కరోనాపై తీవ్రఆందోళన అవసరం లేదు:జగన్‌

కరోనాపై తీవ్రఆందోళన అవసరం లేదు:జగన్‌
అమరావతి: కరోనా వైరస్‌పై తీవ్రంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కేవలం 60 ఏళ్లు పైబడిన వాళ్లు, డయాబెటిక్‌, బీపీ, కిడ్నీ, లివర్‌ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి వస్తే ఇది హానికరమైన వ్యాధిగా పరిగణించాలని చెప్పారు. అయితే ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండకూడదని ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం తరఫున చర్యలు చేపట్టామన్నారు. కరోనా అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం మీడియా సమావేశం నిర్వహించారు.  తొలుత ఆయన మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితుల్లో మీడియా సమావేశం నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుందనుకోలేదని చెప్పారు. స్థానిక ఎన్నికల వాయిదా ఉద్దేశించి మాట్లాడుతూ వ్యవస్థలను తెదేపా అధినేత చంద్రబాబు నీరుగార్చే కార్యక్రమం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి వచ్చినందుకు ఏపీ ప్రజలంతా చింతించాల్సిన అవసరముందన్నారు. 
ఎవరో ఆర్డర్లు రాసిస్తే ఎస్‌ఈసీ చదివి వినిపిస్తున్నారు!
స్థానిక ఎన్నికల వాయిదాపై సీఎం జగన్‌ స్పందిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌పై విమర్శలు చేశారు. ఆయన తన విచక్షణ కోల్పోయి మాట్లాడారన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే రమేశ్‌కుమార్‌ నియమితులయ్యారని చెప్పారు. ‘‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను మేం నియమించలేదు. ఎస్‌ఈసీకి కుల, మతం, ప్రాంతం అనే స్వార్థాలు ఉండకూడదు. చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎస్‌ఈసీ పదవిలోకి తీసుకున్నారు. ఎవరో ఆర్డర్లు రాసి పంపిస్తే ఎస్‌ఈసీ చదివి వినిపిస్తున్నారు. విచక్షణాధికారం పేరుతో ఏకపక్షంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. కలెక్టర్లు, ఎస్పీలను ఎస్‌ఈసీ ఏకపక్షంగా ఎలా తప్పిస్తారు? ప్రజల చేత ఎన్నికైన సీఎం కంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఎక్కువ అధికారాలు ఉంటాయా? రాష్ట్రాన్ని కూడా ఎన్నికల కమిషనరే పాలించవచ్చు కదా?’’ అని తీవ్రస్థాయిలో జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైకాపా జోరుతో తెదేపాకు భయం
స్థానిక ఎన్నికల వాయిదాపై కనీసం సీఎస్‌, వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శులతోనూ చర్చించలేదని జగన్‌ ఆరోపించారు. ఎన్నికల వాయిదాపై జారీ చేసిన ఉత్తర్వుల్లో మాత్రం వారిని సంప్రదించినట్లు పేర్కొన్నారని ఆక్షేపించారు. స్థానిక ఎన్నికల్లో వైకాపా జోరు చూసి తెదేపాకు భయం పట్టుకుందన్నారు. 10,243 చోట్ల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతుంటే కేవలం 43 చోట్లే చెదురుమదురు ఘటనలు జరిగాయన్నారు. 2794 వార్డుల్లో 15185 నామినేషన్లు దాఖలైతే.. వీటిలో 14 చోట్లే చెదురుమదురు ఘటనలు జరిగాయని చెప్పారు. ఏ స్థానిక ఎన్నికల్లో అయినా ఇంతకంటే తక్కువ ఘటనలు జరిగాయా? అని జగన్‌ ప్రశ్నించారు. ఈ ఎన్నికల ప్రక్రియలో పోలీసులు ఎక్కడా ప్రేక్షకపాత్ర వహించలేదని.. నిబద్ధతతో వ్యవహరించారని సీఎం అన్నారు. ‘‘ఏకగ్రీవాలు కావడం కొత్తేమీ కాదు. 2013లో జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ జరిగాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాల్లో వైకాపా విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. మా మేనిఫెస్టోలో ఏం చెప్పామో దాన్ని అమలు చేస్తున్నాం. ప్రజలు మెచ్చుకునేలా మంచి పాలన తీసుకొచ్చాం. ఇలాంటి పరిస్థితుల్లో వైకాపా స్వీప్‌ చేస్తే చంద్రబాబు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు?’’ అని జగన్‌ ప్రశ్నించారు.
ఆ నిధులు ఎందుకు పోగొట్టాలి?
‘‘మార్చి 31లోపు ఎన్నికలు పూర్తయితే 14వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ.5వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే వీలుంటుంది. ఎన్నికలు జరగకపోతే ఆ నిధులు రావు. ఆ నిధులను ఎందుకు పోగొట్టాలి? అవి వస్తే ఎక్కడో ఓ చోట అభివృద్ధి కనిపిస్తుంది కదా. కేవలం సీఎం కాలేకపోయాననే ఒకే ఒక్క కోపంతోనే చంద్రబాబు ఈ విధంగా చేయించారు. ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడటం వల్ల ఆ నిధుల పరిస్థితేంటి? వచ్చే ఏడాది నిధులూ పోవాలా? దీని గురించి ఆలోచించాలి. పది రోజుల్లో స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలి. ఎన్నికలు పూర్తి చేసేస్తే అభివృద్ధి కోసం అడుగులు ముందుకు వేయొచ్చు. కానీ ఇలా జరగకూడదని భావించడంతో ఎవరికి అన్యాయం చేస్తున్నామో ఆలోచించుకోవాలి. స్థానిక ఎన్నికల వాయిదా అంశంలో ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ నిర్ణయంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. ఎస్‌ఈసీని పిలిచి మాట్లాడాలని చెప్పాం. అప్పటికీ ఎస్‌ఈసీలో మార్పు రాకపోతే ఈ అంశాన్ని పైస్థాయికి తీసుకెళతాం’’ అని జగన్‌ స్పష్టం చేశారు.