సీఎం జగన్‌ పీఏ రవిశేఖర్‌కు మాతృ వియోగం

సీఎం జగన్‌ పీఏ రవిశేఖర్‌కు మాతృ వియోగం
తల్లి లక్ష్మీదేవమ్మ మృతదేహం వద్ద విషాద వదనంతో రవిశేఖర్‌
ఫోన్‌లో పరామర్శించిన సీఎం వైఎస్‌ జగన్‌
నివాళులర్పించిన ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఇతర నేతలు
వైఎస్‌ఆర్‌ జిల్లా, పులివెందుల : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్‌ మాతృమూర్తి లక్ష్మీదేవమ్మ(67) బుధవారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూసింది.  పది రోజుల నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె.. స్వగృహంలో మరణించింది.  రవిశేఖర్‌ హుటాహుటిన తాడేపల్లెగూడెంలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి పులివెందుల చేరుకున్నారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ తొండూరు మండల ఇన్‌చార్జి వైఎస్‌ మధురెడ్డి, పులివెందుల మున్సిపల్‌ ఇన్‌చార్జి వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ డాక్టర్స్‌ విభాగపు రాష్ట్ర కార్యదర్శి వైఎస్‌ అభిషేక్‌రెడ్డి, వైఎస్సార్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి జనార్ధన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, లింగాల మండల నాయకుడు దంతలూరు కృష్ణ, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ చిన్నప్ప, పట్టణ కన్వీనర్‌ వరప్రసాద్‌తోపాటు పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు రవిశేఖర్‌ స్వగృహానికి చేరుకుని లక్ష్మీదేవమ్మకు నివాళులర్పించారు. అంత్యక్రియలు గురువారం సాయంత్రం సింహాద్రిపురం మండలం బి.కొత్తపల్లెలో నిర్వహించారు. 
లక్ష్మీదేవమ్మకు నివాళులర్పిస్తున్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి
సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం : లక్ష్మీదేవమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సాయంత్రం రవిశేఖర్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులను ఫోన్‌ ద్వారా పరామర్శించారు. అధైర్యపడవద్దని.. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.