జగన్‌కు శంకర్ దాదా బిరుదివ్వాలి’
గుంటూరు: రాష్ట్ర ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిగల సంస్థ అని.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గుర్తించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. గుంటూరులోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల వాయిదా విషయంలో న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకంతో సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లుగానే.. ఎన్నికల సంఘంపై కూడా గౌరవం, నమ్మకం ఉండాలన్నారు. రాజ్యాంగపరంగా ఏర్పడిన అన్ని వ్యవస్థలను ముఖ్యమంత్రి గౌరవించాలని కన్నా హితవు పలికారు. ఎన్నికల సంఘం ఆదేశాలు పాటించాలని.. అదే సమయంలో వారి అధికారాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. నియంత వంటి జగన్ నేతృత్వంలో ఎన్నికలు పారదర్శకంగా జరిగే అవకాశం లేదని ఆరోపించారు. ప్రపంచమంతా కరోనాకు భయపడి జాగ్రత్తలు తీసుకుంటే ముఖ్యమంత్రి మాత్రం పారాసిటమాల్ వేసుకుంటే తగ్గుతుందని చెబుతున్నారని అన్నారు. జగన్‌కు ‘శంకర్ దాదా’ బిరుదు ఇవ్వాలని కన్నా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేసేందుకు ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టాన్ని దుర్వినియోగం చేయడంపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని కన్నా లక్ష్మీనారాయణ వివరించారు.
జగన్‌కు శంకర్ దాదా బిరుదివ్వాలి’