డెస్క్ జర్నలిస్టులకు కరోనా కష్టాలు
50 శాతం మందికి ఊడనున్న ఉద్యోగాలు
పేజీలతో పాటు ఖర్చులూ తగ్గించే వ్యూహం
హైదరాబాద్ : ఎర్నలిస్టుల ఎత్తుగడకు జర్నలిస్టుల చిత్తయ్యే పరిస్థితులు ఎదురయ్యాయి. కరోనా విపత్తును సాకుగా చూపి నిర్వహణ ఖర్చులు తగ్గించుకునే లక్ష్యంతో ఉన్న కంపెనీల సరసన మీడియా కూడా చేరింది. ఈ క్రమంలో పత్రిక ధర తగ్గించకపోయినా పేజీలను కుదించి ఒకరకంగా ఖర్చును అదుపులో పెట్టుకున్న ప్రింట్ మీడియా ప్రచురణకర్తలు ఇప్పుడు తమ రెండో అస్త్రాన్ని సిబ్బందిని వదిలించుకోవడంపై దృష్టికేంద్రీకరించారు. మరోవైపు, ప్రింట్ మీడియా బాటలోనే ఎలక్ట్రానిక్ మీడియా కూడా పయనించేందుకు సిద్ధమవుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. అందులో భాగంగా డెస్క్ జర్నలిస్టు (సబ్ ఎడిటర్)లను ఇళ్లకు సాగనంపే పనిలో పడ్డారని స్పష్టమవుతోంది. దీంతో డెస్క్ జర్నలిస్టులకు కూడా కరోనా కష్టాలు మొదలయ్యాయనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న సిబ్బందిలో దాదాపు 50 శాతం మంది ఉద్యోగాలు ఊడనున్నాయని ఒక అంచనా. పేజీలతో పాటు ఖర్చులూ తగ్గించే వ్యూహంలో భాగంగా ప్రింట్ మీడియా ప్రచురణకర్తలు తీసుకున్న ఈ నిర్ణయం బాటలోనే ఎలక్ట్రానిక్ మీడియా, కేబుల్ టీవీ నెట్‌వర్క్ సహా వెబ్ మీడియా కూడా పయనించాలని భావిస్తుండడం ప్రస్తుత విపత్కర పరిస్థితులకు అద్దంపడుతోంది. కరోనా కారణంగా పత్రికల సర్క్యూలేషన్ సగానికి పైగా తగ్గిందన్నది అందరికీ తెలిసిందే. ప్రమోషన్, మార్కెటింగ్ పూర్తిగా నిలిచిపోయిన కారణంగా చందాదారులు క్రమంగా తగ్గుతూ వస్తున్నారు. అదే విధంగా, ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయం కూడా కరోనా పుణ్యమాని గణనీయంగా పడిపోయింది. దీంతో పత్రికలన్నీ దాదాపు సగం పేజీలు తగ్గించాయి. జిల్లా టాబ్లాయిడ్లను పూర్తిగా ఎత్తివేసాయి. పత్రికా రంగం ఇంత సంక్షోభాన్ని ఎన్నడూ చూడలేదు. ఈ కారణంగా పత్రికల మనుగడ ప్రశ్నర్ధకరంగా మారింది.
అటు ఎలక్ట్రానిక్ మీడియాలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని కార్పొరేట్ మీడియా దిగ్గజాలను పక్కనపెడితే ఇది వరకటిలా గంట గంటకూ బులిటెన్లు, ప్రాంతీయ సమాచారం, జిల్లాల వారీగా సంక్షిప్త వార్తలు వంటివి దాదాపు అన్ని ఛానళ్లలో గణనీయంగా తగ్గిపోయాయి. వేసిందే పదేపదే వేయడం, పాత కథనాలను మళ్లీ మళ్లీ ప్రసారం చేయడం మినహా కొత్తదనాన్ని శాటిలైట్ టీవీ ఛానళ్లు కోరుకోవడానికి సాహసించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పత్రికలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఇక, చిన్న, మధ్యతరహా పత్రికల గురించి చెప్పాల్సిన అవసరమేలేదు. కేంద్ర (డీఏవీపీ), రాష్ట్ర (డీఐపీఆర్) ప్రభుత్వ ప్రకటనలు, ఏ, బీ, సీ, డీ గ్రేడింగ్‌ల కోసం వేలకు వేలు సర్క్యులేషన్ ఫిగర్స్ చూపించి ఇన్నాళ్లూ నెట్టుకువచ్చిన ఆయా పత్రికల్లో నాలుగైదు మినహా ఇప్పుడు ఫైల్ కాపీలను సైతం ప్రింట్ చేయగలిగే పరిస్థితి లేదు. దాదాపు అవన్నీ పీడీఎఫ్ ఫైళ్ల ప్రచారానికే పరిమితం అయ్యాయి.
పెద్ద పత్రికల విషయానికి వస్తే, సాక్షి యాజమాన్యం 30 శాతం ఆర్థిక భారం తగ్గించునేందుకు కసరత్తు మొదలు పెట్టిందంటున్నారు. ముందుగా ఏపీలో దీన్ని అమలుచేయనునట్లు సమాచారం. డెస్క్ ఇన్చార్జీలను పిలిచి పనిచేయని వారిజాబితా సిద్దం చేయాలని కోరినట్లు సమాచారం. ఆంధ్రజ్యోతి, మిగతా యాజమన్యాలు కూడా అదే బాటలో ఉన్నాయంటున్నారు. ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్న ఆంధ్రజ్యోతి మాత్రం 50 శాతం వరకు సిబ్బందిని తగ్గించే యోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. డెస్క్‌లే కాకుండా మార్కెటింగ్, అడ్వర్టయిజ్‌మెంట్ విభాగాలలో కూడా కోత విధిస్తున్నారు.
అందరికన్నా ముందుగా సీపీఐ(ఎం) పార్టీ అనుబంధ సాహితీసంస్థ అధ్వర్యాన నడుస్తున్న నవ తెలంగాణ పత్రిక పొదుపు చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే 50 శాతం మందికి పైగా తొలగించిన యాజమాన్యం తాజాగా పనికాలానికి మాత్రమే వేతనం చెల్లిస్తామని స్పష్టం చేసింది. తెలంగాణలో పాత జిల్లాల స్టాఫ్ రిపోర్టర్లు మినహా కొత్త జిల్లాల స్టాఫ్ రిపోర్టర్లను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. కరోనా దెబ్బకు అన్ని రంగాల మాదిరి మీడియా రంగం కూడా అతలాకుతలం అవుతోంది. అయితే తొలిదెబ్బ జర్నలిస్టులపైనే పడుతోంది. డెస్క్‌లలో పనిచేసే సబ్ ఎడిటర్లను సాగనంపే చర్యలు మొదలయ్యాయి. జిల్లా టాబ్లాయిడ్ డెస్క్ ఇన్చార్జీలను యాజమాన్యం పిలిచి ఎంత మంది పనిచేస్తున్నారు? ఇందులో బాగా పనిచేసే వారి జాబితా ఇవ్వాలని చెప్పి పంపిస్తున్నట్లు తెలిసింది. కనీసం 50 శాతం మంది సబ్ ఎడిటర్లను ఇంటికి పంపే విధంగా జాబితా రూపొందించాలని సూచనప్రాయంగా చెప్పి పంపిస్తున్నారు. దీంతో డెస్క్ ఇన్చార్జీలు ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుం టున్నారు.
హైదరాబాద్‌లో
ఇప్పటి వరకు అందరితో గొడ్డు చాకిరి చేయించుకుని, అందులో బాగా పనిచేసేవారు ఎవరంటే ఏం సమాధానం చెబుతామని సహచర మిత్రులతో వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో డెస్కులలో పనిచేసే వారి జాబితా యాజమాన్యం చేతుల్లోకి వెళ్లడం, దాని ప్రకారం 50 శాతం మంది సబ్ ఎడిటర్లను ఇంటికి పంపడం ఖాయంగా కన్పిస్తున్నది. కాగా, రాష్ట్రంలోని ప్రధాన తెలుగు పత్రికల యాజమాన్యాలు సిబ్బంది కుదింపు, తగ్గింపుపై ఉమ్మడి నిర్ణయం తీసుకున్నాయనే వార్తలొస్తున్నాయి. కలిసి కట్టుగా నిర్ణయం తీసుకుంటే తప్ప ముందుకు కదలలేమనే భావనతో ఏకగ్రీవ నిర్ణయం తీసుకుని అమలుపరుస్తున్నట్లు మీడియా వర్గాలలో ప్రచారం జరుగుతోంది.
కరోనా పేరుతో స్టాఫ్‌ను తగ్గించుకుని ఆర్థిక గండం నుంచి బయటపడాలనే లక్ష్యంతో ప్రచురణకర్తలు ఉన్నారు. ఇదే దారిలో ఆంగ్ల పత్రికలు కూడా నడుస్తున్నాయి. డెక్కన్ క్రానికల్ పత్రిక వారం రోజుల పాటు ప్రింటింగ్ మూసివేసి మూడు రోజుల కిందటే తిరిగి ప్రారంభించింది. ఆంధ్రభూమి పత్రిక ప్రచురణను తాత్కాలికంగా నిలిపివేసి, సిబ్బందిని ఇంటికే పరిమితం చేశారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక వార్షిక వేతనం ఆధారంగా కోతల స్లాబ్‌లను అధికారికంగా ప్రకటించి అమలు చేస్తోంది. ధనిక రాష్ట్రంగా చెప్పుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా పేరుతో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో భారీ కోత విధించారు. దేశంలో తమది సంపన్న రాష్ట్రమని గంటకొట్టీ మరి చెప్పిన కేసీఆరే కోత నిర్ణయం తీసుకోవడం పత్రికా యాజమాన్యాలకు కలిసి వచ్చిందనే చెప్పాలి. కేసీఆర్ లాంటి వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధిస్తే తప్పు లేనప్పుడు, తాము సిబ్బందిని తగ్గిస్తే తప్పేమి లేదని అంటున్నట్లు తెలిసింది.
ఏడాది కాలంగా తెలంగాణలో గతంలో మాదిరి ప్రభుత్వం నుంచి అడ్వర్టయిజ్‌మెంట్లు రావడం లేదు. పూర్తిగా ప్రైవేటు సంస్థలు ఇచ్చే యాడ్స్‌పైనే మనుగడ సాగిస్తున్నాయి పత్రికలు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం, కరోనా కారణంగా జర్నలిస్టుల బతుకులు బజారున పడుతున్నాయనడంలో ఏ మాత్రం సందేహం లేదనిపిస్తోంది. ఇదిలావుండగా, కరోనా ప్రభావం వెబ్ మీడియా మీద ఏ మాత్రం పడలేదన్నది అర్ధమవుతోంది. మీడియాలో నెలకొన్న ఈ తాజా సంక్షోభం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్యను భూతద్దంలో చూపిస్తున్న విపత్తుగా మారింది. దేశవ్యాప్తంగా దాదాపు 1500 పత్రికలు తాత్కాలికంగా తమ ప్రచురణ నిలిపివేసినట్లు అనధికారిక సమాచారం. అవగాహన లేమితో కొంత మంది వెబ్ ప్రచురణకర్తలు తమ సైట్లను, పోర్టళ్లను, వెబ్ ఛానళ్లను, యూట్యూబ్ ఛానళ్లను నిర్వహించుకోవడంపై నిర్లక్ష వైఖరిని ప్రదర్శిస్తున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వెబ్ మీడియా కరోనా నిరోధక పోరులో చురుకైన పాత్రపోషించడమే కాకుండా తద్వారా ప్రకటనల ఆదాయాన్ని కూడా పెంచుకుంది. ఐటీ సేవలు ఇళ్లకే పరిమితం అయిన నేపథ్యంలో వెబ్ సర్వీసుల నిర్వహణ చార్జీలు కూడా గణనీయంగా తగ్గడం ప్రచురణకర్తలకు కలిసి వస్తోంది.
డెస్క్ జర్నలిస్టులకు కరోనా కష్టాలు