చికెన్, మటన్ దుకాణాల వద్ద ప్రత్యేక చర్యలు

చికెన్, మటన్ దుకాణాల వద్ద ప్రత్యేక చర్యలు


వింజమూరు, ఏప్రిల్ 5 (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి) ఆదివారం వచ్చిందంటే చాలు...వింజమూరులోని బంగ్లాసెంటర్ చికెన్, మటన్, చేపల విక్రయాలతో కొనుగోలు దారుల సందడితో కిక్కిరిసిపోతుంది. గతంలో ఈ పరిస్థితులుండగా ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ప్రజలు సమదూరం పాటించాలనే స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. గత వారం ఈ ఆదేశాలు అమలు కాక తహసీల్ధారు సుధాకర్ రావు, ఎస్.ఐ బాజిరెడ్డిలు తమ సిబ్బందితో ఆపసోపాలు పడాల్సిన దుస్థితి నెలకొంది. అయితే కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా అధికారులు సమదూరం పాటించాలనే విధానానికి మరింతగా పదును పెట్టారు. ఈ ఆదివారం నాడు మండల కరోనా నియంత్రణ టాస్క్ ఫోర్స్ బృందం చికెన్, మటన్ దుకాణాల వద్ద జన సమూహాలు లేకుండా పటిష్ట చర్యలకు శ్రీకారం చుట్టింది. ముందుగా దుకాణాల ముందు నిర్ణీత దూరం ఉండే విధంగా మార్కింగ్ లు వేశారు. యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ ఆదేశాల మేరకు పంచాయితీ కార్యదర్శి శ్రీనివాసులు రెడ్డి దుకాణాల లోపల, బయట, పరిసరాలలో బ్లీచింగ్ వేయించడంతో పాటు హైపోక్లోరైడ్ ద్రావణాలను పిచికారీ చేయించారు. అంతేగాక దుకాణాల వద్ద తమ స్వీయ పర్యవేక్షణలో యం.పి.డి.ఓ నేతృత్వంలో పనిచేస్తున్న సచివాలయ, వాలంటీర్ల బృందాలను సిద్ధం చేసి వినియోగదారులు సామాజిక దూరం పాటించే విధంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రధానంగా భావించి అధికారులు తీసుకున్న కఠిన నిర్ణయాలు పట్ల తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అని భావించే కొంతమంది ప్రబుద్ధులు పెదవి విరిచినప్పటికీ అధికారులు ఎంతో ఓర్పుతో మీ మంచి కోసమే మేము భరిస్తున్నాము అని మనసులో మధన పడుతూ తమ తమ విధులను నిర్వహించారు. వింజమూరు మండలంలో కరోనా నియంత్రణకు అధికారులు చేస్తున్న కృషి కొంతమంది జులాయిలకు శరాఘాతంగా మారి వారశరాఘాతంగా మారి వారి అనాలోచిత నిర్ణయాలకు అడ్డుకట్ట వేయగలిగింది. అధికశాతం ప్రజలు మాత్రం అధికారుల తీరును ప్రశంసిస్తున్నారు. మాస్కులు ధరించండి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి, స్వీయ నిర్భంధంలో ఉండండి, శానిటైజర్లను వినియోగించండి అంటూ అధికారులు పదే పదే విన్నవిస్తున్న విధానాల పట్ల మేధావి వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.