సిమెంటు రేటు తగ్గించిన కంపెనీలు

*16–03–2020*
*అమరావతి*


*పేదలకు ఇళ్లు, ప్రభుత్వ పనులు, పోలవరం ప్రాజెక్టులకు సిమెంటు రేటు తగ్గించిన కంపెనీలు*
*పీపీసీ బస్తా రూ.225కే, ఓపీసీ బస్తా రూ.235కే*
*గడచిన ఐదేళ్లతో పోలిస్తే అతితక్కువ రేటుకు సిమెంటు*
*ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు సిమెంటు కంపెనీల నిర్ణయం*
*సిమెంటు కంపెనీ యజమానులు, ప్రతినిధులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమావేశం*


అమరావతి: పేదలకు ఇళ్ల నిర్మాణం సహా ప్రభుత్వం చేపట్టే పనులు,  పోలవరం ప్రాజెక్టు పనులకు రేట్లను తగ్గిస్తున్నట్టుగా సిమెంటు కంపెనీలు ప్రకటించాయి. ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయాన్ని ప్రకటించాయి. పొజొలానా పోర్టబుల్‌ సిమెంట్‌ (పీపీసీ) బస్తా ధరను రూ.225లుగా, ఆర్డినరీ పోర్ట్‌ సిమెంట్‌ ధరను రూ.235లుగా నిర్ణయించాయి. 2015–16 నుంచి 2019–2020 మధ్యకాలంలో ఏ సంవత్సరంతో పోల్చినా ఈ ధరలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్లో సిమెంటు ధరలు రూ. 380 వరకూ ఉన్నాయి. 
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌తో వివిధ కంపెనీల యజమానులు, ప్రతినిధులు సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు చేపడుతున్న పనులకోసం ఈ ఏడాది అవసరమైన సిమెంటు వివరాలను కంపెనీ ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలియజేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గృహ నిర్మాణ శాఖకు 40 లక్షల మెట్రిక్‌ టన్నులు, పంచాయతీరాజ్‌ శాఖ 25లక్షల మెట్రిక్‌ టన్నులు, జలవనరుల శాఖ 16.57 లక్షల మెట్రిక్‌ టన్నులు, మున్సిపల్‌శాఖ 14.93 మెట్రిక్‌ టన్నులు... తదితర శాఖలు కలిపి మొత్తంగా 1,19,43,237 మెట్రిక్‌ టన్నుల అవసరాలు ఉంటాయని వివరాలు తెలిపారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనులు అని, అలాగే పేదలందరికీ ఇళ్లనిర్మాణం రూపేణా గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు. సిమెంటు ఉత్పత్తి, పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. 


పేదలకు 26.6 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని, ఈ పట్టాలు తీసుకున్నవారితోపాటు సొంతంగా స్థలాలు, పట్టాలు ఉన్న పేదలకు పెద్ద మొత్తంలో ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ కంపెనీ ప్రతినిధులకు తెలియజేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. తక్కువ ధరలతో ఇచ్చే సిమెంటు బ్యాగు ప్రత్యేకంగా వేరొక రంగులో ఉండాలన్నారు. అలాగే ప్రభుత్వ విభాగాలు తమ అవసరాలను సంబంధిత జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తాయని, కలెక్టర్‌ ద్వారా ఈ సిమెంటు పంపిణీ అవుతుందని సీఎం స్పష్టంచేశారు. నాణ్యతా నిర్ధారణ అయ్యాకే చెల్లింపులు జరుగుతాయని సీఎం కంపెనీలకు తెలిపారు. 


పేదలకు ఇళ్ల నిర్మాణం సహా, వివిధ ప్రభుత్వ పనులు, పోలవరం ప్రాజెక్టులకు సిమెంటు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని సిమెంటు కంపెనీ ప్రతినిధులు స్పష్టంచేశారు. అవసరాలమేరకు పంపిణీ అయ్యేలా తగిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి సమస్యల పరిష్కారానికి కంపెనీల తరఫునుంచి ఇద్దరు ముగ్గురితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని సిమెంటు కంపెనీల ప్రతినిధులు తెలిపారు. 
సమావేశంలో జువారి సిమెంట్, భవ్య, సాగర్, కేసీపీ, రైన్, భారతి, అల్ట్రాటెక్, జేఎస్‌డబ్ల్యూ, శ్రీ చక్ర, ఇండియా, మై హోం, రాంకో, పెన్నా, దాల్మియా, ఆదిత్యా బిర్లా, చెట్టినాడ్, పాణ్యం, పరాశక్తి, ఎన్‌సీఎల్‌ తదితర కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు.