తొలివిడతగా ఆరు జిల్లాల్లో రూ. 12,308 కోట్లతో పనులకు శ్రీకారం.

అమరావతి
12.04.2020


- రాష్ట్రంలో మంచినీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం.


-  ‘‘వాటర్ గ్రిడ్’’ తో ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటి సరఫరాకు ప్రణాళిక.


- సుమారు రూ.57,622 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ అమలు.


- తొలివిడతగా ఆరు జిల్లాల్లో రూ. 12,308 కోట్లతో పనులకు శ్రీకారం.


- ఈ నెల 16 లోగా జ్యుడీషియల్ ప్రివ్యూకు వాటర్ గ్రిడ్ టెండర్ల ప్రతిపాదనలు.


- 30 ఏళ్ళ అవసరాలకు అనుగుణంగా మంచినీటి సరఫరా వ్యవస్థ.


- తొలివిడతలో 6 జిల్లాలు ఎంపిక. 
- ఉద్దానం, పల్నాడుతో పాటు తీవ్ర ప్రభావిత ప్రాంతాల ఎంపిక. 
- గోదావరిజిల్లాల్లోని తీరప్రాంతాలకు తొలగనున్నమంచినీటి కష్టాలు 
ఆంధ్రప్రదేశ్ లో మంచినీటి కష్టాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేసింది. ఏకంగా 57,622 కోట్ల రూపాయలతో వచ్చే 30 సంవత్సరాల పాటు తాగునీటి అవసరాలను తీర్చే భారీ ప్రాజెక్ట్ కు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలివిడతలో భాగంగా తీవ్ర మంచినీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న ఆరు జిల్లాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందుకు గానూ 12,308 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్దిశాఖ నుంచి పరిపాలనా అనుమతి ఇస్తూ ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి. తాజాగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ పనులను ప్రారంభించేందుకు తుది ఆదేశాలు వెలువడ్డాయి. దీనితో వాటర్ గ్రిడ్ పనులకు టెండర్లు నిర్వహించేందుకు గానూ ముందుగా జ్యుడీషియల్ ప్రివ్యూకు ఈ నెల 16వ తేదీలోగా సదరు పనుల వివరాలను పంపాలని నిర్ణయం తీసుకున్నారు. జ్యుడీషియల్ ప్రివ్యూ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ పనులకు జూన్ మొదటి వారం కల్లా టెండర్లు నిర్వహించడం, పనులను ప్రారంభించేందుక గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్ డబ్ల్యుఎస్) అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 


*ప్రభావిత ప్రాంతాలకే తొలి ప్రాధాన్యత* 
రాష్ట్రంలో మంచినీటి సమస్య తీవ్రంగా వున్న ప్రాంతాలను తొలి విడతలో ప్రభుత్వం ఎంపిక చేసింది. దీనిలో భాగంగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, గుంటూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడపజిల్లాలు ఎంపికయ్యాయి. వీటిలోనూ శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో సురక్షిత నీరు లేకపోవడం వల్ల కిడ్నీవ్యాధులు అత్యధికంగా నమోదవుతున్నాయన్న అంశానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రాంతంలో వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీటిని అందించనున్నారు. అలాగే పల్నాడు ప్రాంతంలోనూ ఎన్నో ఏళ్లుగా ప్రజలను వేధిస్తున్న తాగునీటి కష్టాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. జీవనదిగా వున్న గోదావరి ప్రవహిస్తున్నా... ఆక్వాసాగుతో సముద్రతీర ప్రాంతాల భూగర్భ జలాలు కలుషితమై, మంచినీటి కోసం తపిస్తున్న ఉభయగోదావరి జిల్లాలను కూడా వాటర్ గ్రిడ్ ద్వారా ఆదుకోనున్నారు. అలాగే ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతం, వైఎస్ఆర్ కడపజిల్లాలోని పులివెందుల ప్రాంతాల్లో శాశ్వతంగా మంచినీటి సమస్యకు చెక్ పెట్టేందుకు వాటర్ గ్రిడ్ లో ఎంపిక చేశారు. రోజుకు ఒక మనిషికి పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 100 లీటర్లు, మున్సిపల్ కార్పోరేషన్‌ ల పరిధిలో 150 లీటర్ల నీటిని అందించేలా ప్రతిపాదనలను సిద్దం చేశారు. 


*2024 నాటికి రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి* 
వాటర్ గ్రిడ్ లో భాగంగా 2024 నాటికి ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 30 ఏళ్ల పాటు ఎటువంటి మార్పులు లేకుండా వినియోగించుకునేలా వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ ను అధికారులు రూపొందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 48,662 హ్యాబిటేషన్లకు తాగునీటి కష్టాలకు పూర్తిస్థాయిలో పరిష్కారం లభించనుంది. రాష్ట్రంలోని 94.13 లక్షల నివాసాలకు గారూ ఇప్పటికే 31.58 లక్షల మందికి కుళాయి కనెక్షన్లు వన్నాయి. మిగిలిన నివాసాలకు వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీటి కుళాయిలను అందించనున్నారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 540.68 లక్షల మంది, అర్భన్ ప్రాంతాల్లో 198.10 లక్షల మందికి మంచినీరు అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం మొత్తం 90 టిఎంసిల నీరు అవసరం కాగా, అందుకోసం 52 రిజర్వాయర్ లను నీటి వనరుల కోసం గుర్తించారు. ప్రాజెక్ట్ ను ప్రారంభించిన నాలుగు సంవత్సరాల్లో మొత్తం పనులను పూర్తి చేయాలని, పన్నెండేళ్ళ పాటు దాని నిర్వహణా బాధ్యతలను కూడా కొనసాగించాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. 
ఆరు జిల్లాలకు ‘వాటర్ గ్రిడ్’ కోసం నిధులు కేటాయింపు 
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ లో తొలి విడతలో ఆరు జిల్లాల్లో చేపట్టనున్న పనులకు గానూ ప్రభుత్వం నిధులను కేటాయించింది. తూర్పు గోదావరిజిల్లాకు రూ.3,960 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాకు 3,670 కోట్లు, శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి రూ.700 కోట్లు, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి రూ. 2,665 కోట్లు, ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి రూ. 833 కోట్లు, వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల ప్రాంతానికి రూ.480 కోట్ల రూపాయలను కేటాయించారు. నిధుల సమీకరణలో భాగంగా బ్యాంక్‌ ల నుంచి రూ.2500 కోట్ల రుణం కోసం అధికారులు చర్చలు జరిపారు. అలాగే మరో 7,300కోట్ల రూపాయల రుణం కోసం కూడా ప్రభుత్వం ఆర్థికసంస్థలతో చర్చలు జరుపుతోంది. కేంద్రప్రభుత్వ సంస్థలైన నాబార్డ్, జల్ జీవన్ మిషన్, గ్రామీణ ఉపాధి హామీ పథకం ల ద్వారా కూడా మిగిలిన నిధులను వాటర్ గ్రిడ్ కోసం సమకూర్చుకునేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 110 అర్బన్‌ లోకల్‌ బాడీస్‌ (యుఎల్‌బిఎస్‌) లకు 1418.49 ఎంఎల్‌డిల నీరు సరఫరా జరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్థానికంగా వున్న రిజర్వాయర్లు, జలవనరుల నుంచి తాగునీటి అవసరాలకు పైప్‌ లైన్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. రిజర్వాయర్లు లేని ప్రాంతాల్లో భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నారు. అయితే వేసవికాలంలో భూగర్భజలాలు అడుగుంటుతున్న నేపథ్యంలో తాగునీటి కష్టాలు ప్రారంభమవుతున్నాయి. మరోవైపు తీరప్రాంతంలోని భూగర్భ జలాలు ఉప్పుశాతం పెరిగిపోయి తాగేందుకు వీలు లేకుండా పోతున్నాయి. ఈ మొత్తం పరిస్థితికి పరిష్కారంగా రాష్ట్రప్రభుత్వం వాటర్ గ్రిడ్ పథకాన్ని ముందుకు తీసుకువచ్చింది. 
భూగర్భ జలాల అధిక వినియోగానికి కట్టడి 
వాటర్ గ్రిడ్ అమలు ద్వారా ఇప్పటి వరకు తాగునీటి అవసరాల కోసం పరిమితిని మించి జరుగుతున్న భూగర్భ జలాల వినియోగాన్ని కట్టడి చేయనున్నారు. వాటర్ గ్రిడ్ ద్వారా సాగునీటి ప్రాజెక్ట్ ల నుంచి వ్యవసాయ, ఆక్వా, ఇతర పరిశ్రమల అవసరాలను మినహాయించి మిగిలిన అదనపు నీటి వనరులను నీటిశుద్ది కేంద్రాలకు తరలిస్తారు. అక్కడి నుంచి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటిని అందిస్తారు. అందుకోసం నదులు, చెరువులు, వాగులు,రిజర్వాయర్ లలోని నీటి లభ్యతను గుర్తించి, దానికి అనుగుణంగా ప్రణాళికలను సిద్దం చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం వాటర్ గ్రిడ్ అనుసంధానంతో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నీటిని అందించడం ద్వారా సహజవనరుల ద్వారానే తాగునీటి లభ్యత మెరుగవుతుంది. కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న భూగర్భ జలాల అధిక వినియోగంకు తగ్గించేందుకు, ప్రత్యామ్నాయ వ్యవస్థగా వాటర్ గ్రిడ్ ముందుకు వస్తోంది. దీనివల్ల తీరప్రాంతాల్లోని భూగర్భజలాలు సెలినిటీ భారిన పకుండా సమతూల్యత వుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఫ్లోరైడ్ వంటి సమస్యలకు కూడా వాటర్ గ్రిడ్ తో పరిష్కారం లభిస్తుంది. ప్రకృతి సమతూల్యకు అనుగుణంగా ఒకవైపు భూగర్భజలాలను వాడుకుంటూనే, మరోవైపు ఇతర జలవనరులను కూడా సద్వినియోగం చేసుకునేలా వాటర్ గ్రిడ్ ను రూపొందించారు.