భయపడొద్దు..ఎక్కడేం జరిగినా ఫిర్యాదుచేయండి: డి.జి.పి

భయపడొద్దు..ఎక్కడేం జరిగినా ఫిర్యాదుచేయండి
ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ విజ్ఞప్తి 
మంగళగిరి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ చెప్పారు. స్థానిక ఎన్నికల్లో భద్రత, బందోబస్తుపై ఆయన మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల వాతావరణం నేపథ్యంలో వారం రోజుల్లో 43 ఘటనలు చోటుచేసుకున్నాయనీ.. 35 కోట్లాట ఘటనలు జరిగాయని చెప్పారు. ఇప్పటివరకు లక్షా 9వేల మందిని బైండోవర్‌ చేసినట్టు గుర్తించామన్నారు. రూ.కోటి 85లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ చెప్పారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన 25 మందిపై కేసులు పెట్టినట్టు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 59,545 మంది పోలీసులను వినియోగిస్తున్నామన్నారు. 
మద్యం పంపిణీ చేస్తే చర్యలు తప్పవ్‌
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లు ఉపయోగిస్తామని డీజీపీ చెప్పారు. జిల్లాలకు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల్ని పంపిస్తామన్నారు. మద్యం, నగదు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా ఫిర్యాదు చేయాలని సవాంగ్‌ సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,950 సున్నిత ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పారు. కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి అదనపు బలగాలను తీసుకుంటామని తెలిపారు. మాచర్ల దాడి నిందితులపై 307 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించినట్లు డీజీపీ వివరించారు. కేంద్రబలగాలు వస్తే మంచిదే కదా అని వ్యాఖ్యానించారు. 
రాజకీయ విమర్శలపై స్పందించలేం
మాచర్ల దాడి ఘటనపై అనేక రకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని.. ఆ ఘటనను పోలీసులు సుమోటోగా తీసుకున్నట్లు డీజీపీ తెలిపారు. బాధితులు పోలీసులకు చెప్పే మాచర్ల వెళ్లామని చెబుతున్నారన్నారు. అయితే పోలీసులకు ఎప్పుడు చెప్పారో, ఎవరు చెప్పారో ప్రశ్నిస్తామని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి వస్తోన్న రాజకీయ విమర్శలపై తాము స్పందించలేమని డీజీపీ స్పష్టం చేశారు. పోలీసులకు స్పష్టమైన ఫిర్యాదు వస్తేనే చర్యలు తీసుకుంటామని.. ఇప్పటివరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లలో 43 ఫిర్యాదులు వచ్చాయన్నారు. స్థానిక ఎన్నికల్లో అనేక ఘటనలకు బాగా ప్రచారం చేస్తున్నారని.. చిన్న ఘటనపైనా అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.