తేదీః 05-04-2020
దళారుల చేతుల్లో మోసపోతున్న రైతులు- మద్దతు ధరలు కల్పించడంలో జగన్ విఫలం
ప్రభుత్వమే మద్దతు ధరలకు పంటలను కొనుగోలు చేయాలి- నిమ్మకాయల చినరాజప్ప
రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామనే మంత్రి కన్నబాబు ప్రకటన మాటలకే పరిమితం అయింది. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను జగన్ పట్టించుకోవడం లేదు. లాక్ డౌన్ నేపథ్యంలో రైతులు పండించిన పంటలను సరైన ధరలకు అమ్ముకోలేక అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇదే అదనుగా దళారులు రెచ్చిపోతున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకు పంటలను కొనుగోలు చేస్తున్నారు. పంటలకు మద్దతు ధర లభించక రైతులు అయినకాడికి తమ పంటలను అమ్ముకుంటున్నారు. రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ఎలాంటి కార్యాచరణ లేదు. ప్రభుత్వమే పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసి ధరల స్థిరీకరణ నిధి ద్వారా చెల్లింపులు చేయాలి. వ్యవసాయ ఉత్పత్తులకు లాక్ డౌన్ నిబంధనల నుంచి సడలించినా ఇప్పటికీ అనేక చోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవు పండిన పంటను కోసేందుకు కూలీల కొరత వేధిస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాలు చూపించడంలో జగన్ విఫలమయ్యారు. పండిన పంటలు ఎలా విక్రయించాలో తెలియక అన్నదాతలు సతమతమవుతున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వమే వీరిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
ధాన్యం, మిర్చి, పసుపు, నువ్వులు, అరటి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మినుము, పెసర, కంది, జొన్న, మొక్కజొన్న, శనగ, వేరుశనగ పంటలకు మద్దతు ధర లభించడం లేదు. మినుములు క్వింటాలుకు రూ.5 వేల కంటే తక్కువకు వ్యాపారులు కొంటున్నారు. లాక్‌డౌన్ వల్ల అరటి, మామిడి, నిమ్మ, ఇతర పండ్ల ఎగుమతులు సాగడం లేదు. రాయలసీమలో కేజీ టమోట రూ.2అరటి కేజీ రూ.3కే కొనుగోలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు? పశ్చిమ గోదావరి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. గెలలు చెట్టుకే ఎండిపోయే పరిస్థితి నెలకొంది. గుంటూరు జిల్లాలో మిర్చి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లే ఇంకా పూర్తికాని పరిస్థితి. ఆలస్యంగా పంట వేసిన నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఆక్వా రైతులు లాక్ డౌన్ వల్ల రవాణ ఆంక్షలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆక్వా కల్చర్ మూడు విభాగాలైన సీడ్, ఫీడ్, రొయ్యల పరిశ్రమ కేంద్రాలఏర్పాటుతో పాటు రవాణ సౌకర్యం కల్పించాలి. రబీ సీజన్ లో పంట చేతికి వచ్చే సమయంలో వరికోత యంత్రాలు సమకూర్చడంతో పాటు, కూలీల కొరతను నివారించాలి. అదేవిధంగా పంటలకు మద్దతు ధరలు అందించే పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది. రైతుల సంక్షేమం దృష్ట్యా ఈ జాతీయ విపత్తు సమయంలో రైతులను కాపాడాల్సిన బాధ్యతప్రభుత్వంపై ఉంది.
దళారుల చేతుల్లో మోసపోతున్న రైతులు :నిమ్మకాయల చినరాజప్ప