కరోనా పై అప్రమత్తం

 


కరోనా పై అప్రమత్తం


💐 *విదేశాల నుండి జిల్లాకు వచ్చే వారి పై ప్రత్యేక దృష్టి సారించి 14 రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచండి*  


💐 *కరోనా పై వస్తున్న వదంతులను నమ్మవద్దు . . ప్రజల్లో కరోనా పై అవగాహన పెంపొందించండి*  


💐 *కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది* 


 *: జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త* 


చిత్తూరు, మార్చి 18: కరోనా వైరస్ పై వస్తున్న వదంతులను విని ప్రజలు ఆందోళన పడకుండా కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తల పై పూర్తి అవగాహన తీసుకుని వచ్చేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తల పై నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది.


          ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విదేశాల నుండి వచ్చే వారి పై ప్రత్యేక దృష్టి సారించాలని, జిల్లాలో తిరుమల పుణ్యక్షేత్రంకు వచ్చే విదేశీయులకు మరియు విదేశాల నుండి తిరిగి వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. విదేశాల నుండి జిల్లాకు వచ్చే వారి వివరాలన్నింటినీ జిల్లా వైద్యఆరోగ్య శాఖ వారు సేకరించి నియోజకవర్గాల నోడల్ అధికారులకు తెలపాలని ఆదేశించారు. విదేశాల నుండి జిల్లాకు వచ్చే వారి పూర్తి అడ్రెస్ ను మండల స్థాయిలో గల ఎంపిడిఒలు/ తహశీల్దార్లకు తెలపడం ద్వారా వారు ఇంటి నుండి 14 రోజుల పాటు వారు బయటకు రాకుండా ఉండే విధంగా తగు సూచనలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా జిల్లా యంత్రాంగం గ్రామ స్థాయిలో సర్వైలెన్స్ టీమ్, సర్వే టీమ్, రిసోర్స్ మొబిలైజేషన్ టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విదేశాల నుండి వచ్చిన వారి అడ్రెస్లు సంబంధిత మండలాలలో చూసినప్పటికీ ఆచూకీ దొరకకపోతే సంబంధిత పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయాలన్నారు.


          గ్రామ స్థాయిలో గల సర్వే టీమ్ ఇంటింటికీ వెళ్ళి ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని ఏఎన్ఎం లు, ఆశా లు చేయడం జరుగుతున్నదని తెలిపారు. రిసోర్స్ మొబిలైజేషన్ టీమ్ పారిశుధ్య నిర్వాహణకు అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రధానంగా గ్రామ స్థాయిలో సర్వేకి వెళ్ళే బృందం లోని సభ్యులు కూడా మాస్క్ లు ధరించి వెళ్లాలని సూచించారు. వైద్య/ఆరోగ్యశాఖతో పాటు అన్ని సంబంధిత శాఖలు సమన్వయం చేసుకుని ఈ విపత్తును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. గ్రామ/మండల స్థాయిలో కరోనా వైరస్ నియంత్రణకు కేటాయించిన సిబ్బందికి కూడా కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవలసిన చర్యల పై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాలని డిఎం అండ్ హెచ్ఓ, డిసిహెచ్ఎస్ లను కలెక్టర్ ఆదేశించారు. ఇంత వరకు జిల్లాలో పాజిటివ్ కేసు నమోదు కాలేదని, ఇసోలేషన్ వార్డుల్లో ఉంచే విదేశీయులకు అవసరమైన మంచి భోజనం, వసతి, పారిశ్యుధ్యం, ఇతరత్రా సదుపాయాలు అన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.    


          ఈ సమావేశంలో జెసి డి. మార్కండేయులు, జిల్లా నోడల్ అధికారి మరియు జెసి 2 చంద్రమౌళి, మదనపల్లె సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి, డిఎఫ్ఓ లు సునిల్ కుమార్ రెడ్డి, నరేంద్రన్, ట్రైనింగ్ కలెక్టర్ పృథ్వీ తేజ్, డిఎం అండ్ హెచ్ఓ పెంచలయ్య, డిసిహెచ్ఎస్ డా. సరళమ్మ, డిఆర్డిఏ పిడి మురళి, డ్వామా పిడి చంద్ర శేఖర్, అడిషనల్ డిఎంఅండ్ హెచ్ఓ అరుణ కుమారి, పిఓ డిటిసి రమాదేవి, ఏరియా హాస్పిటల్, సామాజిక ఆరోగ్య కేంద్రం, ఎస్.వి.ఆర్.ఆర్ హాస్పిటల్స్ మెడికల్  సూపరింటెండెంట్లు, డివిజినల్ ప్రోగ్రాం ఆఫీసర్స్, కరోనా వైరస్ నివారణకు ఏర్పాటు చేసిన బృందాల్లో గల డాక్టర్లు పాల్గొన్నారు.