అంతిమతీర్పు.23.8.2019
*నియోజకవర్గ ప్రజలతో మమేకమైన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*
* సొంత నియోజకవర్గం ఆత్మకూరులో ప్రజల కష్టాలు తీర్చేందుకు తీరిక లేకుండా గడిపిన మంత్రి
* శ్రీ కృష్ణాష్టమి రోజున కృష్ణుడివలె ఆపదలు తీర్చేందుకు మంత్రి తమ ఇంటికి వచ్చినట్లుందని ఆనందబాష్పాలు
* రెండు రోజులు వాడవాడలా కలియతిరిగి..గడపగడపను పలకరించి, అప్పటికప్పుడే సమస్యలకు పరిష్కారం
* 'ఎంజీఆర్ హెల్ప్ లైన్'కు ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదు.. పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు
నెల్లూరు, ఆగస్ట్,23 ; సొంత నియోజకవర్గం ఆత్మకూరులో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రెండు రోజులపాటు ఊరూర కలియతిరిగారు. వాడవాడలా పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరించారు. ముఖ్యమంత్రి నవరత్నాల అమలుతో అందరి సమస్యలు త్వరలోనే నతీరుతాయని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రజలకు భరోసానిచ్చారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటిలో ఆత్మకూరు నియోకవర్గాన్ని ముందుకు నడిపిస్తానని మంత్రి స్పష్టం చేశారు. మాటల్లో కాకుండా చేతలతోనే మీకు చూపించేందుకే ఎంజీఆర్ హెల్ప్ లైన్ కి శ్రీకారం చుట్టామని మంత్రి అన్నారు. నియోజకవర్గంలో ఎవరు ఎలాంటి ఇబ్బందులను చెప్పినా , ఫిర్యాదులు చేసినా ఆ సమస్యలను తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. రెండు రోజుల్లో రెండు మండలాల్లోని ప్రజలను కలుసుకుని ఫిర్యాదులపై చర్యలకు ఉపక్రమించారు.
నియోజకవర్గంలోని ఏ. యస్. పేట మండలం పొనుగోడు, రాజవోలు, దూబగుంట ఎస్.సి , ఎస్టీ కాలనీలలోని అంగన్ వాడీ భవనాలను పరిశీలించారు. అక్కడే ఆడుకుంటున్న చిన్నారులను పలకరించి చేయి పట్టుకుని నడుస్తూ పౌష్టికాహారం, సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉన్నా వృద్ధాప్య పింఛన్ అందడం లేదని వాపోయిన వారికి వచ్చే నెల నుంచే పెన్షన్లు అందేలా చర్యలు చేపట్టాలని వారి వివరాలను వెంటనే నమోదు చేసే ప్రక్రియను స్థానిక వాలంటీర్ ద్వారా మంత్రి పూర్తిచేయించారు.
ఏ.ఎస్ పేట మండలంలోని పొనుగోడు గ్రామంలో ఎస్టీ కాలనీ రచ్చ బండపై కూర్చొని గ్రామ సమస్యలు తెలుసుకున్నారు. వీధి దీపాలు లేవని, ఉన్న చోట కూడా కొన్ని వెలగడం లేదని గ్రామ ప్రజలు తమ సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వీధి దీపాల సమస్య పరిష్కారానికి అధికారులకు కావలసిన గడువు ఇచ్చి ఇచ్చిన ఆ గడువులోగా సమస్యను పరిష్కరించాలని వారికి ఆదేశాలిచ్చారు. గురువారం ఆత్మకూరు మండలంలోని వెన్నవాడ, వాసిలి, నెల్లూరు పాలెం తదితర గ్రామాల్లో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. కనపడిన ప్రతి మనిషిని పలకరించి ..సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం కూడా అదే పంథాలో పర్యటన కొనసాగించారు. ఏ.యస్ పేట మండలం పొనుగోడు, రాజవోలు, దూబగుంట ప్రాంతాలలో పర్యటించి జనంతో కలిశారు. దూబగుంటలో కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. కృష్ణుని వేషధారణలో ఉన్న చిన్నారిని ఎత్తుకుని ముద్దు చేస్తూ హత్తుకున్నారు. కాలనీలోని రచ్చబండ వద్ద కూర్చుని ఓపికగా వారి సమస్యలు విన్నారు. త్వరలోనే వాటికి పరిష్కారం చూపుతానని భరోసా ఇచ్చారు.
'ఎంజీఆర్ హెల్ప్ లైన్' ద్వారా ప్రజల ఫిర్యాదులను తీసుకుని వాటిని ఆయనే నేరుగా పరిష్కరించేందుకు స్వయంగా రావడంతో జనం మనసారా స్వాగతం పలికారు. అధికారులు, వాలంటీర్లు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులను వెంట పెట్టుకుని మంత్రి రావడమే కాక, కొన్ని సమస్యలు అప్పటికప్పుడే పరిష్కరించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.