ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ వాయిదా
విజయవాడ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసింది. ఎన్నికల ప్రక్రియను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ ప్రకటించారు. విజయవాడలో ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా ఊహించని మార్పులు వచ్చాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పేపర్ బ్యాలెట్‌వల్ల కరోనా విస్తరించే ప్రమాదం ఉంది. విధిలేని పరిస్థితుల్లోనే స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నాం. పార్టీలు, ఉద్యోగులు, అన్ని వర్గాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆరు వారాల తర్వాత సమీక్ష చేపడతాం. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాకే ఎన్నికలు నిర్వహిస్తాం.’ అని ఆయన ప్రకటించారు.
తీవ్రంగా పరిగణిస్తున్నాం..
స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని రమేశ్‌కుమార్ పేర్కొన్నారు. కొన్ని చోట్ల బెదిరింపులకు దిగడం దారుణమని అన్నారు. కొందరు అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుపతి, మాచర్ల, పుంగనూరు ఘటనలను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను తప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ వేరే అధికారులను నియమించాలని ఆదేశించామన్నారు. మాచర్ల సీఐను సస్పెండ్ చేయాలని.. శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలను బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నామన్నారు. తిరుపతి, పలమనేరు, తాడిపత్రి రాయదుర్గం సీఐలను బదిలీ చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
కోడ్ కొనసాగుతుంది..
ఎన్నికల ప్రక్రియ రద్దు కాలేదని.. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి కొనసాగుతుందని రమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు కొనసాగుతారని తెలిపారు.
పూర్తి పక్షపాతంగా వ్యవహరించడం బాధాకరం
‘స్థానిక ఎన్నికల ప్రక్రియలో అనేక హింసాత్మక ఘటనలు జరిగాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లలో జరిగిన పరిణామాలు బాధాకరం. బెదిరింపులు, అడ్డుకున్న దృశ్యాలు మాధ్యమాల్లో వచ్చాయి. కొందరు అధికారులపై చర్యలు తీసుకోవడం అనివార్యంగా భావిస్తున్నాం. అధికార యంత్రాంగం పూర్తి పక్షపాతంగా వ్యవహరించడం బాధాకరం. మాచర్ల దాడిలో పాల్గొన్న నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. స్థానిక పోలీసుల వ్యవహారశైలి అభ్యంతరకరంగా ఉంది’ అని రమేశ్‌కుమార్ పేర్కొన్నారు
ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ వాయిదా