ఏపీ ఎన్నికల కమిషనర్‌కు సీఎస్‌ లేఖ

ఏపీ ఎన్నికల కమిషనర్‌కు సీఎస్‌ లేఖ
అమరావతి : కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. ఎన్నికలు యథావిధిగా చేపట్టేందుకు కార్యాచరణ చేపట్టాలని విన్నవించారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి లేదని.. పరిస్థితి అదుపులోనే ఉందని వివరించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోందని లేఖలో వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంకి లేకుండా కరోనా నియంత్రణ చర్యలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. పోలింగ్‌ రోజున జనం గుమిగూడకుండా నియంత్రించవచ్చని తెలిపారు. మరో 3,4 వారాలపాటు కరోనా నియంత్రణలోనే ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.
కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో  స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాలపాటు వాయిదా వేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.