అవసరమైతే మోదీ, అమిత్‌షాను కలుస్తా
అమరావతి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటించారు. నిడమర్రు, కూరగల్లులో పర్యటించిన ఆయన కొండవీటి వాగు వద్ద వంతెన పనుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాజధాని అంశంపై మంత్రులు బాధ్యతగా మాట్లాడాలని సూచించారు. మంత్రుల ప్రకటనలతో తీవ్ర గందరగోళం నెలకొందన్నారు. రాజధానిలో అవినీతి జరిగితే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత సమస్యలపైనా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాలను కలిసే ఆలోచన ఉందన్నారు. సమయం దొరికితే వాళ్లను కలిసి రాష్ట్రంలోని పరిస్థితుల్ని వివరిస్తానన్నారు. రాజధాని మారుస్తామని లీకులివ్వడం సరికాదన్నారు. రాజధాని భూసేకరణను మాత్రమే తాను అప్పట్లో వ్యతిరేకించానని పవన్ గుర్తుచేశారు.
గందరగోళపరిస్తే బలమైన నిర్ణయాలు తీసుకుంటాం : మంత్రి బొత్స అంటున్నట్టుగా ఇక్కడ రాజధాని వద్దని తానెప్పుడూ చెప్పలేదన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తే ఎవరూ వద్దనరన్నారు. మంత్రులు ఏపీ ప్రభుత్వంగా నిలబడాలి తప్ప వైకాపాగా కాదన్నారు. ప్రభుత్వ పరంగా వాళ్లు ఆలోచిస్తే నిర్ణయాలు వేరుగా ఉండేవన్నారు. అందరి రాజధానిగా చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దుతుందని ఆకాంక్షించారు. ఇప్పటికే రాష్ట్ర విభజనతో నష్టపోయామని.. మళ్లీ ఇలాంటి గందరగోళమైన నిర్ణయాలతో నష్టంచేయాలనుకుంటే బలమైన నిర్ణయాలు తీసుకుంటామని పవన్ స్పష్టంచేశారు.
రాజధాని ఇక్కడొద్దని ఎప్పుడూ చెప్పలేదు: పవన్