ఎన్నికలు జరిగి ఉంటే ఏపీ పరిస్థితిని ఊహించుకోండి:

ఎన్నికలు జరిగి ఉంటే ఏపీ పరిస్థితిని ఊహించుకోండి: బీజేపీ అధికార ప్రతినిధి
విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీ నేతలు అనేక అక్రమాలకు పాల్పడ్డారని బీజేపీ అధికార ప్రతినిధి సాయి కృష్ణ ఆరోపించారు. తాము ఎన్నికల సంఘానికి ఆధారాలతో ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఇదే సమయంలో కరోనా ముప్పును గుర్తించి రమేష్ కుమార్ వాయిదా వేశారని తెలిపారు. ఎన్నికలు జరిగి ఉంటే... ఎన్ని ప్రాణాలు పోయేవో... పరిస్థితి ఊహించుకోవాలని సాయికృష్ణ పేర్కొన్నారు. ఆనాడు వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు ఎన్నికల కమిషనర్‌ను దూషించారన్నారు. ఇప్పటికీ వాస్తవం గుర్తించకుండా తొలగించడం నీచమైన చర్య అని పేర్కొన్నారు. ప్రజలకు ఏవిధంగా మేలు చేయాలనేది చూడకుండా.. రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దులు దాటకూడదనే ఆంక్షలు అమల్లో ఉన్నాయని సాయికృష్ణ గుర్తు చేశారు. మరి కొత్త ఎన్నికల కమిషనర్ చెన్నై నుంచి అమరావతికి ఎలా వచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వమే కేంద్రం ఆదేశాలను ఆచరించకపోతే... ప్రజలకు ఇంకేమి‌ చెబుతారని ప్రశ్నించారు. దేశం మొత్తం మీద ఏపీ సీఎం జగన్ మాత్రమే లాక్ డౌన్ అమలు.. జోన్ల వారీగా ఉండాలని చెప్పారంటే ప్రజల ఆరోగ్యంపై ఆయనకు బాధ్యత లేదా? అని నిలదీశారు. ఏప్రిల్ 30వరకు  లాక్ డౌన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని సాయికృష్ణ తెలిపారు.