తిరుపతి, 2020 ఏప్రిల్ 11
మూగజీవాలపైనా శ్రీవారి దయ
కరోనా నేపథ్యంలో పశువులకు గ్రాసం, దాణా సరఫరా
500 వీధికుక్కలకూ రెండు పూటలా ఆహారం
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో వేలాది మంది నిరాశ్రయులు, వలస కూలీలు తిండి లేక ఇబ్బంది పడ్డారు. తిరుపతి, పరిసర ప్రాంతాల్లో ఉండే ఇలాంటి వారి ఆకలి తీర్చడానికి టీటీడీ రంగంలోకి దిగింది. రోజూ 50 వేల మందికి అన్నప్రసాదం అందిస్తోంది. మనుషులు సరే మరి మూగ జీవాల సంగతేమిటి ? లాక్ డౌన్ వల్ల జన సంచారం ఆగిపోవడంతో మూగ జీవాలకు కూడా ఆకలి తిప్పలు ఎదురయ్యాయి. గోసాలల్లో ఉన్న పశువుల సంగతి సరే..మరి రోడ్ల మీద తిరిగే పశువుల పరిస్థితి ఏమిటి ? తిరుమల తిరుపతి దేవస్థానం ఈ దిశగా మానవీయ కోణంలో ఆలోచించింది. దేవుడి దృష్టి లో ప్రతి ప్రాణీ సమానమేననే ఆలోచనతో గత 11 రోజులుగా పశువులు, వీధి కుక్కలకు కూడా ఆహారం సరఫరా చేస్తోంది. కోవిడ్ వైరస్ నేపథ్యంలో టీటీడీ తీసుకున్న ఈ మానవీయ నిర్ణయం వివరాలు ఇవీ.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించినప్పటి నుంచి అన్ని వ్యాపార సంస్థలతో పాటు పెద్ద హోటళ్లు, వీధి హోటళ్లు మూత పడిన విషయం తెలిసిందే. హఠాత్తుగా తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం వల్ల తిరుపతిలోని వలస కూలీలు, బిచ్చగాళ్ళు అన్నం కోసం అష్టకష్టాలు పడ్డారు. ఇలాంటి వారి ఇబ్బందులు చూసిన టీటీడీ యాజమాన్యం గత 15 రోజులుగా తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న 50 వేల మంది పేదలకు మధ్యాహ్నం, రాత్రి అన్నప్రసాదంఅందిస్తోంది.
మూగ జీవాల సంగతి?
లాక్ డౌన్ వల్ల మూగ జీవాలు కూడా ఆకలితో ఇబ్బంది పడుతున్న విషయం టీటీడీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. రవాణా ఇబ్బందులతో ఇప్పటికే గోశాలల్లోని పశువులతో పాటు రోడ్ల మీద తిరిగే మూగజీవాలు కూడా అలమటిస్తున్నాయని టీటీడీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీంతో యాజమాన్యం వెంటనే అధికారులను రంగంలోకి దించింది.
గోశాల డైరెక్టర్ కు భాధ్యతలు
తిరుపతి పట్టణం, తిరుచానూరులో రోడ్ల మీద తిరిగే పశువులతో పాటు, తనపల్లి క్రాస్ లోని అయోధ్య స్వామి ఆశ్రమం, నవజీ వన్ వృద్ధాశ్రమం, తిరుపతిలోని రాధ గోవింద గోశాలలోని పశువులకు రోజూ పచ్చి మేత, దాణా సరఫరా చేసే భాధ్యతను ఎస్వీ గోసంరక్షణ శాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డికి అప్పగించారు. రోడ్ల మీద తిరిగే పశువులను అలిపిరి లింక్ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక పశువులశాలకు తరలించి దాన్ని నిర్వహించే భాధ్యతను తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ కు అప్పగించారు. ఈ నెల 1 వ తేదీ నుంచి టీటీడీ ఆధ్వర్యంలో మూగ జీవాల ఆకలి కూడా తీరుతోంది. రోజుకు సుమారు 3 మెట్రిక్ టన్నుల పశుగ్రాసం, 300 కిలోల దాణాను పశువుల కోసం సరఫరా చేస్తున్నామని గోసంరక్షణ శాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి చెప్పారు. లాక్ డౌన్ ముగిసే వరకు ఇదే విధంగా గ్రాసం, దాణా సరఫరా చేసి పశువుల ఆకలి తీరుస్తామని ఆయన చెప్పారు.
వీధి కుక్కలకూ ఆహారం
లాక్ డౌన్ వల్ల ఆహారం సమస్య ఎదుర్కొంటున్న వీధి కుక్కల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు టీటీడీ ప్రతిరోజూ సుమారు 500 వీధి కుక్కలకు కూడా ఆహారం సరఫరా చేస్తోంది.. తిరుపతి నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న వీధి కుక్కలను గుర్తించి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాలంటీర్లతో ఎక్కడి కుక్కలకు అక్కడే టీటీడీ సహాయం తో ఉదయం, సాయంత్రం ఆహారం అందిస్తున్నమని యానిమాల్ కేర్. సంస్థకు చెందిన డాక్టర్ శ్రీకాంత్ చెప్పారు.