ఇనగనూరి.మోహన్ రెడ్డి అందరికీ ఆదర్శప్రాయులు :తహసిల్ధారు సుధాకర్ రావు
వింజమూరు, ఏప్రిల్ 8 (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని కొత్తూరు ప్రాంతానికి చెందిన యువ పారిశ్రామిక వేత్త ఇనగనూరి.మోహన్ రెడ్డి అందరికీ ఆదర్శప్రాయుడని తహసిల్ధారు సుధాకర్ రావు కొనియాడారు. బుధవారం నాడు వింజమూరు శివారు ప్రాంతాలైన చిట్టేడిమిట్ట, మోటచింతలపాళెం వాసులకు నూనె ప్యాకెట్లను మోహన్ రెడ్డి అధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా తహసిల్ధారు మాట్లాడుతూ మోహన్ రెడ్డి గతంలో కొత్తూరు, యర్రబల్లిపాళెం, నడిమూరు ప్రాంతాలకు చెందిన అధికశాతం మంది నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించడంతో పాటు వారి వారి కుటుంబాలను ఆర్ధిక పురోగమనం వైపు పయనింపజేశారనే విషయాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. అంతేగాక వెనుకబడిన ఉదయగిరి ప్రాంతంలోని వింజమూరుకు సమీపంలో ఏకంగా హత్రి ఫార్మా ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ పేరిట ఒక కర్మాగారమును నెలకొల్పుతూ నిరుద్యోగులకు బాసటగా నివాలనే స్పూర్తితో మోహన్ రెడ్డి వేస్తున్న అడుగులకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తహసిల్ధారు అన్నారు. ప్రభుత్వాలు ఒకవైపు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని పారిశ్రామిక రంగాలను ప్రోత్సహిస్తున్న సంధర్భంలో ఇనగనూరి.మోహన్ రెడ్డి తనకున్న నైపుణ్యంతో పరిశ్రమను నెలకొల్పుతుండటం శుభపరిణామమన్నారు. దీంతో పాటు ఆయన ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేయడం మానవత్వం, దాతృత్వాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమాలలో వింజమూరు మాజీ మండలాధ్యక్షుడు గణపం.బాలక్రిష్ణారెడ్డి, వై.సి.పి మండల కన్వీనర్ తిప్పిరెడ్డి.నారపరెడ్డి, యల్లాల.రమణారెడ్డి, గున్నం.హరి తదితరులు పాల్గొన్నారు.