యోగి, సదరు సీఎస్ ని ఆర్డీవో స్థాయి స్థానానికి బదిలీచేయడం జరిగిందని, ఆ చర్యతో తాము చెప్పిందిచేయకపోతే, ఎలాంటివారికైనా అదేవిధమైన గతిపడుతుందనే సంకేతాలిచ్చారన్నారు. ఇక మూడోస్తం భమైన పత్రికావ్యవస్థ (మీడియా),పై కూడా కక్షసాధింపులకు పాల్పడుతున్నా రని, తమ మాట వినని, తమను ప్రశ్నించే విలేకరులను, పత్రికాధిపతు లను భయభ్రాంతులకు గురిచేస్తూ, బెదిరిస్తూ, వారిని దారికి తెచ్చుకొనే ప్రయత్నాలు చేయడం ద్వారా ఆ స్తంభాన్ని కూడా కూలదోశారన్నారు. నాలుగోస్తంభమైన న్యాయవ్యవస్థ మాత్రమే మిగిలిందని, ఆ ఒక్కదానిపైనే ప్రభుత్వం నిలిచిందని, అదికూడా నేలకూలితే, ఏం జరుగుతుందో చెప్పాల్సిన పనిలేదన్నారు. ఆ ఒక్క స్తంభం లేకపోతే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగై, రాచరికమే మిగులుతుందని, అప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజుగా పిలువబడితే, మంత్రులంతా సామంతరాజుల్లా, జమీందారుల్లా, పాలెగాళ్లలా కొనసాగుతారని దీపక్ రెడ్డి స్పష్టంచేశారు. కొద్దిరోజుల్లో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయని, అప్పుడు ప్రజాప్రతినిధులంతా చెప్పులు, బూట్లు లేకుండా అసెంబ్లీలోకి రావాలనే నిబంధనను జగన్ ప్రభుత్వం తీసుకొస్తుందేమో నని దీపక్ రెడ్డి ఎద్దేవాచేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటినుంచీ 8రోజులకు పైగా, తాము ఎన్నికల కమిషనర్ కు వరుసగా ఫిర్యాదులు చేశామని, వాటిపై ఆయన ఒక్కరోజూ కూడా స్పందించలేదన్నారు. చివరకు జరిగిన దారుణాలపై, తామిచ్చిన ఆధారాలపై ఎన్నికల కమిషనర్ స్పందిస్తే, ఆయనకు కులం అంటగట్టడం దారుణమన్నా రు. తన మాటవినలేదన్న అక్కసుతో, తనకు అధికారముండి ఉంటే జగన్ ఎన్నికల కమిషన్ ని కూడా రద్దు చేసేవాడేనన్నారు. జగన్, ఆయన ప్రభుత్వం చేసే తప్పులను కోర్టులు అనేకసార్లు ఎత్తిచూపాయని, ఆయనకు అధికారముంటే వాటిని కూడా రద్దుచేస్తాడని, అంతిమంగా తనమాటే నెగ్గాలి, అందరూ తనమాటే వినాలన్న విధంగా పాలన సాగించడానికి కూడా ఆయన వెనుకాడడన్నారు.