కరోనా..జ్వరం, ఫ్లూలాంటిదే: జగన్‌

కరోనా..జ్వరం, ఫ్లూలాంటిదే: జగన్‌
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరగడం బాధ కలిగించిందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఈ వైరస్‌తో ఆందోళన వద్దని.. ఇది జ్వరం, ఫ్లూ లాంటిదే అని ఆయన చెప్పారు. జ్వరం వస్తే నయమైనట్లే ఇది నయమవుతుందన్నారు. వయసు పైబడిన వాళ్లతో పాటు కిడ్నీ, బీపీ, షుగర్‌లాంటి వ్యాధులు ఉన్నవారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. కరోనా వైరస్‌ సోకితే పాపంగానో, తప్పుగానో దయచేసి చూడొద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్‌ మాట్లాడారు.
‘‘దిల్లీ వెళ్లొచ్చిన వారి వల్ల అనేక మందికి కరోనా వైరస్‌ సోకింది. దిల్లీ వెళ్లిన ప్రతి ఒక్కరినీ, వారిని కలిసిన వారినీ గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఎవరికి బాగోలేకపోయినా స్థానిక ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలి. గ్రామవాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆరోగ్య సిబ్బంది ఎవరొచ్చినా వారికి చెప్పండి. అలాంటి వారికి సంబంధిత పరీక్షలు చేయడమే కాకుండా నయం కావడానికి అవసరమైన మందులు ఇస్తారు. రోజూ వచ్చి పరిశీలించి వెళ్తారు. ఆరోగ్యం విషమిస్తే నేరుగా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తారు. జ్వరం, గొంతునొప్పి, దగ్గు.. ఇలా ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా 104కు ఫోన్‌ చేసి చెప్పాలి. ఈ విషయంలో ఏమాత్రం మొహమాటం వద్దు. దీంతో మీ కుటుంబసభ్యులతో పాటు పొరుగువారికి కూడా మేలు జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 81 శాతం కేసులు ఇళ్లలోనే ఉండి నయమైన పరిస్థితి ఉంది. ఎలాంటి భయాందోళన అవసరం లేదు’’ అని సీఎం సూచించారు.