అమరావతి ,09.(అంతిమ తీర్పు) :
కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఇందుకోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు.
ముఖ్యంగా ఈ వైరస్ బారిన పడినటువంటి వారిని గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సర్వే చేపట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1.46 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటివరకు రెండు దఫాలుగా గ్రామ మరియు వార్డు వాలంటీర్లు, వైద్య సేవకులు ప్రతి కుటుంబాన్ని పరామర్శించి వారి విషయాలన్నీ సేకరించడం జరిగినది. వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి మెడికల్ ఆఫీసర్ కి తెలియజేయడం, వారు అనుమానం ఉన్నటువంటి పేషెంట్ దగ్గరికి వెళ్ళటం, పరిశీలన చేయడం గృహనిర్బంధం, ఐసోలేషన్, క్వారంటైన్ ప్రోటోకాల్ ను పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి గ్రామ మరియు వార్డు వాలంటీర్లు మొదటి దశలో 1.35 కోట్ల గృహాలను రెండవ దశలో 1.4 కోట్ల గృహాలను సర్వైవలెన్స్ పద్ధతిలో సర్వే చేయడం జరిగినది. ఇప్పటివరకు 1.32 కోట్ల కుటుంబాలను రెండుసార్లు సర్వే చేయడం జరిగినది.
ప్రస్తుతం మూడవ దశలో సర్వే మొదలు పెట్టడం అయినది. ఇంతకుముందు ఎవరికైనా దగ్గు జ్వరం ఉన్నప్పుడు మాత్రమే వాలంటీర్లు వైద్య అధికారికి తెలియజేసేవారు.
ప్రస్తుతం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వారి ఆదేశాల మేరకు అనుమానిత లక్షణాలు లేకపోయినా కూడా క్రింది విషయాలపైన సర్వే చేయటం మొదలు పెట్టడమైనది.
ఏ కుటుంబంలో అయినా దగ్గు, జ్వరము, జలుబు ఉండి, వయస్సు 65 సంవత్సరాలు పైబడిన వారు, షుగరు, బీపీ, గుండె జబ్బులు ఉన్నటువంటి వారితో పాటు ఎవరైనా బయట రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చినట్లయితే వారి వివరాలు కూడా నమోదు చేయబడతాయి .
ఇప్పుడు సర్వే అంతా ఆన్ లైన్ లో జరుగుతుంది. ఈ సర్వేకి వాలంటీర్ తో పాటు ఆశావర్కర్, ఏఎన్ఎంలు కూడా వెళ్ళవలసి ఉంటుంది. వారి పేర్లు కూడా ప్రతి కుటుంబసర్వేలో నమోదు చేయబడతాయి.
అనుమానిత లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి యొక్క వివరాలు లోకల్ నోడల్ మెడికల్ ఆఫీసర్ కి తెలియజేయడం జరుగుతుంది.
వారు వెంటనే సంబంధిత వ్యక్తులను వారి ఇంటి వద్ద పరిశీలించి, పరీక్షించి గృహనిర్బంధం లేదా క్వారంటైన్ సెంటర్ కు రిఫర్ చేస్తారు. ఆన్లైన్ లో ఈసమాచారం నోడల్ ఆఫీసర్ గారికి తెలియజేయడం జరుగుతుంది. వెంటనే వారు తగిన విధంగా సదుపాయాలు కలుగచేస్తారు.
ఈ సెంటర్లో అన్ని పరీక్షలు చేయటం జరుగుతుంది. పరీక్షల రిజల్ట్ ప్రకారం ఎవరికైనా లక్షణాలు ఉన్నట్లయితే 14 రోజుల క్వారంటైన్ కి రికమండ్ చేస్తారు. 14 రోజుల్లో వ్యక్తి రోగనిర్ధారణ లక్షణాలను బట్టి ఒకవేళ పాజిటివ్ వచ్చినట్లయితే కోవిడ్ హాస్పిటల్ సెంటర్ కు పంపిస్తారు. రిపోర్ట్ నెగిటివ్ వస్తే అక్కడ నుంచి డిశ్చార్జ్ చేస్తారు.
పాజిటివ్ వచ్చిన వారి వివరాలను ఆన్లైన్లో హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి తెలియజేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మెడికల్ సదుపాయాలు హాస్పిటల్ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆరోగ్య వివరాలు సేకరిస్తూ అనుమానం వచ్చి నటు వంటి వారి విషయాలు వైద్య బృందానికి తెలియజేయడం, అన్ని పరీక్షలు చేస్తూ ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్లయితే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారు డిశ్చార్జి అయ్యేవరకు వారికి అన్ని రకాల వైద్య సదుపాయాలు సమకూర్చడం జరుగుతోంది.
ఇదంతా ఎప్పటికప్పుడు క్రింద తెలియజేసిన లింకులో పూర్తి వివరములు తెలుసుకోవచ్చు.
ఈ సర్వైలెన్స్ కార్యక్రమమును వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ గారి ఆధ్వర్యంలో పకడ్బందీగా నిర్వహిస్తూ ఉన్నారు.
మూడవ దశలో సర్వే ద్వారా ఇప్పటివరకు 12,311 మందిని అనుమానితులను గుర్తించి 1754 మందిని గృహ నిర్బంధంలో ఉంచడం, 26 మందిని టెస్ట్ లకు పంపించడం జరిగింది.
08.04.2020 నాడు ఒక్క రోజులోనే 3,48,814 కుటుంబాలను సర్వే చేయడం జరిగినది. అందులో 604 మందిలో వారికి ఉన్న లక్షణాలను బట్టి వైద్యులకు రిఫర్ చేయడం జరిగినది.
ఈ విధంగా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వాలంటీర్లు, ఆశావర్కర్, ఏఎన్ఎంలు మీ ఇళ్లకు సర్వే కోసం వచ్చినపుడు సరైన సమాచారం ఇవ్వడం చాలా కీలకమని ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలియజేశారు.